కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘జాతీయ విద్యా విధానం-2020’ పేరుతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక వృత్తి విద్యల వరకు అనేక మార్పులను సూచిస్తూ కొత్త విధానాలను రూపొందిస్తున్నది. అయితే, కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? దానికి అనుగుణంగానే రాష్ట్రంలో విద్యా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదా? పోనీ జాతీయ విద్యా విధానం ప్రతిపాదనలను విద్యా కమిషన్ పరిశీలనకు పంపేందుకు చర్యలు తీసుకున్నదా? అనే విషయంలో స్పష్టత లేదు.
ఇప్పుడున్న పాఠశాల విద్యా విధానం కొఠారి కమిషన్ 1966లో చేసిన సిఫారసుల మేరకు సెకండరీ విద్య, ఇంటర్మీడియట్ విద్య తర్వాత డిగ్రీ విద్య అనే ప్రధాన విభాగాలతో నడుస్తున్నది. పాఠశాల విద్య 10వ తరగతికి పరిమితమై, జూనియర్ కళాశాలల పేరుతో ఇంటర్మీడియట్ విద్యను 11, 12 తరగతులతో నిర్వహించే విధానం 1968-69 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. సుమారు ఐదున్నర దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రం రోజుల నుంచి ఉన్న జూనియర్ కళాశాల వ్యవస్థ, ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ మొత్తంగా రద్దయి పాఠశాల విద్యలో విలీనం అవుతుంది. ఎస్సెస్సీ పరీక్షలు రద్దయిపోయి, 12వ తరగతి వద్దనే టర్మినల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్సెస్సీ బోర్డు కూడా రద్దవుతుంది. కొత్త విధానంలో పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ), ప్రాథమిక విద్య (3-8), సెకండరీ విద్య (9-12) పేరుతో మూడు విభాగాలుగా కొత్తగా పాఠశాలల నిర్వహణ ఉండబోతున్నది.
మన ఇంటర్మీడియట్ వ్యవస్థ సుమారు 55 ఏండ్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది. ఈ ఇంటర్మీడియట్ విద్య మిగతా అన్ని ప్లస్ టు వ్యవస్థల కంటే సమర్థవంతంగా ఉందని, సిలబస్, బోధన విధానానికి ఆకర్షితులై ఉత్తర రాష్ర్టాల నుంచి కూడా విద్యార్థులను మన ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో చేరుస్తున్నారు. ఆ ఇంటర్మీడియట్ ద్వారా విద్యార్థులు వివిధ వృత్తి విద్యల్లోకి ప్రవేశిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఆ విధానాన్ని రద్దు చేయడమా? మరింత మెరుగైన పద్ధతిలో విద్యా విధానాన్ని రూపొందించడమా అనేదానిపైనా చర్చ జరగాలి.
అయితే ఒకటో తరగతిలో చేరిన ప్రతి పిల్లవాడు ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి పూర్తిచేసే విధంగా ఒక విధానం ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య తరగతులను నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా గతంలో 362 పాఠశాలలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 210 పాఠశాలల్లో, తాజాగా మరో 790 స్కూళ్లలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయం చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రోజువారీ నిర్వహణ, పౌష్ఠికాహారం, ఆరోగ్యం, భద్రత తదితరాలకు బాధ్యత వహించాలి.
ప్రీ ప్రైమరీ అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ)లో వినియోగించని నిధి నుంచి రూ.22.62 కోట్లు తీసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని సమగ్రశిక్ష నుంచి తీసుకోవాలి. రూ.10 వేలతో ఇంటర్మీడియట్ చదివినవారిని ఉపాధ్యాయులుగా 10 నెలల పాటు తాత్కాలికంగా నియమించాలని ప్రభుత్వం చెప్పింది. ఒక ఆయాని కూడా 6 వేలకు నియమిస్తారు. అయితే ప్రీ ప్రైమరీ తరగతుల బోధనకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల నియామకాలు జరగాలి. అందుకు డైట్ కళాశాలలో ప్రీ ప్రైమరీ శిక్షణ ఇవ్వడానికి ఆదేశాలిచ్చి, ఉపాధ్యాయుల శిక్షణ వెంటనే ప్రారంభించాలి. ఈ సన్నద్ధత ఏదీ లేకుండానే, శిక్షణ లేని ఉపాధ్యాయులతో ఆదరా బాదరాగా ప్రారంభించడం, వాటిని మధ్యలోనే వదిలేయడంతో తల్లిదండ్రులకు విశ్వాసం పోతున్నది. ప్రమాణాలతో కూడిన విద్య లభించడం లేదు.
ఇక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణమైతే ప్రారంభమైంది. కానీ, వాటి నిర్వహణ, అందులో కొత్త పాఠశాలలు ప్రారంభిస్తారా? లేదా ఉన్న గురుకులాలనే అందులో ప్రారంభిస్తారా? అనే విషయాల్లో స్పష్టత లేదు. ఒక్కొక్క పాఠశాల ఆవరణలో ఎన్ని పాఠశాలలు ప్రారంభిస్తారు? వాటి భౌతిక నిర్వహణ, పాఠశాల పర్యవేక్షణ వంటి అంశాలలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా బయటకు రాలేదు. కానీ టెండర్లు అయి, భవనాల నిర్మాణమైతే ప్రారంభం కానున్నది. ఇట్లా అన్ని నిర్ణయాలను ప్రకటిస్తూ, తర్వాత మార్గదర్శకాలు లేకపోతే ప్రభుత్వ విద్యారంగంపై తల్లిదండ్రులకు విశ్వాసం సడలిపోతుందనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి. పదేండ్ల నుంచి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డీఈఓలు లేకుండానే పాఠశాల విద్యను ఈడ్చుకొచ్చారు. ప్రధానోపాధ్యాయులు వచ్చినా ఇంకా పర్యవేక్షణ అధికారుల జాడ లేదు. అంతేగానీ విద్యా కమిషన్ నియమించాం.. యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మించాం.. పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించాం.. యంగ్ ఇండియా స్కీంలో యూనివర్సిటీ ప్రారంభించాం.. క్రీడా యూనివర్సిటీ ప్రారంభించాం అని చేతులు దులిపేసుకుంటే ప్రభుత్వ బాధ్యత తీరినట్టు కాదు.
రాష్ట్రంలోని మొత్తం విద్యా విధానానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ, ఆదర్శవంతమైన యజమానిగా విద్యాసంస్థలను నిర్వహించడం ద్వారా విద్యార్థులలో, తల్లిదండ్రులలో విశ్వాసాన్ని చూరగొనాలి. అందుకు శాశ్వతంగా అమలుచేసేందుకు గాను విధాన నిర్ణయాలను రూపొందించాలి. అప్పడే, విద్యా విధానం గాడిలో పడుతుంది.
– (వ్యాసకర్త: విద్యారంగ విశ్లేషకులు) కె. వేణుగోపాల్98665 14577