తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రం అనే లక్ష్యాన్ని ముద్దాడిన తర్వాత అది కొంతమందికి సాదాసీదాగా అనిపించవచ్చు. అది సాధారణ విషయమేనని కొందరు కొట్టిపారేయనూ వచ్చు. కానీ, పాతికేండ్ల కిందట అది మహోజ్వల, చారిత్రక, అనితర సాధ్యమైన విషయం.
ఉద్యమ రథ సారథి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు ఆలోచన, నిర్ణయం వెనుక ఉన్న కథ ఇదీ.. గతంలోకి వెళ్తే.. “1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగుతుండగానే… 1971లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో ఇందిరాగాంధీ ప్రభంజనం వీస్తున్నది. దాన్ని ఎదిరించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని డిమాండ్ చేస్తున్న చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్)కు తెలంగాణ ప్రజలు పట్టంగట్టారు. తెలంగాణలోని 14 పార్లమెంట్ సీట్లలో 11 మంది (టీపీఎస్) అభ్యర్థులను గెలిపించారు. ఆ తొలి దశ ఉద్యమంలోనే 365 మంది విద్యార్థులు తెలంగాణ కోసం అమరులయ్యారు. దీంతో ఉద్యమం ఉధృతమైంది. కర్ఫ్యూలు విధించారు.
ఇన్ని జరిగినా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? స్వరాష్ట్రం కల ఎందుకు సాకారం కాలేదు? టీపీఎస్కు చెందిన 11 మంది ఎంపీలు ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించినా, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వారిని కాంగ్రెస్లో కలుపుకున్నారు.” ఇలాంటి అనేక విషయాలపై టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు ముందే ఏడాది పాటు కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సాధ్యాసాధ్యాలపై సంపూర్ణ అధ్యయనం చేశారు. ఈ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వయంగా చెప్పారు. ‘పార్టీ పెట్టాలా, వద్దా? పార్టీ పెడితే తెలంగాణ కచ్చితంగా రావాలి. అంతే తప్ప, తెలంగాణ పేరిట ఉద్యమాలు చేసి ప్రజలను మభ్యపెట్టవద్దు. వారికి ఆశలు కల్పించి మల్లోసారి తెలంగాణను కాంగ్రెస్కు తాకట్టు పెట్టొద్దు. కాంగ్రెస్ చేతుల్లో తెలంగాణవాదం అణచివేయబడొద్దు. పోలీసుల చేతిలో తెలంగాణ ప్రజలు మళ్లీ లాఠీ దెబ్బలు తినవద్దు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రక్తపాతం జరగొద్దు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశం ఉందా, లేదా?’ అనే అంశాలపై కేసీఆర్ లోతైన అధ్యయనం చేశారు.
టీఆర్ఎస్ స్థాపనకు ఏడాది ముందునుంచే కేసీఆర్ ప్రతిరోజు గంటల తరబడి పలురంగాల మేధావులు, నిష్ణాతులు, పెద్దలతో మేధో మథనం చేశారు. పార్టీలో సిద్ధాంతాలను పక్కనపెట్టి టీడీపీలోని తన సహచరులు, పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను, నేతలను, భిన్న భావజాలాలు కలిగినవారు, 1969 ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, న్యాయ నిపుణులు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, యువత సహా అన్నిరంగాల వారితో చర్చోపచర్చలు జరిపారు. పండితులు, పామరులతో సహా అందరి ఆలోచనలను పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం, కొత్త రాష్ర్టాల ఏర్పాటు ప్రక్రియలపై కేసీఆర్ చాలా లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
రాజ్యాంగంలో కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్-3పై న్యాయ కోవిదులతో చర్చించారు. అంతేకాదు, ఆర్టికల్-3ని రాజ్యాంగంలో పొందుపరిచే సమయంలో రాజ్యాంగసభలో జరిగిన చర్చలపై సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రసంగంపై అధ్యయనం చేశారు. ఏదైనా రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అవసరమని రాజ్యాంగసభలోని మెజారిటీ సభ్యులు ప్రతిపాదించారు. దీన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఈ ప్రతిపాదనను రాజ్యాంగంలో పొందుపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త రాష్ర్టాలు ఏర్పడవు. ఎందుకంటే, ఒక రాష్ట్రం నుంచి విడిపోవాలని ఆకాంక్ష ఒక ప్రాంత ప్రజల నుంచి వస్తుంది. ఆ ప్రాంత శాసనసభ్యులు తక్కువగా ఉంటారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ఉమ్మడి రాష్ట్రం తీర్మానం అవసరమైతే.. కొత్త రాష్ట్రం ఏనాటికీ ఏర్పడదు. ఆ ప్రజల స్వప్నం ఎప్పటికీ నెరవేరదు. కాబట్టి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ అభిప్రాయం మాత్రమే తెలుసుకోవాలి తప్పితే, సమ్మతి అవసరం లేదు’ అనే విషయాన్ని కేసీఆర్ అధ్యయనం చేశారు.
ఆర్టికల్-3 ఆధారంగా ఈ అంశాన్ని పసిగట్టిన కేసీఆర్, నాటి తెలంగాణ ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించారు. తదనంతరం 2004 ఎన్నికల వరకు తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప మన బతుకులు మారవనే విషయాన్ని ప్రజలకు తెలియపరిచారు. పల్లె, నగర బాట, తండా బాట, దళితవాడల్లో బస లాంటి వినూత్న కార్యక్రమాలతో తెలంగాణవ్యాప్తంగా పర్యటించారు.
ఈ క్రమంలో వరంగల్లోని ఓ గిరిజన తండాకు వెళ్లగా.. ఇల్లు అగ్నికి ఆహుతై, బిడ్డ పెండ్లి చేసేందుకు అరిగోస పడుతున్న ఓ లంబాడా ఇంటిని సందర్శించారు. అన్నీ తానై ఆ బిడ్డ పెండ్లి చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచనే తెలంగాణ వచ్చాక కల్యాణలక్ష్మి పథకం రూపంలో ఆచరణలోకి వచ్చింది. అంతేకాదు, తెలంగాణ ప్రాంతంలోనే నాగార్జునసాగర్ ఉన్నా.. నల్లగొండ జిల్లాలో పంటలెండుతున్న వైనాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్ పాదయాత్రకు పూనుకున్నారు. నల్లగొండలోని ఓ పల్లెలో నీళ్లు లేక, పంటను కాపాడుకునేందుకు వందల బోర్లు వేసిన బోర్ల రాంరెడ్డి ఉదంతాన్ని సమాజం దృష్టికి తీసుకొచ్చారు. వలసలతో బక్కచిక్కిన పాలమూరు గోసను ప్రపంచానికి తెలియజేశారు. ఇలా ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా చాటిచెప్పారు.
2004 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఐదుగురు ఎంపీలను గెలిపించుకొని, ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించారు. 2004లో టీఆర్ఎస్ తరపున కేసీఆర్ నాయకత్వంలో ఆయనతో పాటు, నేను, ఆలె నరేంద్ర, మధుసూదన్ రెడ్డి, రవీందర్ నాయక్ ఎంపీలుగా గెలుపొంది ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టాం. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ మంత్రివర్గంలో కేసీఆర్తో పాటు ఆలె నరేంద్ర చేరినప్పుడు… ‘కేసీఆర్ మళ్లీ తెలంగాణను కాంగ్రెస్ను తాకట్టు పెట్టారు’ అని చాలామంది అర్భకులు ఆరోపణలు చేశారు. అలాంటి ఆరోపణలు, విమర్శలు ఎన్ని ఎదురైనా కేసీఆర్ లెక్కచేయలేదు.
తెలంగాణ ఏర్పాటు అనే అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్పించి, కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందుపరిచి, వివిధ రాజకీయ పక్షాలను ఒప్పించి, తెలంగాణ ఏర్పాటుకోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయించడంలో సఫలీకృతమయ్యాం. తెలంగాణ ఏర్పాటు పట్ల తమ అభిప్రాయాలను తెలపాలని ప్రణబ్ ముఖర్జీ కమిటీ చెప్పినప్పుడు… కేసీఆర్ దేశంలోనే అనేక రాజకీయ పార్టీలను కలిశారు. గంటల తరబడి సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ఆయా పార్టీలకు వివరించారు. వారిని ఒప్పించి, తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించారు. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బలమైన పునాది పడింది.
2004లో యూపీఏ ప్రభుత్వంలో చేరిన కేసీఆర్ కేంద్రమంత్రిగా 2006 వరకు కొనసాగారు. తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్ మరోసారి మోసం చేయడంతో తన మంత్రి పదవితో పాటు ఎంపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత కరీంనగర్లో ఆయన మళ్లీ గెలిచారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ కాలు ముందుకు కదపకపోవడంతో 2008లో కేసీఆర్తో సహా మేమంతా ఎంపీ సభ్యత్వాలకు మళ్లీ రాజీనామా చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేశాం. ఈ క్రమంలో 2004 నుంచి 2009 మధ్యకాలంలో తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ ఓ బలమైన పునాది వేశారు. తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీ వేదికగా దేశమంతా వినిపించారు. ఆ సమయంలో ఆయనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తుల్లో నేనూ ఒక్కడిని.
2009 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం ప్రజలను కదిలించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరగడం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2009 నుంచి 2014 ఒక ఘట్టం అయితే అంతకుముందు 2004 నుంచి 2009 వరకు కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ పట్ల ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించారు. అందులో భాగంగానే దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో తెలంగాణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయించారు. 2014లో ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో లోక్సభ, రాజ్యసభల్లో పలు పార్టీల మద్దతు కూడగట్టడంలో కేసీఆర్ పాత్ర కీలకమైనది, మరువలేనిది. ఇలా ఎన్నో ఘట్టాలు, ఎన్నెన్నో… తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇది కీలక ఘట్టం.
– (వ్యాసకర్త: పార్లమెంట్ మాజీ సభ్యులు)
బోయినపల్లి వినోద్ కుమార్