హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కేటుగాళ్లు కొందరు రెండు శాఖల్లో పనిచేస్తున్నట్టు చూపి రెండు జీతాలు పొందుతున్న వైనం బట్టబయలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ఒకే ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు సంస్థల నుంచి జీతాలు తీసుకుంటున్న కేటుగాళ్లను ఆర్థికశాఖ గుర్తించింది. సుమారు 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు రెండు శాఖల్లో పనిచేస్తున్నట్టు మోసగించి, వేతనాలు పొందుతున్నట్టు ఆర్థికశాఖ వెల్లడించింది.
నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో నమోదైన ఉద్యోగుల ఆధార్, ఉద్యోగ వివరాలను సమగ్రంగా ధ్రువీకరించాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఉద్యోగుల ఆధార్ వివరాలు, రికార్డులు, వేతన చెల్లింపులను పరిశీలించి నివేదించాలని సూచించింది. రెండు చోట్ల వేతనాలు పొందిన వారిపై శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.