తెలంగాణకు శ్రీరామరక్ష ఎవరంటే అదొక్క కేసీఆర్ మాత్రమే. గుండె మీద చేయి వేసుకొని చెప్పమంటే విపక్షాలు సైతం ఇదే మాట చెప్తాయి. కానీ, వాళ్లకు రాజకీయాలు కావాలె కదా? ఎట్లనన్న జేసి తెలంగాణలో అధికారంలోకి రావాలె కదా? ఈ కారణం చేత కేసీఆర్ ఎంత మంచి పనిచేసినా సరే వాళ్లు చేయలేదనే అంటారు. అందుకు వాళ్లను పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
ఏ రోటికాడ ఆ పాట పాడకపోతే వాళ్లకు బతుకుదెరువులేదు. వాళ్ల ఉనికి కోసం చేసే పోరాటంలో ఇలాంటి ప్రయత్నాలు చాలానే చేస్తారు. ఇక కొంతమంది తిట్టేటోళ్లుంటారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘తిట్టేటోడు తిడ్తనే ఉంటడు. కోపుల చాయి వోశిస్తే.. సాసరేది, నేను ఏడ్డోని లెక్క కనిపిస్తున్ననా? నా ఖాందాన్ తక్కువనా?’ అంటాడు. అంటే మంచి చేసినా తిట్టుడే, చెడు చేసినా తిట్టుడే. ఇదే వాళ్లపని. ఇలాంటోళ్లను సాధారణంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఎన్నికలప్పుడు మాత్రం కచ్చితంగా పట్టించుకోవాల్సిందే. వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాల్సిందే. లేదంటే వాళ్ల బాధ, వాళ్ల స్వార్థమే మొత్తం ప్రజల సమస్య అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని తిప్పి కొట్టాలంటే పెద్దగా చేయాల్సిన పనేమీ లేదు. అసలు తెలంగాణ ఉద్యమం మొదలైన నాటినుంచి రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణంలో ఎవరి పాత్ర ఏమిటన్నది నిశితంగా గమనిస్తే చాలు ఎవరి వైపు ఉండాలన్నది ఉత్తగనే తెలిసిపోతది.
నిజానికి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఏ సందర్భంలో ఎటువైపుండాలో వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. తెలంగాణ ఉద్యమం గానీ, తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించిన అంశంలో గానీ ప్రజలెప్పుడైనా కేసీఆర్‌నే నమ్మారు. ఒక్క కేసీఆర్ మాత్రమే తెలంగాణను కాపాడగలడని భావించారు. ఈ విషయం బీఆర్ఎస్ శ్రేణుల కంటే కూడా కాంగ్రెస్, బీజేపీలో ఉన్న నాయకులకే ఎక్కువగా తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ప్రజలను కన్ఫ్యూజన్కు గురిచేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ల ప్రయత్నాలకు కొన్ని బాకాలూదే బ్యాచ్‌లుంటాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ కోరస్ అందుకుంటాయి. కేసీఆర్ పని అయిపోయిందని ప్రచారం చేస్తుంటే వాళ్లకదో రకమైన పైశాచికానందం. అలాంటివాళ్లు ఎన్నికల సమయంలో వారి వికృతాన్ని పోటీ పడి ప్రదర్శిస్తుంటారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకులు ఈ ప్రయత్నం చేయగా.. ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎత్తుకున్నారు.
విపక్షాల ప్రచార స్థాయి ఎట్లా ఉంటదంటే కేసీఆర్ కొంచెం కూడా డల్‌గా మాట్లాడొద్దు. పంచ్‌లు తగ్గించొద్దు. ప్రతిపక్షాలపై కొంచెం కూడా కనికరం చూపించొద్దు. అలా చేసిండంటే చాలు. వాళ్లకు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే. చూశారా కేసీఆర్ మాటల్లో పస తగ్గింది. చూశారా కేసీఆర్ గతంలో వలె మాట్లాడుతలేడు. బీఆర్ఎస్ ఓడిపోతది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ కావాలంటూ ఎడ్డిరాగం ఎత్తుకుంటారు.
‘నన్ను ఓడిస్తే పోయిదేమీ లేదు, రెస్ట్ తీసుకుంటా’ అని ఇటీవల కేసీఆర్ అన్నారు. దానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు షురూ చేసిన ప్రచారం చూశాక వాళ్లు ఇంత దయనీయ స్థితిలో ఉన్నారా అని జాలేసింది. ప్రజల మీద తనకున్నా ప్రేమ, చనువు కారణంగా కేసీఆర్ ఆ మాటన్నారన్న సోయి కూడా వాళ్లకు లేదు. 2018 ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఇదే మాట అన్నారు. కానీ ప్రజలు రెస్ట్ ఇచ్చింది కాంగ్రెస్, బీజేపీలకు. అయినా బుద్ధి రాకపోతే ఎవ్వరు మాత్రం ఏం చేయగలరు?
తెలంగాణ సాధన క్రమంలో గండర గండరులను ఎదుర్కొన్నారు కేసీఆర్. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ఆయనకు పూర్తిగా తెలుసు. తన వ్యుహాల ముందు ఇప్పుడున్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు కూడా పిచ్చుకల వంటివాళ్లు. వాళ్లకు కేసీఆర్ ఇప్పటికీ అర్థం కావటం లేదు. తానే పని చేసిన ప్రతిపక్షాలను దానిచుట్టే తిప్పుతూ తన గేమ్ తాను ఆడుతుంటడు. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ గేమ్‌లో చిక్కుకొని అసలు ఆటంతా తామే ఆడుతున్నామనే భ్రమలో ఉంటారు. ఇప్పటిదాకా ప్రచారంలో వాళ్లు చూసింది సాధారణ కేసీఆర్‌ను మాత్రమే. తన విశ్వరూపం వేరే ఉంటది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అది నక్కలు, తోడేళ్ల పాలవుతుందంటే మాత్రం కేసీఆర్ ఉగ్రనరసింహుడవుతాడు. గర్జించి మరీ తెలంగాణను కాపాడుకుంటాడు.
ఉగ్ర కేసీఆర్ గురించి తెలిసినప్పటికీ ఇటీవల కొన్ని నక్కలు, తోడేళ్లు జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉన్నాయి. కేసీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేయాలని కపట నాటకాలాడుతూనే ఉన్నాయి. తప్పుడు ప్రచారాలతో ఏదో జరిగిపోతుందని ఆగం చేసే ప్రయత్నం నిర్విరామంగా చేస్తూనే ఉన్నాయి. ఆ కుట్రలను కేసీఆర్ అందరికన్నా ముందే పసిగట్టిండు. అందుకే తెలంగాణ ప్రజలను తస్మాత్ జాగ్రత్త అంటూ అలర్ట్ చేస్తున్నాడు. 24 ఏండ్లుగా కేసీఆర్ ఏందో.. ఇప్పుడున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులేందో గుర్తుచేస్తున్నాడు. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రజలు కాస్త గందరగోళానికి గురవ్వటం మామూలే. అట్ల ఆగం చేసి గెలిచిపోదమని మాత్రమే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే ఎవ్వరో ఏదో చేయాల్సిన పనేం లేదు. కేసీఆర్ చెప్పినట్లు 24 ఏండ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలు.
వాస్తవానికి కేసీఆర్ నాయకత్వ సామర్థ్యం మీద తెలంగాణ ప్రజలకు అపారమైన నమ్మకం ఉన్నది. స్వయంగా కేసీఆరే ఓడించమని కోరినా సరే ప్రజలు అందుకు అంగీకరించరు. ఎందుకంటే తెలంగాణలో ఇంచు, ఇంచు తెలిసిన వ్యక్తి ఆయన. ఏ వర్గానికి ఏం చేయాలన్నది ఆయన మైండ్‌లో ఎప్పుడో బ్లూ ప్రింట్ వేసుకున్నారు. తెలంగాణ రథసారధిగా ఆ దిశగా రాష్ర్టాన్ని తీసుకెళ్తున్నారు కూడా. ఆ ఫలితమే వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో తెలంగాణ టాప్. తెచ్చుకున్న తెలంగాణను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదే కేసీఆర్. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించరేమోనని ప్రతిపక్షాలు కొంత ఆశ పెట్టుకున్నాయి. ఇక్కడే వాళ్ల లెక్కలన్నీ గతి తప్పుతున్నాయి. తెలంగాణ ప్రజలు తమకు నష్టం చేసిన వాళ్లను క్షమిస్తారు. కానీ, మంచిచేసిన వాళ్లను అస్సలు మరిచిపోరు, గుండెల్లో పెట్టి చూసుకుంటారు. అలా ఇప్పుడు ప్రతి తెలంగాణ పౌరుడి గుండెలో ఉన్నది కేసీఆర్ మాత్రమే. అందుకే తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష.
-రచ్చ దినేష్
89787 40475