Atmiya Sammelanam : ఈమధ్య పూర్వ విద్యార్థుల ‘ఆత్మీయ సమ్మేళనాలు’ తరచూ ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి. చిన్నప్పుడు కలిసి చదువుకున్న దోస్తులంతా ఒక్కచోట చేరి అప్పటి జ్ఞాపకాలను తలచుకొని మురిసిపోతున్నారు. రీ-యూనియన్ వేడుకలో తమ బాల్యాన్ని, స్కూల్ డేస్‌ను యాది చేసుకొని ‘ఆరోజులు మళ్లీ రావు’ అనుకుంటారు. కానీ, డ్రెస్సింగ్, వ్యహరించే తీరు విషయంలో మాత్రం పెద్దవాళ్లం అన్నట్టుగానే ఉంటున్నారు. అయితే.. ఈ బ్యాచ్ మాత్రం విభిన్నం. కాదు కాదు చాలా చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకో తెలుసా.. 50 ఏళ్ల తర్వాత స్కూల్లో కలిసిన వీరంతా విద్యార్థులుగా అప్పుడు ఎంత అల్లరి చేశారో, ఎంత సంతోషంగా గడిపారో అంత ఖుషీగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనం అంటే.. చిన్నప్పటి రోజులు, కల్లాకపటం తెలియని దోస్తులు గుర్తుకొస్తారు. అందుకే.. రీ-యూనియన్ అనగానే అందరూ రెఢీ అయిపోతారు. కానీ, వీరు మాత్రం తమ ఆత్మీయ సమ్మేళనాన్ని చాలా గొప్పగా నిర్వహించుకున్నారు. రాకేశ్ నగర్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ 1976 బ్యాచ్ తన స్నేహితులను కలిసినప్పటి వీడియో ఇది. ఈ సందర్భంగా తాము చేసిన అల్లరిని, బాల్యంలోకి తొంగి చూస్తూ గడిపిన అద్భుత క్షణాలను పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
అందులో.. 50 ఏళ్ల తర్వాత చిన్నప్పటి స్నేహితులను కలిసేందుకు వెళ్లిన వీరంతా.. అప్పటి మాదిరిగా స్కూల్ యూనిఫామ్ వేసుకున్నారు. వీపున బ్యాగు, మెడలో చిన్న నీళ్ల సీసాతో అచ్చం బడి ఈడు పిల్లల్లా తయారైన వీరు.. స్కూల్ గేటు తెరవగానే యా యూ.. అంటూ బడిలోకి పరుగులు తీశారు. క్లాస్‌రూమ్‌లో తాము కూర్చొన్న చోటు, టీచర్ లేనప్పుడు బోర్డు దగ్గర ఆడిన ఆటలు అన్నీ గుర్తు చేసుకొని ‘భలే ఉండేవిరా ఆ రోజులు’ అని సంబురపడ్డారంతా.
‘మేము ఒకప్పుడు నవ్విన, ఆడుకున్న, స్నేహితులమైన అదే స్కూల్‌కు వెళ్లాం. చిన్నపిల్లలమై అప్పటి గోల్డెన్ మెమరీస్‌ను మళ్లీ యాది చేసుకున్నాం’ అని తెలిపిన రాకేశ్ ‘1976 బ్యాచ్, నా బాల్య స్నేహితులు’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ రాశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అరే మనకు రాని ఐడియా వీళ్లకు వచ్చింది.. మనం కూడా వీరిలా రీ-యూనియన్ చేసుకుందాం’ అని అనుకుంటున్నారు.