దేశ వ్యవసాయానికి విత్తనాలు ప్రాణం. రైతు చేతిలో ఉన్న విత్తనమే రేపటి ఆహార భద్రతకు.. జీవవైవిధ్యానికి.. వ్యవసాయ స్వయం ప్రతిపత్తికి మూలాధారం. అలాంటి కీలక రంగాన్ని నియంత్రించాల్సిన విత్తనాల ముసాయిదా బిల్లు- 2025 ప్రస్తుతం తీవ్రమైన విమర్శలకు గురవుతున్నది. రైతు సంక్షేమం, సమాఖ్య సమతుల్యత, విత్తన సార్వభౌమత్వం వంటి మౌలిక సూత్రాల నుంచి ఈ బిల్లు దూరమవుతున్నదన్న ఆందోళన తీవ్రతరమవుతున్నది. ఇటీవల కేంద్రప్రభుత్వం విత్తన ముసాయిదా బిల్లుపై మేధావులు, రాజకీయ పార్టీలతో సహా దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు బీఆర్ఎస్ సమర్పించిన సమగ్ర సమర్పణ.. కేంద్రం తీసుకురాబోతున్న చట్టంలో ఉన్న లోపాలను స్పష్టంగా ఎత్తిచూపింది.
రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి విధానాల ద్వారా వ్యవసాయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన తెలంగాణ అనుభవం నేపథ్యంలో చూస్తే, కేంద్రం తీసుకురాబోతున్న ఈ బిల్లు రైతు శ్రేయస్సుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. కఠినమైన విత్తన నియంత్రణ విధానాల ద్వారా రైతు సంక్షేమం – నియంత్రణ రెండూ కలిసి నడవగలవని గతంలో బీఆర్ఎస్ నిరూపించింది. రైతుకు మద్దతిస్తూనే, కార్పొరేట్ నియంత్రణను కట్టడి చేయవచ్చని చూపిన రాష్ట్రం తెలంగాణ. కానీ, కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు మాత్రం ఆ అనుభవాన్ని పక్కనపెట్టి, ‘వ్యాపారం చేయడం సులభం’ అనే పేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌కు అప్పగించే దిశగా ముందుకువెళ్తున్నది.
పరిహారం లేని చట్టం – రైతుకు న్యాయం ఎక్కడ?: భారతదేశంలో నకిలీ విత్తనాల వల్ల పంట నష్టాలు ఎదుర్కొన్న రైతులు లక్షల్లో ఉన్నారు. వందల టన్నుల అక్రమ విత్తనాలు పట్టుబడిన సంఘటనలు తరచూ చూస్తునే ఉన్నాం. ఇలాంటి సమయంలో రైతుకు న్యాయం చేసే చట్టం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ, ఈ కేంద్ర ముసాయిదా బిల్లులో అత్యంత ఆందోళనకరమైన అంశం… నకిలీ లేదా నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణ, చట్టబద్ధ పరిహార వ్యవస్థ లేకపోవడం. గతంలో ప్రతిపాదించిన చట్టాల్లో పరిహార కమిటీ వంటి నిబంధనలు ఉండేవి. తాజా ముసాయిదాలో రైతును సివిల్ కోర్టులు లేదా వినియోగదారుల న్యాయస్థానాల దారిపట్టించే పరిస్థితి నెలకొన్నది. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఆచరణలో సాధ్యమయ్యే మార్గం కాదు. కంపెనీలపై విధించే జరిమానాలు రైతులకు పరిహారంగా మారని విధానంతో పాటు బాధ్యత నుంచి కార్పొరేట్ తప్పించుకునే అవకాశాన్ని ఇస్తున్నది.
ధరల నియంత్రణకు సంకెళ్లు!: విత్తన ధరలు రైతు సాగు వ్యయాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. అయినా, ఈ ప్రతిపాదిత బిల్లు ధరల నియంత్రణను అత్యవసర పరిస్థితులకు మాత్రమే పరిమితం చేస్తూ.. రాష్ర్టాలకు ఉన్న నియంత్రణ అధికారాన్ని తొలగించింది. గతంలో రాష్ర్టాలు స్థానిక పరిస్థితులను బట్టి ధరలను నియంత్రించగలిగేవి. ఇప్పుడు ఆ అధికారం లేకపోతే… పెద్ద విత్తన కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచే ప్రమాదం ఉంది. ఇది రైతు సాగు ఖర్చును పెంచి, చివరికి అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితిని తీసుకురావచ్చు.
నాణ్యత నియంత్రణలో అసలు నేరస్థులు తప్పించుకుంటారా?: విత్తన నాణ్యత తనిఖీల విషయంలోనూ ఈ బిల్లు బలహీనంగా ఉంది. తనిఖీలు ప్రధానంగా రిటైలర్లు, రవాణాదారుల వరకే పరిమితం కావడం వల్ల, అసలు నకిలీకి మూలమైన ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు బాధ్యత నుంచి తప్పించుకుంటాయి. సమస్య పుట్టే చోట చర్యలు లేకుండా… చివరి దశలో ఉన్న రైతు లేదా చిన్న వ్యాపారిపై భారాన్ని మోపడం ద్వారా నకిలీ విత్తనాల సమస్యను పరిష్కరించలేం. ఫలితంగా, తప్పు చేసినవారు కాదు… రైతు, చిన్న వ్యాపారులే శిక్షను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
విదేశీ ధ్రువీకరణ – దేశీయ భద్రతకు ముప్పు: విత్తన ధ్రువీకరణ, వీసీయూ ట్రయల్స్ కోసం విదేశీ ఏజెన్సీలకు అవకాశం ఇవ్వడం మరో ఆందోళనకరమైన అంశం. భారతదేశంలో విభిన్నమైన వ్యవసాయ-వాతావరణ మండలాలు ఉన్నాయి. అవి పూర్తిగా పరీక్షించకుండా విత్తనాలను అనుమతిస్తే, పంట దిగుబడులు, జీవవైవిధ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. విత్తనాలు కేవలం వాణిజ్య వస్తువులు కాదు… అవి ఆహార భద్రతతో ముడిపడి ఉంటాయి.
రైతు హక్కులు, రాష్ర్టాల పాత్ర – తగ్గుతున్న భరోసా: సాంప్రదాయ విత్తనాలను నిల్వ చేయ డం, వినియోగించడం, మార్పిడి చేయడం శతాబ్దాల సంప్రదాయం. పీపీవీ& ఎఫ్ఆర్ చట్టం-2001 ఈ హక్కులను చట్టబద్ధంగా గుర్తించింది. కానీ, తాజా బిల్లులో ఆ రక్షణలు బలహీనంగా కనిపిస్తున్నాయి. అలాగే, ధరలు, ధ్రువీకరణ, లైసెన్సింగ్ వంటి అంశాల్లో రాష్ర్టాల పాత్రను తగ్గి స్తూ కేంద్రం అధికారాన్ని పెంచడం, భారత స మాఖ్య నిర్మాణానికి విరుద్ధంగా కనిపిస్తున్నది.
ప్రస్తుత ప్రతిపాదిత విత్తనాల ముసాయిదా బిల్లు – 2025 రైతు రక్షణకు భరోసా ఇవ్వడం లేదు. ధరల నియంత్రణను బలహీనపరచడం, కార్పొరేట్ ఆధిపత్యానికి మార్గం సుగమం చేయడంతో పాటు రాష్ట్ర అధికారాలను కుదించడం ద్వారా ఇది వ్యవసాయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. విత్తనాలపై ఏ జాతీయ చట్టమైనా రైతుతోనే ప్రారంభమై, రైతుతోనే ముగియాలి. రైతు పరిహారం, ధర నియంత్రణ, విత్తన నాణ్యతపై కఠిన నియంత్రణ, రాష్ర్టాల సముచిత పాత్ర… ఈ నాలుగు స్తంభాలపై బిల్లు పునర్నిర్మితమైతేనే అది దేశ వ్యవసాయానికి మేలు చేస్తుంది. లేకపోతే, ఈ బిల్లు భారత వ్యవసాయ పునాదినే బలహీనపరిచే ముప్పు తప్పదు. రైతుకు పరిహారం హామీ ఇవ్వని, ధరల నియంత్రణను బలహీనపరిచే, నాణ్యత అమలులో లోపాలున్న చట్టం దేశ వ్యవసాయాన్ని బలోపేతం చేయగలదా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన బాధ్యత కేంద్రానిదే.
దేశంలో రైతు పొలంలో విత్తనం పడేముందు ఢిల్లీలో కార్పొరేట్ సంతకం పడుతున్న కాలం మొదలైందా? విత్తనాల ముసాయిదా బిల్లు-2025ని లోతుగా చూస్తే ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా రైతాంగాన్ని వెంటాడుతున్నది. ఇది వ్యవసాయ సంస్కరణ కాదు, రైతు చేతిలో ఉన్న చివరి ఆయుధం విత్తనాన్ని కూడా కార్పొరేట్ గుప్పిట్లో పెట్టే ప్రమాదకర ప్రయత్నం. రైతు ఆత్మహత్యలపై కన్నీళ్లు పెట్టే కేంద్రం… అదే రైతును అప్పుల్లోకి నెట్టే చట్టాన్ని తీసుకురావడం విరోధాభాసం కాదు, ఇది స్పష్టమైన రాజకీయ వైఖరి. ఈ బిల్లు రైతు పక్షాన ఉందని చెప్పడం.. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుకు కోర్టుకెళ్లమని చెప్పడమే.
రైతుకు పరిహారం లేని చట్టం ఎవరి కోసం? ధరల నియంత్రణ లేని వ్యవస్థ ఎవరి లాభం కో సం? రాష్ర్టాల అధికారాలు తీసేసే ప్రయత్నం ఎం దుకు? అంటూ ఇటీవల బీఆర్ఎస్ సపర్పించిన సమగ్ర సమర్పణలో స్పష్టంగా ప్రశ్నించింది. రైతు ను కేంద్రంగా పెట్టి పాలన చేస్తేనే వ్యవసాయం నిలబడుతుంది. రైతును పక్కనపెట్టి కార్పొరేట్‌ను ముందుకుతెస్తే, అది విపత్తుకు ఆహ్వానమే అని బీఆర్ఎస్ చెప్తుంది. విత్తనాల ముసాయిదా బిల్లు – 2025ను ఈ రూపంలో ఆమోదిస్తే, రేపటి రైతు విత్తనం కొనడానికి కూడా కార్పొరేట్ దయపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది సంస్కరణ కాదు, రైతు స్వాతంత్య్రంపై దాడి. కేంద్రం ఇప్పటికైనా మే ల్కోవాలి. ఈ బిల్లుపై రైతులతో, రాష్ర్టాలతో, వ్యవసాయ నిపుణులతో చర్చించి… నిజమై న రైతు పక్షపాత విత్తన చట్టాన్ని తీసుకురావాలి. ఈ బిల్లు రైతును రక్షించలేదు. అందుకే సంపూర్ణ, సమగ్ర బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.