సారంగాపూర్, ఆగస్టు 7 : ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టవద్దని, యూరియా బుకింగ్ యాప్‌ను పూర్తిగా ఎత్తివేయాలని, ఎరువులు సులభంగా అందించే విధానాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆ దేవుడు అల్పపీడన రూపంలో రైతులను కరుణించాడని, దీంతోనే రా ష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో ప్రస్తుతం అంతటా విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగుకు 24 గంటలు సరాఫరా చేసినట్టు ఇవ్వాలని కోరారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో సాగుకు 24 గంటల కరెంట్ ఇచ్చారని, కానీ, ప్రస్తుతం ఉదయం సమయాల్లో మాత్రమే ఇస్తున్నారని, దీంతో రైతులు గోస పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగితే తెలంగాణకు 24గంటల విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పందించాలని, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విమర్శలు మాత్రమే కాకుండా.. దాని ప్రయోజనాలపై నా చర్చ జరగాలని సూచించారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని రేవంత్ రెడ్డి ఉన్న అవకాశాన్ని వినియోగించడం లేదని మండిపడ్డారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సమయానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్‌ను చూసి కేంద్రం కూడా ఈ నెల 13 నుంచి యాప్‌ను తీసుకురావాలని చూస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు స్మార్ట్ఫోన్లు లేవని, యాప్‌ను ఉపయోగించడంపై అవగాహన లేదని, యూరియా బుకింగ్ కోసం మొబైల్ యాప్‌ను తప్పనిసరి చేయడం సరికాదని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు, మాజీ విండో చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు కొండ్ర రాంచందర్‌రెడ్డి, కొక్కు గంగారం, కాలగిరి మధు, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.