రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య గురించి ప్రజలు గోసపడితే ఆశ్చర్యపోనవసరం లేదు. అది సర్వసాధారణం.అయినప్పటికీ, భారత్, బంగ్లాదేశ్‌కు మధ్య కొన్ని గ్రామాల విషయంలో సమస్య తలెత్తినప్పుడు రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాల ప్రజలు మాత్రం స్వదేశంలో పరాయివాళ్లుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా నివసిస్తున్నారు. అందరూ ఉన్నా అనాథలుగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్లు సాంకేతికంగా ఆంధ్రాలో ఉన్నప్పటికీ మానసికంగా తెలంగాణలోనే ఉన్నారు.
విభజనకు పూర్వం భద్రాచలంలో అంతర్భాగమైన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలకు భద్రాచలంతో పేగుబంధం ఉన్నది. అశాస్త్రీయంగా ఏపీలో కలిపిన ఈ గ్రామాలు పోలవరం ముంపు జాబితాలో, ప్యాకేజీ జాబితాలోనూ లేవు. అశాస్త్రీయంగా ఈ గ్రామాలను విలీనం చేయడం వల్ల దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లాలంటే ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో 9 కిలోమీటర్లు ప్రయాణించాలి. దీంతో భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే భద్రాచలం నుంచి అంబులెన్స్ రావడం లేదు. ఆంధ్రా నుంచి రావాలి. అందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. జిల్లా కేంద్రమైన పాడేరుకు వెళ్లాలంటే రెండు ఘాటు రోడ్లు దాటుకుంటూ 420 కిలోమీటర్లు ప్రయాణించాలి. అత్యవసర సేవల కోసం 80 కిలోమీటర్లు ప్రయాణించి చింతూరులోని ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తున్నది. ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంటే నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరానికి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తున్నది.
మన రాజ్యాంగ పీఠికలో మనది ప్రజాస్వామ్య దేశమని ఉంటుంది. కానీ, ఆ గ్రామాల్లో ప్రజాస్వామ్యం లేదు, పాలన అసలే లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈ గ్రామాల్లో ప్రచారం చేయరు. ఈ గ్రామాల్లో ఓ ట్లు అడగటానికి రారు. ఒకవేళ రావాలనుకున్నా హెలికాప్టర్ తప్ప, వేరే మార్గం లేదు. ఈ గ్రామా ల ప్రజలు నాయకులకు సమస్యలు విన్నవించుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎంపీని కలవాలంటే 2 రోజులు ప్రయాణం చేయాల్సిందే.
ఇదే కాక ఈ సాంకేతిక సమస్య వల్ల భద్రాచలం అభివృద్ధి సైతం కుంటుపడుతున్నది. భద్రాచలంకు ఒకవైపు గోదావరి మూడు వైపులా ఆంధ్ర ఉండటం వల్ల పట్టణంలో డంపింగ్ యార్డుకు జాగ లేక గత పదకొండేండ్లుగా గోదావరి నదిలోనే చెత్త వేస్తున్నారు. దీంతో గోదావరితోపాటు భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీలు కాలుష్యమయం అవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రామాల విద్యార్థుల చదువులు భద్రాచలంలోనే కొనసాగాయి. అనాలోచితంగా తీసుకున్న విలీన నిర్ణయం మూలంగా ఇప్పుడు ఆ విద్యార్థులు స్థానికేతరులు అవుతున్నారు. పుట్టి పెరిగిన ఊరిలో సైతం సాంకేతికంగా స్థానికేతరులు అవ్వడంతో ఎటుకాని పక్షులు అవుతున్నారు. ఆంధ్రాలో ఈ గ్రామాల ప్రజలను పరాయివాళ్లుగా చూస్తున్నారు. స్వరాష్ట్రంలో సాంకేతికంగా వెలివేయబడి 11 ఏండ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ ఐదు గ్రామాల ప్రజలే కాదు, భద్రాచలం రామయ్య ఆల యం కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. రామయ్య 14 ఏండ్ల వనవాసం తర్వాత పట్టాభిషిక్తుడయ్యాడు. కానీ, 11 ఏండ్లుగా ఆ ఐదు గ్రామాల ప్రజలు వనవాసమేగుతున్నారు. గొల్లకొండ నవాబు అబుల్ హసన్ కుతుబ్ షాను ఎదిరించి ఆనాడు భక్తరామదాసు ఆలయాన్ని నిర్మించి సీతారాములకు ఆభరణాలు చేయించాడు. మాన్యం భూములు, ఆస్తులు సైతం నెలకొల్పాడు. కానీ, నేడు ఆ ఆస్తులను శ్రీరాముడి భద్రాచల ఆలయం అనుభవించలేని దుస్థితి దాపురించింది. కనుల పండువగా బాల రాముడికి అయోధ్యలో అత్యంత భవ్యమైన రామాలయం ఏర్పాటైంది. కానీ, మన భద్రాచల శ్రీరాముడి మాన్యం మాత్రం రాముడికి దక్కడం లేదు.
వనవాసంలో అత్యంత ఎక్కువ కాలం రెండున్నర ఏండ్లు మన భద్రాచలంలోనే సీతారాములు గడిపారని పురాణాలు చెప్తున్నాయి. భద్రాచలం సీతారాముల ఆలయం తెలంగాణలోనే ఉంది. కానీ, రాములవారి 917 ఎకరాల భూములు మాత్రం ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల్లో ఒకటైన పురుషోత్తపట్నంలో ఉన్నాయి. ఆ ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో ఉండటం వల్ల భద్రాచలం ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.
రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్తుంటే రావణున్ని ఎటపాక గ్రామంలోనే జటాయువు అడ్డుకుంది. ఉష్ణ గుండం వద్ద సీతమ్మ తల్లి స్నానమాచరించిన పవిత్ర స్థలం గుండాల గ్రామం వద్దనే ఉంది. వీటన్నింటిపై పక్క రాష్ర్టానికి అధికారాలు ఉండటం, తెలంగాణకు వాటిపై అధికారం, పట్టు లేకపోవడంతో భద్రాచల ఆలయ అభివృద్ధి కుంటుపడటమే కాకుండా, పర్యవేక్షణ కొరవడుతున్నది. ఆలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది.
సీతారాములు నడియాడిన ఆ ఐదు గ్రామాల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో ఆనవాలు ఉన్నది. శ్రీరాముడి ఆలయాన్ని ఒక రాష్ట్రంలో, రాముడి మాన్యం, ఆనవాళ్లు మరొక రాష్ట్రంలో పెట్టి ఆలయానికి, ఆస్తులకు సంబంధం లేకుండా చేయడం శ్రీరాముడికి ద్రోహం చేయడమే అవుతుంది. శ్రీసీతారాముల ఆనవాళ్లను, వాళ్లు నడయాడిన ప్రతీ అడుగును ఒకే రాష్ట్రంలో ఉంచితే వాటిని ఒక పర్యాటక ప్రదేశంగా మలచవచ్చు. భద్రాచలాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంగా మార్చే గొప్ప అవకాశం ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భద్రాచలం, సాక్షాత్తు శ్రీరాముడే నిస్సహాయతకు గురవుతున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఇది. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కళతప్పి బోసిపోయింది. ఇక్కడి ప్రజలు పదకొండేండ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయారు. ఐదు గ్రామాల్లో పర్యటించిన వ్యక్తిగా ప్రజల గోసను, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని చూసి నేను చలించిపోయాను. ఇంతటి అమానవీయ నిర్ణయంపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష చేసి, ఆ ఐదు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలి. ఇది రాజకీయ సమస్య కాదు. పార్టీల లొల్లి కాదు. ఇదొక మానవీయ సమస్య, సామాజిక సమస్య. ఆ మేరకు, రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మానవీయ కోణంలో ఆలోచించి, ప్రజాభీష్టం మేరకు ప్రధానమంత్రితో చర్చించాలి. ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో వారికి స్వాతంత్య్రం కల్పించి ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
-ఏనుగుల రాకేష్‌రెడ్డి