ఖమ్మం అర్బన్, ఆగస్టు 7: ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల భద్రత, డిజిటల్ విద్య విస్తరణ, అభ్యాసన ఫలితాల మెరుగుదల, పరిపాలనలో సమర్థత పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ మార్గదర్శకత్వంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పీ.శ్రీజ సమన్వయంతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల సభ్యులు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో శుక్రవారం పర్యటించారు. అక్కడ అమలవుతున్న ఉత్తమ విద్యావిధానాలను అధ్యయనం చేశారు.
పీజీఐ ఆధారంగా..
జాతీయస్థాయిలో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) ర్యాంకింగ్స్ ఇటీవల విడుదలయ్యాయి. దాని ఆధారంగా ఏయే జిల్లాల్లో ఏయే అంశాల్లో టాప్‌గా నిలిచాయో గుర్తించారు. ర్యాంకింగ్స్‌లో టాప్‌గా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి అధ్యయనం చేసేందుకు ఖమ్మం కలెక్టర్ ప్రణాళికలు రూపొందించారు. కేవలం సందర్శనలకే పరిమితం కాకుండా అక్కడ అమలవుతున్న ఉత్తమ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. వాటిల్లో ఖమ్మం జిల్లాలో అమలు చేయగల అంశాలను గుర్తించి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రతి బృందంలోని సభ్యులు తమకు కేటాయించిన అంశంపై సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. వాటి ఆధారంగా జిల్లా విద్యాశాఖలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆరు అంశాలు.. ఆరు బృందాలు..
విద్యలో నాణ్యతను పెంచేందుకు అత్యంత కీలకమైన ఆరు అంశాలను కలెక్టర్ ఎంపిక చేశారు. ఆ ఆరు అంశాలను ఆరు జిల్లాల్లో పరిశీలించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను పంపించారు. ఆ ఆరు జిల్లాల్లో ఆ ఆరు బృందాలు పరిశీలించాల్సిన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
బృందాల సభ్యుల వీరే..
జిల్లా నుంచి వెళ్లిన బృందాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పీ.శ్రీజతోపాటు ట్రైనీ అదనపు కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు, సెక్టోరల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సైకాలజిస్టులు, డీఆర్పీలు ఉన్నారు. సంబంధిత జిల్లాలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో పర్యటించి ‘పాఠశాలల్లో ఏయే అంశాలు విజయవంతంగా అమలవుతున్నాయి? మౌలిక వసతులు, డిజిటల్ తరగతులు, భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ఎలా బలోపేతంగా ఉన్నాయి? విద్యార్థుల అభ్యాసన ఫలితాలను అక్కడి ఉపాధ్యాయులు ఎలా మెరుగుపరుస్తున్నారు?’ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
సంకల్పం.. సమన్వయం..
కలెక్టర్ విజన్, అదనపు కలెక్టర్ మానిటరింగ్‌తో ఖమ్మం జిల్లాలో విద్యాపరంగా నూతన మార్పులు అమలు చేసేలా స్పెషల్ మిషన్ అమలు చేయనున్నారు. ఉత్తమ విద్యావిధానాల కోసం ప్రత్యేక స్టడీ టూర్‌ను నిర్వహించారు. స్టడీ టూర్‌లోని అంశాలను అధ్యయనం చేసి అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
