Virosh | టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ ప్రైవేట్ వెడ్డింగ్‌కు సంబంధించిన ప్రీవెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే పీక్స్‌కు చేరుకున్నాయి. కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం ఉదయ్‌పూర్‌కు చేరుకోవడంతో జోరుగా చర్చ మొదలైంది. ఆయనతో పాటు నీతా అంబానీ, కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోకా అంబానీ కూడా వచ్చినట్లు ప్రచారం సాగింది. దీంతో అంబానీ కుటుంబం విరోష్ వెడ్డింగ్‌కు హాజరవుతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం అంబానీ కుటుంబం ఉదయ్‌పూర్ సందర్శనకు ఈ వివాహంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఉదయ్‌పూర్ సమీపంలోని నాథ్ద్వారాలో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో దర్శనం కోసం అంబానీ కుటుంబ సభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆలయం వద్ద తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు వాటిని విరోష్ వెడ్డింగ్‌కి అటాచ్ చేశారు. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమేనని, పెళ్లికి సంబంధం లేదని సమాచారం. ఈ సెలబ్రిటీ వివాహం పూర్తిగా ప్రైవేట్ వేడుకగా జరుగుతోంది. ఇప్పటికే ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో కనిపించిన వారిలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, నటి ఆషికా రంగనాథ్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది.
వివాహ విందు పూర్తిగా దక్షిణాది శైలిలో ఉండబోతోందని సమాచారం. అతిథులకు అరిటాకుల్లో భోజనం వడ్డించనున్నారు. ప్రత్యేకంగా కొబ్బరి నీళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సరదా క్రీడలతో సందడి చేశారు. ఫిబ్రవరి 26, 2026న ప్రధాన వివాహం జరగనుండగా, సినీ పరిశ్రమ స్నేహితుల కోసం మార్చి 4, 2026న ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి, అంబానీలు ఉదయ్‌పూర్‌లో ఉన్నారన్న విషయం నిజమే అయినప్పటికీ, అది విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న పెళ్లితో సంబంధం లేదని ఇన్సైడ్ వర్గాల టాక్.