అనతికాలంలో అంటే అటూ ఇటుగా పదేండ్లలో ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన వ్యక్తి గౌతమ్ అదానీ. గిడ్డంగుల నుంచి పోర్టుల దాకా అన్ని అదానీ పరమైపోయాయి. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. కానీ అదానీ సంపద పెరుగుతూ పోయింది. అంటే మోదీ, అదానీ బంధం ఎంత దృఢమైనదో అర్థం చేసుకోవచ్చు. కానీ పేక మేడలు ఎక్కువకాలం నిలవవు. అదానీ విషయంలోనూ అదే జరిగింది. వారం పదిరోజుల్లోనే దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ మొదటినుంచి వివాదాస్పదంగానే ఉన్నది. దేశ పాలకులు,వ్యాపారస్థుల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి? దేశాన్ని ఎలా కుదేలు చేస్తున్నాయనేదానికి అదానీ కంపెనీలే సరైన ఉదాహరణ అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ముందుగానే తమ కార్పొరేట్ మిత్రులకు లీక్ చేశారనే ఆరోపణలున్నాయి. తన మిత్రుడైన అదానీ కంపెనీల్లో పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలకు వెళ్లారనడానికి ఆధారాలు బయటకువచ్చాయి. 2021లో విండ్ పవర్ ప్రాజెక్టును శ్రీలంక ప్రభుత్వం అదానీ సంస్థకు కేటాయించింది. దీని విలువ 500 బిలియన్ డాలర్లు. ప్రధాని మోదీ ఒత్తిడి వల్లే అదానీ గ్రూప్‌నకు ఈ ప్రాజెక్టును కేటాయించాల్సి వచ్చిందని శ్రీలంక విద్యుత్ బోర్డు చైర్మన్ ఫెర్డినాండో పార్లమెంటరీ స్థాయీ సంఘం విచారణలో చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు కోసం శ్రీలంకలో గ్లోబల్ టెండర్లను పిలిచే వ్యవస్థ ఉన్నది. కానీ నామినేషన్ పద్ధతిలో కేటాయించడంతో దుమారం రేగింది. దీని తర్వాత మోదీ-అదానీ దోస్తీ వ్యాపార లుకలుకలు ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలైంది.
మోదీ ప్రధాని అయిన మొదట్లోనే.. అంటే 2014 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు జపాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2016 నవంబర్ 11, 12 తేదీల్లో మరోసారి వెళ్లొచ్చారు. ఈ రెండు పర్యటనలు ముగిశాక 2018 జూలై 16న జపాన్‌కు చెందిన ఎన్‌వైకే ఆటో లాజిస్టిక్స్ సంస్థతో అదానీకి ఒప్పందం కుదిరింది. 2014 నవంబర్ 14-18 వరకు మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలోనే అంటే నవంబర్ 16న అదానీకి ఆస్ట్రేలియాలో రైల్వే, మౌలిక వసతుల ప్రాజెక్టులు దక్కాయి. ఆస్ట్రేలియా వాణిజ్య శాఖ మంత్రితో మోదీ భేటీ ఫలితంగా ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనులకు లైన్ క్లియర్ అయిందంటూ వార్తలొచ్చాయి. 2015 నవంబర్ 21, 22 తేదీల్లో మలేషియా వెళ్లారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 3న ఐలాండ్ పోర్ట్ ప్రాజెక్టు కోసం అదానీతో మలేషియా ఒప్పందం చేసుకున్నది.
అలాగే 2016 జూలై 7న మొజాంబిక్ వెళ్లారు. ఆ తర్వాతే అంటే 2015 అక్టోబర్ 19న పప్పులు, ధాన్యాలకు సంబంధించి అదానీ కంపెనీతో మొజాంబిక్ అగ్రిమెంట్ చేసుకుంది. 2015 జూన్ 6,7 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు కాంట్రాక్టు అదానీకి దక్కింది. సౌత్ కొరియా ప్రధానితో మోదీ భేటీ ఫలితంగా అదానీ కంపెనీకి రూ.37,500 కోట్ల విలువైన ప్రాజెక్టు దక్కింది. ప్రధాని హోదాలో ఏ దేశానికి పోయినా తన మిత్రుడు అదానీ కోసం ఏదో ఒప్పందం లేకుండా తిరిగిరావడం లేదు. స్వీడన్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, ఇరాన్, ఒమన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటనలు ముగిసిన కొద్దిరోజుల్లోనే అదానీకి భారీ కాంట్రాక్టులు దక్కాయి. విద్యుత్ ఎగుమతులకు సంబంధించి అదానీ కంపెనీ ప్రతినిధులు 2014లో పాకిస్థాన్‌లో పర్యటించారు. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో వ్యాపార సంబంధాలు పెంచుకుంటే తనకు ఇబ్బంది కలుగుతుందని భావించిన మోదీ, ముందుకుపోవద్దని అదానీకి సూచించినట్టు సమాచారం.
మోదీ ప్రధాని అయ్యాక అంబానీ, అదానీల సంపద పెరగడానికే పనిచేస్తున్నారు. తన మిత్రులకు కాంట్రాక్టులు దక్కేందుకు కేంద్ర విచారణ సంస్థలను దుర్వినియోగం చేశారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులతో భయపెట్టి ఆయా కంపెనీలలో అప్పటికే ఉన్నవారు తప్పుకొని తమ మిత్రుడైన అదానీ చేతికివచ్చేలా చేశారు. 2018, అక్టోబర్ 10న కృష్ణపట్నం ఓడరేవుపై, దాన్ని నిర్వహిస్తున్న నవయుగ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. 2020, అక్టోబర్ 6న కృష్ణపట్నం ఓడరేవులో 75 శాతం వాటాలు అదానీ కొనుగోలు చేశారు. 2021 ఏప్రిల్ 6న కృష్ణపట్నంలో మొత్తం 100 శాతం వాటాలను అదానీ తన వశం చేసుకున్నారు. అలాగే 2020 డిసెంబరు 10న ఏసీసీ, అంబుజా, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలపై సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దాడులు చేసింది.
2022 అక్టోబరు 16న ఏసీసీ కంపెనీలో అదానీ వాటాలు దక్కించుకున్నారు. 2020 జూలై 2న సీబీఐ ముంబై విమానాశ్రయం నిర్వాహకులైన జీవీకే యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020 జూలై 18న జీవీకేకు చెందిన ముంబై, హైదరాబాద్ ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. 2020 ఆగస్టు 31న ముంబై విమానాశ్రయాన్ని అదానీకి జీవీకే సంస్థ అమ్మేసింది. ఈ కథ ఇక్కడితో ఆగలేదు. అదానీ చేతికి ఎయిర్‌పోర్టులు అప్పజెప్పేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలను పక్కనపెట్టేశారు. అనతికాలంలో అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు లీజుకు ఇచ్చారు. అదికూడా 50 ఏండ్ల కోసం… కానీ, 1994 ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఒక ప్రైవేటు కంపెనీకి ముప్ఫై ఏండ్ల వరకే ఇవ్వొచ్చు.
ఎన్టీపీసీ బొగ్గు దిగుమతుల కాంట్రాక్టులలో మెజారిటీ వాటా అదానీ ఎంటర్ప్రైజెస్దే. 6.25 మిలియన్ టన్నుల ఎన్టీపీసీ బొగ్గు కాంట్రాక్టును అదానీ ఎంటర్ప్రైజెస్ దక్కించుకున్నది. దీని విలువ రూ.6,585 కోట్లు. దేశవ్యాప్తంగా గతేడాది మార్చిలో కొరత ఏర్పడిన సమయంలో 5.75 మిలియన్ టన్నుల మేర బొగ్గును దిగుమతి చేసుకోవడానికి దాఖలు చేసిన కాంట్రాక్టులు అన్నీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కే దక్కాయి. అదానీ దిగుమతి చేస్తున్న బొగ్గు కొనాల్సిందేనని అప్పట్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకు కేంద్రం అల్టిమేటం జారీచేసింది. ఇది వివాదాస్పదం కావడంతో కాస్త వెనక్కి తగ్గింది. దేశంలో బొగ్గు గనులే కాదు. గోదాంలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు.. ఇలా అన్నీ మోదీ ప్రభుత్వం తమ మిత్రుడికి కట్టబెట్టింది. చివరికి ఎల్ఐసీ సంపదను తీసుకెళ్లి అదానీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. అదానీ కంపెనీల్లో దాదాపు 36 వేల కోట్లకు పైగా ఎల్ఐసీ డబ్బులున్నాయి. అదానీ కంపెనీలకు ఎస్బీఐ దాదాపు రూ.21వేల కోట్లకు పైగా రుణాలిచ్చింది.
అదానీ కంపెనీల ఎదుగుదలలో మోసాలున్నాయని ఇటీవల హిండెన్‌బర్గ్ అనే సంస్థ ఓ నివేదికలో తెలిపింది. దీంతో దాదాపు రూ.10 లక్షల కోట్ల అదానీ సంపద పదిరోజుల్లో ఆవిరైపోయింది. అదానీ కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. అందులో పెట్టిన ఎల్ఐసీ డబ్బుల సంగతేమిటనే ప్రశ్న మిగిలింది. ఇది తనపై దాడి కాదు, భారతదేశంపై దాడి అని అదానీ ప్రకటన ఇచ్చారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, ఆర్ఎస్ఎస్, వారి అనుబంధ సంఘాలు, వాటి అనుబంధ వాట్సాప్ వర్సిటీ మూకలు అదానీ సత్తెపూస, భారతదేశ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు, విదేశాలు కుట్ర చేశాయంటూ ఇప్పుడు ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపిస్తున్నాయి.
అదానీ వ్యవహారంపై జేపీసీ
వేయాలన్న ప్రతిపక్ష డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదు. హిండెన్‌బర్గ్ అనే సంస్థ అమెరికా, చైనా, భారత్‌కు చెందిన మొత్తం 15 కంపెనీల్లో డొల్లతనాన్ని బయటపెట్టింది. అయితే అమెరికా గానీ, చైనా గానీ ఇది తమ దేశంపై దాడి అని ప్రకటలు ఇచ్చి ఆ కంపెనీలను వెనకేసుకొచ్చే పనులు చేయలేదు. కానీ మన దేశంలో మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ పూర్తిగా అదానీని కాపాడే పనిలో ఉన్నది.
ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ నష్టపోతే దాని బాధ్యత ఎవరిది? వాటిలోని ప్రజల సొమ్ముకు బాధ్యులెవరు? ఇప్పటికే మోదీ సర్కారు కార్పొరేట్లకు వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఆ భారాన్ని సామాన్యులపై పన్నుల పేర మోపుతున్నది. మోదీ ప్రధాని అయ్యాక కోట్ల అప్పులు చేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ల రూపంలో 30 లక్షల కోట్లు వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా కాషాయ మీడియాకు కనిపించడం లేదు. ఎందుకంటే చాలా మీడియాహౌజ్లు ఇప్పుడు అదానీ, అంబానీ చేతుల్లో ఉన్నాయి. కులం, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి బీజేపీకి లబ్ధి చేకూర్చే వార్తలు మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. దేశమే పూర్తిగా అదానీ గుప్పిట్లోకి పోతున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదానీపై దాడిని దేశంపై దాడిగా అభివర్ణిస్తూ చేస్తున్న దుష్ప్రచారమే భరతమాతపై జరుగుతున్న అసలైన దాడి. భరతమాతను కార్పొరేట్ల చేతుల్లో బందీ చేసేందుకు జరుగుతున్న కుతంత్రమే ఇదంతా. వీటిని అడ్డుకోవాల్సిన బాధ్య త భారత పౌరులుగా మనపై ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్)
-వై.సతీష్‌రెడ్డి
96414 66666