Telangana IT | ఐటీ రంగం అంటే.. ఒకప్పుడు పెద్ద పెద్ద పట్నాలు.. మెట్రో నగరాలకే సొంతం అన్న తీరుగా ఉండేది. ఐటీ ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి అనే ఆలోచన ఉండేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరెత్తగానే.. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోచ్చి, చెన్నై, పూణె లాంటి నగరాల పేర్లు మాత్రమే కండ్ల ముందు కదలాడేవి. కానీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత ఐటీ తీగలు మారుమూల పట్టణాలకు కూడా దారులు వెతుక్కున్నాయి.
ఐటీ కంపెనీలు రావాలంటే రోడ్లు, కరెంటు ఉండాలె. ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అర్హతలున్న, నైపుణ్యం ఉన్న యువత కావాలె. అన్నింటికీ మించి ప్రభుత్వ సహకారం కావాలె. దూరదృష్టి, దార్శనికత ఉన్న నాయకుడో, పాలకుడో ఆ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. ఉమ్మడి రాష్ట్రంలో గతుకుల రోడ్డుకు అతుకులు కూడా వేయని ఆనాటి ప్రభుత్వాల హయాంలో ఐటీ రంగం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ దాటి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ.. ఒక దేశానికి కావాల్సినన్ని వనరులు, అభివృద్ధికి అవసరమయ్యే వసతులు ఉన్న ప్రాంతాన్ని ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యానికి గురి చేసి ఐటీ రంగంలోని నత్తనడకను మెరిట్‌లా చూపించాయి నాటి ఉమ్మడి పాలక మేధస్సులు.
కానీ.. తెలంగాణ తెలివి గల్లది. తెగువ గల్లది. అందుకే.. బిగించిన పిడికిలిని స్వరాష్ట్రం సాధించుకునే దాకా సడలించలేదు. ఫలితం.. పార్లమెంట్లో ‘ద బిల్ ఈజ్ పాస్డ్’ అనే జీవో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించుకునేలా కొట్లాడింది. ఇయ్యాల.. స్వరాష్ట్రమై దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటుతున్న తరుణంలో రాష్ట్రం నలుమూలల ఐటీ వెలుగులు జిగేలులద్దుతున్నాయి.
రోబోక్సా అనే సింగపూర్‌కి చెందిన ఐటీ సంస్థ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో తన యూనిట్‌ని ఏర్పాటు చేసుకున్నది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో సనాతన అనలిటిక్స్ అనే ఐటీ కంపెనీ విజయవంతంగా నడుస్తున్నది. ఇదొక ఈ కామర్స్ యాప్. దీనికి ఇప్పటికే 10 వేల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ కంపెనీలో 86మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. అంతేకాదు.. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి ఈ సనాతన అనలిటిక్స్ కంపెనీ మంచిర్యాల నుంచి బిజినెస్ స్ట్రాటజీ సొల్యూషన్స్ అందిస్తున్నది. పరకాలలో నాలుగేండ్ల కిందట ప్రారంభమైన డిజియోధ అనే కంపెనీ 200 మంది ఉద్యోగులతో 500 సంస్థలకు సేవలందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నది. వీటికి తోడు.. సిద్దిపేట, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఐటీ టవర్లు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.
మెట్రో నగరాల్లోనే నిపుణులుంటారు. ఎంత తెలివి ఉన్నోడైనా, ఎన్ని నైపుణ్యాలున్నోడైనా పట్నమొచ్చి పనిచేయాలే అనే కుంచిత ఆలోచనలకు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఐటీశాఖ స్వస్తి పలికింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలు , మారుమూల పట్టణాలకు కూడా సకల సౌకర్యాలు కల్పించింది. పరిశ్రమల స్థాపనకు జాగ దేవులాడుకోవాల్సిన పనిలేకుండా రాష్ర్టాన్నే సిద్ధం చేసింది. దాని ఫలితమే.. నగరం చుట్టూ విస్తరించిన ఐటీ కంపెనీలు నేడు వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయశ్రేణి పట్టణాలకు వరుస కడుతున్నాయి. ఐటీ కంపెనీల స్థాపనకు కావాల్సిన వసతులు కల్పించిన తెలంగాణ.. నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి రహదారులు పరిచింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేసుకునేందుకు అడ్డా అనుకునేవి. నేడు.. మెయిన్ బ్రాంచ్‌గా, స్టార్టప్ క్యాపిటల్‌గా భావిస్తున్నాయి. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనం నేడు హైదరాబాద్‌కే కాదు.. జిల్లాకేంద్రాలకు సైతం తరలివస్తున్న ఐటీ కంపెనీలే సాక్ష్యం. తెలంగాణ యువతను ప్రపంచ స్టార్టప్‌కు బ్యాకప్‌గా నిలిపిన ఘనత కూడా కేసీఆర్ సర్కార్‌దే. ప్రపంచంలోని 14 దేశాల నుంచి దాదాపు 1000 స్టార్టప్ ఐడియాలు వస్తే.. అందులోని 68 ఐడియాలు సెలెక్ట్ అయ్యాయి. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 13 కంపెనీలు ఉండటం రాష్ర్టానికే గర్వకారణం.
1998లో అప్పటి ప్రధాని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హైటెక్ సిటీని ప్రారంభించారు. అప్పటినుంచి తెలంగాణ ఏర్పాటు వరకు సాధించిన అభివృద్ధి ఎంత? విస్తరించిన కంపెనీలు ఎన్ని? స్వరాష్ట్రమైన తెలంగాణలో ఈ తొమ్మిదేండ్లలో ఐటీ రంగంలో సాధించిన అభివృద్ధి ఎంత? వచ్చిన కంపెనీలెన్ని? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఐటీ రంగం నిపుణులే అవసరం లేదు. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్, ఓలా, వన్‌ప్లస్, ఒప్పో, మైక్రాన్ వంటి కంపెనీలు దాదాపు 23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
దేశంలోని పలు రాష్ర్టాలతో సహా స్థానిక యువతతో కలిపి 23 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఐటీ రంగం అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చేసిన విదేశీ పర్యటనల ద్వారా అంతర్జాతీయ కంపెనీలు భారీ స్థాయిలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. పారిశ్రామిక వాడలుగా పేరొందిన 11 పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులుగా మార్చేందుకు కంకణం కట్టుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నది తెలంగాణ ఐటీ శాఖ.
టైర్ 2, టైర్ 4 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ నిపుణులకు ఉపాధి దొరుకుతున్నది. దీనికి తోడు యువ పారిశ్రామికవేత్తలు సైతం అన్నీ వసతులతో అభివృద్ధి పరుగులు తీస్తున్న రూరల్ తెలంగాణలో ఐటీ విప్లవాన్ని సృష్టించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడంతో ఐటీ అంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పదం.. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలంగాణ.. ఐయామ్ తెలంగాణ అని గర్వంగా చాటుతున్నది.
-సుంకరి ప్రవీణ్‌కుమార్
97015 57412