తెలంగాణ కోసం
రక్తం కార్చిన నేల ఇది
ఉద్యమం చేసి రాజ్యం తెచ్చుకున్న జనం
ఈ రోజు మళ్లీ మోసపు రాజకీయాల
ఉరితాళ్లలో చిక్కుకున్నారు.
కుర్చీ దొరికినంక
ప్రజలు గుర్తుకు రాకుండా
పోయిన పాలకుల తీరు
ఇవాళ తెలంగాణోడిని నిలదీస్తున్నది.
తెలంగాణ ఆత్మగౌరవం,
ఢిల్లీ మెట్ల దగ్గర తాకట్టు పెట్టిందా
అన్న ప్రశ్న ప్రజల్లో గట్టిగానే వినిపిస్తున్నది
ప్రశ్నించే గొంతుకల్ని నొక్కిపెడ్తున్నరు.
ఒక్క సోషల్ మీడియా పోస్టుకే
భయపడే పాలకులు
ప్రజలే రోడ్డెక్కితే ఏం చేస్తరో?
ఓ తెలంగాణోడా నీ మౌనం వాళ్లకి
ఆయుధం అయింది.
నీ సహనం వాళ్ల అహంకారానికి
బలం అయింది.
ఇది వ్యక్తుల మీద
కోపం చూపించే టైమ్ కాదు
ఇది వ్యవస్థని నిలదీసే సమయం.
ముఖాల్ని కాదు
విధానాల్ని ప్రశ్నించే కాలం.
పిడికిలి ఎత్తినప్పుడే మార్పు వచ్చింది.
నినాదం ఇచ్చినప్పుడే
రాజ్యం సాధ్యమైంది.
ఈ రోజు మళ్లీ అదే స్పూర్తి కావాలి.
అదే పోరాట తత్వం కావాలి.
పార్టీ జెండాలకన్న ముందు
తెలంగాణ జెండా గుర్తొచ్చేలా
వ్యక్తులకన్న ముందు
ప్రజల అవసరాలు కనిపించేలా
మోసపోతున్న తెలంగాణోడా
ఇంక నిద్రపోతే చరిత్ర క్షమించదు.
ఇంక మౌనంగా ఉంటే
రేపటి తరాలు నిన్ను ప్రశ్నిస్తాయి.
పిడికిలి ఎత్తి కదులు!
నీ హక్కుల కోసం నిలబడు!
నీ భవిష్యత్తు నీ చేతుల్లనే ఉంది.
తెలంగాణ మేలుకోవాలి.
తెలంగాణ నిలబడాలి.
తెలంగాణ ప్రశ్నించాలి.
ప్రశ్నిస్తే కేసులు
గొంతు ఎత్తితే అరెస్టులు
రైతు సంఘాల మీద,
యువజన ఉద్యమాల మీద నిఘా
ప్రజాస్వామ్యం పేరుతో
మౌనం రుద్దే పాలన.
ఇది మరో తెలంగాణ ఉద్యమం
ఇది రైతు బతుకు పోరాటం
ఇది యువత భవిష్యత్తు పోరాటం
రైతు కోసం, యువత కోసం
పిడికిలి ఎత్తి కదులు!
సల్వాజి మాధవరావ్
9052563147