మన దేశం అనాదిగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూరుకుపోయింది. అయితే, ఈ వ్యవస్థలో దళితులను అట్టడుగు స్థానంలో ఉంచడం దారుణం. తద్వారా దళితవర్గాలు వేల ఏండ్ల నుంచి సామాజిక హక్కులకు నోచుకోక.. అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. అందుకే, వారి అభ్యున్నతి కోసం అంబేద్కర్ నాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో 59 ఉపకులాలు ఉండగా.. ప్రధానంగా మాదిగ, మాలలు అత్యధికంగా ఉన్నారు. అయితే, వారిలో జనాభాపరంగా అత్యధికంగా ఉండి, వెనుకబడిన కులం మాదిగ.
SC Reservations | దేశంలోని వివిధ రాష్ర్టాల్లో మాదిగలను పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఉమ్మడి ఏపీలో మాలలతో పోలిస్తే మాదిగలే అత్యధికులు. కానీ, వారు విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా వెనుకబడ్డారు. మెజారిటీలైన మాదిగ కులానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తగిన వాటా దక్కకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్నీ పలు కమిషన్లు కూడా ధృవీకరించాయి. దళిత సామాజికవర్గంలోని మాల, మాదిగ వర్గాల నడుమ అసమానతల కారణంగా ఈ రెండింటి మధ్య వైరుధ్యం పెరిగింది.
ఈ నేపథ్యంలోనే మందకృష్ణ మాదిగ, తదితర మాదిగ మేధావుల నేతృత్వంలో 1994న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం మొదలైంది. దీంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996లో వర్గీకరణ అంశంపై జస్టిస్ పి.రామచంద్రమూర్తి కమిషన్ను నియమించారు.
వెనకబాటుతనం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాలుగా వర్గీకరణ చేయాలని ఈ కమిషన్ సిఫారసు చేసింది. అంతేకాదు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విద్య, ఉద్యోగాల్లో వర్తింపజేయాలని సూచించింది. ఈ కమిషన్ నివేదిక మేరకు 2000 సంవత్సరం నుంచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలుపరిచారు. దీని ప్రకారం బీ వర్గంలో ఉన్న మాదిగలకు 7 శాతం, సీ వర్గంలో ఉన్న మాలలకు 6 శాతం, ఇతర ఉపకులాలకు మిగతా శాతాన్ని వర్తింపజేశారు. దీంతో కొంతవరకు మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో లబ్ధి చేకూరింది.
అయితే, ఎస్సీ కులాల్లో సామాజిక సమానత్వం కోసం అమలుపరిచిన ఉప వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్న ఎస్సీ ఉప వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే ఈవీ చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా-2004 కేసుగా పేర్కొంటారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాదిగ ఉప కులాలు నిరసన వ్యక్తం చేసి, వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో 2007లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్ర కమిషన్ను నియమించింది. రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని ఈ కమిషన్ కూడా నొక్కిచెప్పింది. కానీ, ఓట్ల రాజకీయం కోసం ప్రభుత్వాలు ఇన్నాళ్లు దాటవేశాయి. ఇటీవల స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇతరులు వర్సెస్ దేవీందర్సింగ్ కేసులో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి 2024 ఆగస్టు 1న రాష్ర్టాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో 20 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది.
సుప్రీం కోర్టు తీర్పులో పలు విషయాలను ప్రస్తావించింది. ఎస్సీ కులాల్లో ఎక్కువ, తక్కువలున్నాయాని చెప్పింది. సామాజిక, ఆర్థిక స్థితిగతుల గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా వర్గీకరణ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత మాలల్లో అలజడి మొదలైంది. మాల, మాదిగ సోదరుల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ రెండు కులాల మధ్య వైషమ్యాలు మరింత పెరిగిపోతుండటం విచారకరం. ఈ విమర్శల పరంపరలో రాజకీయ నాయకులు భాగం కావడం ఆందోళనకరం.
మాలలతో పోలిస్తే మాదిగలు వెనకబడ్డారనేది వాస్తవం. మాదిగలు ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికులుగా జీవిస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మాదిగలు వెనుకబడ్డారు. వాస్తవానికి, ఏపీలో మాలల జనాభా ఎక్కువ. బ్రిటిష్ పరిపాలనలో ఆంధ్ర ఉన్న సమయంలోనే వీరు విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నైజాం పాలనలో ఉన్న మాదిగలు మాత్రం చర్మకార వృత్తికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిగలు కన్నా తక్కువ సంఖ్యలో ఉన్న మాల సోదరులు రిజర్వేషన్లలో మెజారిటీ వాటాను కోరడం ఎంతవరకు సబబు?
ఏండ్ల నుంచి అణచివేతకు గురైన జాతిగా మాదిగ సమాజం సామాజిక వివక్షను అనుభవిస్తున్నది. అణచివేతకు గురైన వర్గాన్ని, ఆధిపత్యం వర్గంతో సమానం చేయడానికే కదా రిజర్వేషన్లను అంబేద్కర్ కల్పించారు. ఈ క్రమంలో రిజర్వేషన్ ఫలాల్లో కూడా అసమాన పంపిణీ జరగడం వల్ల మరింత నష్టం చేకూరుతుంది. కాబట్టి, జనాభా ప్రాతిపదికన నిష్పక్షపాతంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది.
– సంపతి రమేష్ మహారాజ్ 79795 79428 (వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)