ఎన్డీయే, ఇండియా కూటములు రెండింటికీ తిరిగి ఎన్నికల సవాళ్లు త్వరలోనే ఎదురుకానున్నాయి. ఇదే సంవత్సరం మహారాష్ట్రలో, జార్ఖండ్‌లో, హర్యానాలో, తర్వాత 2026 లోగా అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, బీహార్ అసెంబ్లీలకు. వీటిలో అసోం, హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లో ఎన్డీయే, తక్కినవాటిలో ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి. ఎన్డీయే కూటమికి అసోం భద్రంగానే కనిపిస్తుండగా, మొన్నటి లోక్‌సభ ఫలితాలను బట్టి మహారాష్ట్ర, హర్యానా, బీహార్ స్థితి అనిశ్చితంగా మారింది.
ఇండియా కూటమికి సంబంధించి వాటి రాష్ర్టాలు సురక్షితంగా కనిపిస్తున్నాయి. అందుకు అదనంగా, మహారాష్ట్రపై కూడా ఆశలు పెట్టుకోవచ్చుననే వాతావరణం ఉన్నది. ఒకవేళ వారు నిజంగానే మహారాష్ట్రను గెలవగలిగితే ఆ ప్రభావంతో తక్కిన రాష్ర్టాలు మరింత సురక్షితంగా మారుతాయి. ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్న జమిలి ఎన్నికల పరిస్థితి ఏమి కాగలదన్నది అట్లుంచితే, ఈ తొమ్మిది అసెంబ్లీ ఫలితాల ప్రభావం 2029 లోక్‌సభ ఎన్నికలపై ఉండగలదని చెప్పవచ్చు. అయితే, ఇందుకు వర్తించే అతిపెద్ద షరతులు కూడా కొన్నున్నాయి.
NDA-INDIA Bloc | రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న. ఈ రెండింటిని కూడా దేశ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఇప్పుడు వివరాలలోకి వెళ్తే, ఎన్డీయే ఈ లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తీరును బట్టి చూడగా, వారు ఇకనుంచి తమ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది. ఆ పని ప్రధాని మోదీ నాయకత్వాన కేంద్ర స్థాయితో పాటు, వారు పరిపాలిస్తున్న వివిధ రాష్ర్టాలలో కూడా జరగాలి. అట్లా జరగనందుకే స్వయంగా తాము అధికారంలో గల కేంద్రస్థాయితో పాటు, తమ రాష్ర్టాలు కొన్నింటిలోనూ బలం తగ్గింది. కనుక ఈ రెండు విధాల వారు తమ పాలనను, రాజకీయ పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. మార్చుకోవలసిన అవసరాన్ని సాక్షాత్తూ తమ మాతృ సంస్థ ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చాలా సూటిగా ఎత్తిచూపిన తర్వాత, మోదీకి గాని, బీజేపీకి గాని మరొక ప్రత్యామ్నాయం లేదు కూడా. అందువల్ల మోదీ బృందం పైకి ఏమి మాట్లాడినా మాట్లాడకున్నా, రాగల రోజులలో ఆచరణాత్మకంగా తనను తాను ఏ విధంగా మార్చుకోగలదు? వచ్చే తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు సాధించగలదన్నది పెద్ద సవాలు కానున్నది. ఆ ఫలితాలు మోదీతో పాటు రాగల కాలానికి బీజేపీ భవిష్యత్తును నిర్ణయించగలవు.
‘ఇండియా’ కూటమి విషయానికి వస్తే, ఈ ఎన్నికలలో అధికారానికైతే రాలేదు గాని, ఓడినా గెలిచినంతటి వాతావరణాన్ని సృష్టించగలిగారన్నది వాస్తవం. అటువంటి ఫలితాలకు ఒక కారణం మోదీ పట్ల ప్రజలలో కలిగిన వ్యతిరేకాభిప్రాయమైతే, రెండవ కారణం ఇండియా కూటమి నడిపిన పాజిటివ్ ప్రచారం. ఈ రెండింటిలో దేని ప్రభావం ఎంతో ఇతమిత్థంగా చెప్పటం అసాధ్యం గనుక ఆ విషయం అట్లుంచితే, ఆ రెండూ కారణాలన్నది గుర్తించాలి. మొత్తానికి ఈ విధమైన ఫలితాల నుంచి కాంగ్రెస్ గాని, ఇండియా కూటమి గాని నేర్చుకోవలసిందేమిటి? ఈసారి వారికి పలు విధాలుగా కాలం కలిసివచ్చింది గాని, గతంలోకి వెళ్లినా, వర్తమానంలోనైనా కాంగ్రెస్‌కు చాలా పాఠాలున్నాయి. అవేమిటో పార్టీ నాయకత్వం గతంలోకి తొంగి చూస్తే తనకే తెలుస్తాయి. ఆ విధమైన వైఫల్యాలు ఇంత సుదీర్ఘకాలం లేనట్లయితే వారు వరుసగా ఇన్ని పరాజయాలకు గురయ్యేవారు కాదు. పైన అన్నట్లు వారికి ఈసారి అనేకం కలిసివచ్చి మరిన్ని సీట్లయితే గెలిచారు గాని, తమ లోటుపాట్లు, వైఫల్యాలు ఏమిటో ఎన్నికలకు ముందు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? మనకు తెలిసి అటువంటిదేమీ జరగలేదు. కొన్ని విషయాలు కలిసివచ్చి కొన్ని సీట్లు అదనంగా కలిసి అదే తమ ఘనత అనుకుంటున్నారు. ఈ ఘనత సాధించినందున ఇక గతం నుంచి నేర్చుకోవలసిందేమీ లేదని భావిస్తున్నారేమో తెలియదు. వారి స్వభావం మాత్రం లోగడ నుంచి అదే.
కాంగ్రెస్ నాయకత్వం గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదనటానికి వారు అధికారంలో గల కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ల లోక్‌సభ ఫలితాలే నిదర్శనం. హిమాచల్‌లో మొత్తం నాలుగు స్థానాలూ ఓడగా, తక్కిన రెండింటిలో సగమైనా గెలవలేకపోయారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలలో అట్టహాసంగా కొన్ని గ్యారంటీలు ఇచ్చారు. వాటిని అమలుపరచలేక సతమతమవుతున్నట్టు లోక్‌సభ ఎన్నికల నాటికే తేలింది.
ఎన్నికల అనంతరం ఆరు మాసాలలోనూ పరిస్థితి అదేవిధంగా ఉన్నది. ఆ హామీలు చాలక, కేంద్రంలో అధికారానికి వచ్చినట్లయితే అమలుపరచగలమంటూ మరికొన్ని హామీలు ప్రకటించారు. ఇటువంటివన్నీ కేవలం ప్రజలను మభ్యపెట్టి అధికారానికి వచ్చే ఎత్తుగడలని తేలుతూనే ఉన్నది. విషయమేమంటే, కాంగ్రెస్ నాయకత్వానికి వైఫల్యాలు, హామీలు, తిరిగి వైఫల్యాలు, వాటినుంచి ఎటువంటి పాఠాలు నేర్వకపోవటమన్నది ఒక షరామామూలు వలయంగా మారింది. గెలిచినప్పుడు తమ ఘనత అని నమ్మటం, ఓడినప్పుడు ప్రత్యర్థులను విమర్శించి సంతృప్తిచెందటం ఒక ఆత్మవంచనా కళ అయింది. ఈ సుదీర్ఘ నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు ఇప్పటి లోక్‌సభ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహాన్ని ఆధారం చేసుకుంటూ వారు రాగల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమేమి చేయగలరన్నది పెద్ద సవాలు కానున్నది.
ఈ విధంగా, మొదట అనుకున్నట్టు, ఎన్డీయే, ఇండియా కూటములు రెండింటికి కూడా రాగల కాలం వేర్వేరు విధాలైన సవాలు అవుతున్నది. మొదట ఎన్డీయేను చూసినట్టయితే, వ్యక్తిగతంగా మోదీ, సంస్థాపరంగా బీజేపీ, ఆరెస్సెస్ మారటమన్నది అన్నింటికన్న ముందు జరగవలసింది. మోదీకి సంబంధించి ఆయన తన అహంకారాన్ని, తనకు ఎదురులేదనుకోవటాన్ని, వ్యక్తిగత పోకడలను, నియంతృత్వ ధోరణులను వదులుకోవాలి. తన ఆర్థిక విధానాలను క్రోనీ క్యాపిటలిస్టు మిత్రులకు, విదేశీ పెట్టుబడిదారులకు గేట్లు పూర్తిగా తెరిచే పద్ధతి నుంచి మార్చుకోవాలి. ఉద్యోగాలు సృష్టించని ఆర్థికాభివృద్ధి (జాబ్‌లెస్ గ్రోత్), వ్యవసాయరంగ వ్యతిరేకతను వదిలివేయాలి. అల్పసంఖ్యాకవర్గాలపై విష ప్రచారాలను, చర్యలను మానివేయాలి. పౌరహక్కులను, పత్రికాస్వేచ్ఛను అణచివేయటం, తీవ్ర అసహన ప్రదర్శనలు పూర్తి అప్రజాస్వామికమని గ్రహించాలి. కేవలం ఆర్థికాభివృద్ధి, ర్యాంకుల వెంట పరుగులు తీయటం గాక, మానవాభివృద్ధి సూచికలు, అదే విధమైన ఇతర సూచికల విషయంలో దేశం ఎక్కడ ఉందన్న దానిపై దృష్టిపెట్టాలి.
పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులను తమ పార్టీలో చేర్చుకొని గంగాజలంతో పవిత్రులను చేయటం, ప్రత్యర్థులను దర్యాప్తు ఏజెన్సీలతో వేధించటం వంటివి మానుకోవాలి. అందరూ హీనులు, తాను మాత్రం మహా పవిత్రుడనంటూ తనను తాను ఆకాశాన్నంటే అత్యున్నత స్థానంపై ఆశీనుడిని చేసుకునే అల్పమైన బుద్ధిని ప్రదర్శించకూడదు. అమలుపరచటం అసాధ్యమైన రూ.15 లక్షల జమ, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వంటి మోసపూరిత హామీలు, అకస్మాత్తుగా పెద్ద నోట్ల నిర్ణయం వంటి ఏకపక్ష నిర్ణయాలు పునరావృతం కాకూడదు. తమ పార్టీకి చెందిన నాయకులు ఇతర శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్న ధూర్త ధోరణులను పూర్తిగా అరికట్టాలి. అదేవిధంగా ఆరెస్సెస్, ఇతర పరివార్ సంస్థలు కూడా తమ ఇంతకాలపు మెతక ధోరణిని, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే మొన్నటి వలె పెదవి విప్పే పద్ధతిని వదిలివేసి, మోదీ వంటివారిని, ఆయన నిర్దేశంలో కట్టు తప్పి వ్యవహరిస్తున్న బీజేపీని నియంత్రించాలి. ఆ విధంగా అది కూడా వారికి సవాలవుతున్నది. అదే పద్ధతిలో బీజేపీ కూడా అధికార ఆనందంలో మైమరవటం కాక, ఒక పార్టీగా కొంత వెన్నెముక తెచ్చుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చేయవలసింది తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ, సంఘ్ పరివార్‌ల కన్న ఎక్కువ. బీజేపీ, పరివార్లకు మంచో చెడో ఒక సిద్ధాంతం, లక్ష్యం ఉన్నాయి. అందుకు భిన్నంగా కాంగ్రెస్ తన సిద్ధాంతం, లక్ష్యం ఏమిటో నెహ్రూ తర్వాత మరిచిపోయింది. ఇందిర కాలంలో ఉండిన నటనలను కూడా వదిలివేసుకున్నది. తర్వాత ఆర్థిక సంస్కరణల అమలులో కనీస విచక్షణలను వదిలివేసి, ధనిక వర్గాల పార్టీగా మారి, సాధారణ ప్రజలకు, పేదలకు చాలా నష్టాలు చేసింది.
ఉద్యోగ-ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన మొక్కుబడి మాటలుగా మారాయి. అసమర్థ పాలన, అవినీతి, బంధుప్రీతి అదుపు లేకుండా సాగాయి. బీజేపీని ఎదుర్కోవటం చేతగాక, సాఫ్ట్ హిందూత్వ మార్గాన్ని ఎంచుకొని, మైనారిటీలను నిజంగానే ఓటు బ్యాంకుగా చూస్తూ, మానవాభివృద్ధి సూచీలు, పౌరహక్కులు తన హయాంలోనూ పతనమవుతూ పోగా సకల భ్రష్టత్వానికి గురైంది. ప్రతిపక్షాలపై కుట్రలు, వాటి ప్రభుత్వాల పట్ల వివక్షలు, రాజ్యాంగ దుర్వినియోగాలు, రాష్ర్టాల హక్కుల హరణలు అధికార కేంద్రీకరణలు వారి కాలంలో తక్కువేమీ కాదు. ఇటువంటి నానా వైఫల్యాల కారణంగానే కాంగ్రెస్ దేశమంతటా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ, మనం చూస్తున్న దశకు క్షీణించింది. అందువల్ల ఆ పార్టీ ఈ పతన కారణాలన్నింటిని విశ్లేషించి క్రమంగా సరిదిద్దుకొనవలసి ఉంటుంది. అట్లాగే సిద్ధాంతపరంగా, ఆర్థిక, అభివృద్ధి విధానాల పరంగా ఒక స్పష్టమైన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాలి. దానిని ప్రజలలోకి తీసుకువెళ్లి అందుకు తాము త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉండగలమనే విశ్వాసాన్ని కల్పించగలగాలి. అంతేతప్ప, 52 సీట్లను మిత్రపక్షాల తోడ్పాటుతో 99కి పెంచుకొని, ఇక భవిష్యత్తు బంగారుమయమని భ్రమించటం పొరపాటవుతుంది.
ఇండియా కూటమి విషయం కూడా అంతే. లోగడ ఏర్పడిన వివిధ ఫ్రంట్లు అధికారానికి రాగలిగి సైతం, తమకు ఒక సమగ్రమైన ఉమ్మడి అజెండా లేక, ఐక్యత అంతకన్నా లోపించి, కాంగ్రెస్ అవలక్షణాలలో అనేకం తమలోనూ ప్రవేశించి, చూస్తుండగానే కుప్పకూలాయి. బీజేపీ రాకకు అవసరమైన శూన్యాన్ని సృష్టించటంలో కాంగ్రెస్‌ది మొదటి బాధ్యత కాగా, వీరిది రెండవ బాధ్యత. కనుక, ఈ అనుభవాల నుంచి పాఠాలను కాంగ్రెస్‌తో పాటు తామూ నేర్చుకోవాలి. ప్రస్తుతం అధికారంలో గల రాష్ర్టాలలో జనరంజక పాలన అందించవలసిన తప్పనిసరి బాధ్యత ఉభయులపైనా ఉంటున్నది. ఇక రాగల కాలంలో ఒకవైపు బీజేపీ, పరివార్లు, మరొకవైపు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు ఏమి నేర్చుకొని, ఏ విధంగా వ్యవహరించి, దేశ ప్రజలకు ఆశాభావం కలిగించగలవో చూడాలి.
-టంకశాల అశోక్