‘మానవజాతి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇది అనివార్యమైన, తప్పించుకోలేని, భయానక వాస్తవం మన కండ్లముందు కనపడుతున్నది. మన ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి మానవ జాతి పూర్తిగా నశించడం. రెండవది కొంత వివేకం, జ్ఞానంతో, కొత్త రాజకీయ ఆలోచనలతో యుద్ధాలను ఆపేసి ఈ విపత్తును శాశ్వతంగా నివారించడం. తద్వారా ప్రకృతిని సుస్థిర రీతిలో కాపాడుకోవడం’..
మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో కోట్లాది ప్రజల మరణం, తీవ్ర ఆస్తి, ఆవరణ వ్యవస్థ విధ్వంసం నుంచి ప్రపంచం తేరుకోకుండానే అమెరికా, రష్యా అగ్రరాజ్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రతరమవుతున్న కాలంలో మానవ వైజ్ఞానిక చరిత్రను తన శక్తి నిత్యత్వ సూత్రం ద్వారా మార్చిన శాస్త్రవేత్త, మానవతావాది ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, తత్వవేత్త బెట్రాండ్ రస్సెల్ నేతృత్వంలో 1955, జూలై 7న తమ పేర్లతో ప్రకటించిన ప్రణాళికలో ప్రస్తావించిన మాటలు.
Cold War | 2025, జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలో వెలువరించిన ఆదేశాలు శాంతి కాముక పౌర సమాజాన్ని కలవరానికి గురిచేశాయి. ఫాసిజం, ప్రచ్ఛన్నయుద్ధ తీవ్రతను అనివార్యం చేసే దిశలో ట్రంప్ కార్యాచరణ కనిపిస్తున్నది. కోల్పోయిన అమెరికా ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు కృషిచేస్తానని చెప్పారు. తీవ్ర జాతీయవాదం, విద్వేషపూరిత ప్రసంగాలు, రాజకీయాలతో రెండవసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికా ఆధిపత్యం కొనసాగాలని అమెరికా ఫస్ట్ నినాదాన్ని బలంగా వినిపించారు.
ఇంకా తన ప్రసంగంలో విస్తరణ వాదాన్ని, చైనాపై ప్రత్యక్ష అక్కసును వ్యక్తం చేశారు. చైనా ప్రభావాన్ని తగ్గించే దిశగా పనామా కాల్వ స్వాధీనం గురించి మాట్లాడారు. పలు యూఎన్ ఏజెన్సీల నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. ఏక ధ్రువ ప్రపంచాన్ని ద్వి ధృవ ప్రపంచంగా మారుస్తున్న చైనాతో చాప కింద నీరుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నదని నిపుణుల అంచనా.
డబ్ల్యూహెచ్‌వో నుంచి త్వరలో వైదొలుగుతామని ప్రకటించారు. ఈ సంస్థ చైనా కనుసన్నలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని అలాంటి సంస్థ తమకు అక్కరలేదన్నారు. ఈ సంస్థకు వచ్చే నిధులలో 18 శాతం అమెరికా నుంచి వస్తున్నాయి. కానీ, అది చైనా పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపణ చేశారు. వాస్తవానికి చైనా ప్రాణాలను కాపాడే అత్యవసర మందుల తయారీకి కావాల్సిన రసాయనాల ప్రాసెసింగ్‌లో పై చేయి సాధించింది. ఆ మందులను డబ్ల్యూహెచ్ వో ద్వారా ప్రపంచానికి అందుబాటులో ఉంచటంలో కీలక పాత్ర పోషించింది. తన ‘అమెరికా ఫస్ట్’ విజన్‌కు భిన్నమైన అంశం కాబట్టి ట్రంప్ ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏదేమైనా అమెరికా నిధులు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ, టీబీ, ఇతర సాంక్రామిక, అసాంక్రామిక వ్యాధుల చికిత్సలో కీలక పాత్ర పోషించాయి. అమెరికా లేని డబ్ల్యూహెచ్‌వోలో కార్యక్రమాలతో మూడవ ప్రపంచ దేశ ప్రజలు ఇబ్బందులకు గురయ్యే స్థితి సంభవిస్తుంది.
ఇదిలా ఉంటే.. జనవరి 24న దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో వర్చువల్‌గా మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు హెచ్చరికతో కూడిన ఆహ్వానం పలికారు. అమెరికాలో తక్కువ పన్నులతో తమ వస్తువుల ఉత్పత్తిని చేపట్టాలని లేకపోతే పలు ఆంక్షలు, అధిక టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని మందలించారు. తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్న యూరోపియన్ యూనియన్‌కు, పొరుగుదేశం కెనడాకూ హెచ్చరిక చేశారు. ఈయూ కీలక దేశాలైన జర్మనీ ఛాన్సలర్ కోఫ్జా, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఘాటుగా ప్రతిస్పందించారు. తనదైన సొంత జ్ఞానం సాంకేతికత, పారిశ్రామిక విధానాలతో బలిష్ఠమైన శక్తిగా తమ ఐరోపా సమాజం ఎదుగుతుందని, నిలబడుతుందన్నారు. కెనడా ప్రధాని అదే రకమైన సమాధానం చెప్పారు.
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగి సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్థ అపిల్లేట్ అథారిటీ నుంచి యునెస్కో, ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇలా పలు వేదికల నుంచి వెలుపలికి వస్తానని ట్రంప్ చెప్తూ వస్తున్నారు. జీవశాస్త్ర సంబంధ లోపాలతో జనించిన ట్రాన్స్‌జెండర్స్ హక్కుల రద్దు, డెన్మార్క్ నుంచి గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని లాక్కోవడం వంటి ప్రకటనలు యుద్ధ మేఘాలకు, ఆర్థిక పర్యావరణ సంక్షోభానికి దారితీస్తాయి. భూ తాపాన్ని పెంచుతున్న వాయు ఉద్గారాల విడుదలలో అమెరికా రెండవ పెద్ద దేశం. 2030 వరకు ఈ వాయువుల విడుదల తగ్గించే లక్ష్యాలలో 1/3 వంతు మాత్రమే సాధించింది. పరిహారంగా పేద దేశాలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగింది.
బెట్రాండ్ రస్సెల్-ఐన్‌స్టీన్ ప్రణాళిక (1955) వెలుగులో అంతర్జాతీయ సమాజం ప్రకృతిని, ప్రజలను హననం చేసే పలురకాల చర్యలను నిరోధించటానికి అనేక ఒప్పందాలు జరిగాయి. అణ్వస్త్ర తగ్గింపు ఒప్పందం, సముద్ర గర్భాన్ని, అంతరిక్షంను యుద్ధ కార్యక్రమాలకు వాడకూడదని ఒప్పందం, హానికర రసాయన ఆయుధాల వాడక నిషేధం, ఓజోన్ తగ్గింపు, క్యోటో ప్రోటోకాల్, సముద్ర ప్రాదేశిక జలాల న్యాయ ఒప్పందం మొదలైన వాటిపై ప్రపంచ దేశాలు సంతకం చేసి ఏదోమేరకు గౌరవిస్తూ తీవ్ర ఆర్థిక సంక్షోభం, మూడవ ప్రపంచయుద్ధ భారిన పడకుండా కాపాడాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా వీటిని ఖాతరు చేయకుండా ఉండే వైఖరిని ప్రదర్శిస్తున్నది.
1930లో ఆర్థిక మాంద్యానికి అమెరికా విధించిన టారిఫ్‌లు, వాణిజ్య ఆంక్షలు కారణమయ్యాయి. అనేక దేశాల స్థూల దేశీయోత్పత్తి పడిపోయింది. ఫలితంగా చెలరేగిన అశాంతిని హిట్లర్ వంటి ఫాసిస్ట్ శక్తులు ఉపయోగించుకొని జాతి విద్వేషాలను, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టి మానవ, ప్రకృతి హననానికి దారితీశాయి. పరిపాలనలో, ప్రసంగాల్లో హిట్లర్ నమూనాను అనుసరిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన క్యాబినెట్లో 14 మంది బిలియనీర్లను తీసుకున్నాడు. కుబేరుడు ఎలన్ మాస్క్ హిట్లర్ తరహా అభివాదం చేశాడు. కొద్దిమంది కుబేరుల ప్రయోజనాల కోసం ప్రపంచ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. అమెరికా మూలవాసులు రెడ్ ఇండియన్లు. మిగతా ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారే. అమెరికా అభివృద్ధిలో అన్ని ఖండాల మేధో, శ్రామిక ప్రజల భాగస్వామ్యం ఉన్నది. ఈ వాస్తవికతను విస్మరిస్తూ రాజకీయ అధికారం కోసం తనవైపు లేని ప్రజలను ఆక్రమిత నేరస్థులని, గ్రహాంతర వాసులని అవమానిస్తూ దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి యురేషియా కన్సల్టింగ్ సంస్థ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మెర్ ప్రపంచానికి ప్రమాదకరమైన వ్యక్తి అని హెచ్చరించాడు. చరిత్రను వెనక్కి నెట్టివేసే ఈ ధనికస్వామ్య ఫాసిస్ట్ ఏకధ్రువ వ్యవస్థ విధానం మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమిస్తుంది. ప్రపంచ పోలీస్‌గా చెలామణి అవ్వడం అమెరికాకు అత్యంత దురాశ అవుతుంది. చైనా, రష్యా, ఇవి సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి, యూరోపియన్ యూనియన్, ఆసియాన్ వంటి పలు కూటములు ప్రపంచాన్ని బహుళ ధృవంగా మార్చాయి.
ఈ నేపథ్యంలో అమెరికా దూకుడు యుద్ధ ఉద్రిక్తతలకు, ఆర్థిక విధ్వంసానికి దారి తీస్తుంది. దీన్ని నిలువరించడానికి, నిరోధించడానికి ఆసియా వెలుగుగా, ప్రపంచ వెలుగుగా నిలిచిన బుద్ధుడు జన్మించిన ఈ నేల నుంచి సామ్రాజ్యవాద, విస్తరణవాద, ధనిక స్వామ్య వ్యతిరేక పోరాటాలు ప్రారంభమవ్వాలి. గాంధీతో ప్రభావితులైన ప్రపంచ వైజ్ఞానిక ప్రగతిని మహా గొప్ప మలుపుతిప్పిన మహనీయులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్-బెట్రాండ్ రస్సెల్‌లు ప్రకటించిన శాంతి సహా జీవన ప్రణాళికకు 75 ఏండ్లు నిండాయి. ఈ వెలుగులో నెహ్రూ అలీన విధానంలో మూడవ ప్రపంచ దేశాలు మానవ భవిష్యత్తును సంక్షోభంలో నెట్టివేస్తున్న అమెరికా ఏకస్వామ్య ప్రయత్నాల నిరోధానికి ఐక్య సంఘటనగా ఏర్పడటం ఒక చారిత్రక అవసరం.