న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా(Pax Silica)తో ఇవాళ భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ సిలికా డిక్లరేషన్‌పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో రెండు దేశాలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ సమక్షంలో ఈ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ కూడా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌పై నమ్మకం కలిగే రీతిలో ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని, మన ఐటీ సామర్థ్యాన్ని, ట్యాలెంట్‌ను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయని, మన విదేశీ విధానం కూడా అందరిలో నమ్మకం కలిగిస్తోందని మంత్రి వైష్ణవ్ తెలిపారు.
సెమీకండక్టర్ల సరఫరా, ఉత్పత్తి, చిప్ డిజైన్ అన్నీ ప్యాక్స్ సిలికాలో భాగస్వామ్యం అవుతాయని మంత్రి అన్నారు. భారతీయ ఇంజినీర్లు అడ్వాన్స్డ్ నానోమీటర్ చిప్‌లను డిజైన్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల పరిశ్రమలకు సుమారు పది లక్షల మంది నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుందన్నారు. అయితే ఆ స్థాయికి అవసరమైన వర్క్‌ఫోర్స్‌ను ఇండియా అందిస్తుందన్నారు.
ప్యాక్స్ సిలికా గ్రూపును గత ఏడాది డిసెంబర్లో అమెరికా లాంచ్ చేసింది. దీంట్లో కొన్ని కీలకమైన టెక్నాలజీ భాగస్వామ్యులు ఉన్నారు. ప్యాక్స్ సిలికా బృందంలో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయిల్, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, ఇన్నోవేటివ్ సిలికాన్, కృత్రిమ మేధ వ్యవస్థను రూపొందించే ఉద్దేశంతో ప్యాక్స్ సిలికా మొదలుపెట్టారు.