కాంగ్రెస్‌కు తెలంగాణలో బలం అసలు లేదని ఎవరూ అనలేరు. కాని ఆ బలం అధికారంలోకి వచ్చేందుకు ఎంత మాత్రం సరిపోదని ఆ పార్టీకీ తెలుసు. ఒకవేళ 2014 నుంచి, లేదా 2018 నుంచి కేసీఆర్ పాలన సమర్థవంతంగా లేకపోయినట్లయితే, ప్రజలలో ఆదరణ తగ్గి శూన్యం ఏర్పడి కాంగ్రెస్ బలం తప్పక పెరిగేది. కాని అటువంటిదేమీ గత తొమ్మిదేళ్లలో జరగకపోగా, తన అభివృద్ధి-సంక్షేమాల జనరంజక పాలనతో కేసీఆర్ దుర్నిరీక్ష్యునిగా మారారు. ఇది కాంగ్రెస్‌తోసహా ఆయన విమర్శకులు సైతం జనాంతికంగా అంగీకరిస్తున్న మాట.
కాంగ్రెస్‌కు బలం కొంత సంప్రదాయికంగా ఉన్నా, ప్రతికూలంగా మోహరించిన అంశాలు మొదటినుంచీ కొన్ని ఉన్నాయి. వాటిని 2014కు ముందు, ఆ తర్వాత అనే పద్ధతిలో చూద్దాము. 2014కు ముందు ఆ పార్టీ తెలంగాణను అనేక సమస్యలకు గురిచేసింది. ఈ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రలో కలిపింది. హామీలు అమలుగాక ఉద్యమాలు వచ్చిన ప్రతిసారీ అణగదొక్కింది. పదవులు, ధనార్జన కోసం సీమాంధ్రులతో కుమ్మక్కు అయింది. కనీసం తెలంగాణ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల పాటు ఇదే పాపాల చరిత్ర కొనసాగింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యక్తిగతమైన విలువలు ఉన్నందున అందరినీ కాదని ప్రత్యేక రాష్ర్టానికి అంగీకరించగా, ఇక్కడి పాపాత్ములు ఆమె కొంగుచాటున దాగి, ‘తెలంగాణ మేమే ఇచ్చాం’ అంటూ మోసపూరిత నినాదాలతో ప్రజలను బోల్తా కొట్టించజూసారు. కాని ప్రజలకు అంతా తెలుసు గనుక ఈ కపటపు నినాదం 2014లో, 2018లో చిత్తుగా ఓడింది. అయినా వారు అదే చెల్లని నినాదం ఇప్పుడు మళ్లీ ఇస్తున్నారు. అరిగిన రికార్డు వేయటం మినహా తాము స్వయంగా ఏమి చేసారో చెప్పే నిజాయితీ, ధైర్యం మాత్రం వారికి లేవు. ఇదంతా వారు 1956 నుంచి మోస్తూ వస్తున్న చారిత్రకమైన పాపాల మూట. ఇంగ్లీషులో చెప్పాలంటే హిస్టారికల్ బ్యాగేజ్.
ఇంత చేసినా వారి రాజ్యం 2014 తర్వాత సాగి ఉండేదేమో. కాని అట్లా జరగటం లేదు. అందుకు కారణాలేమిటో ఇపుడు అర్థం చేసుకుందాం. పైన చెప్పుకున్న విధంగా 2014 జూన్ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మహాతీవ్రమైన లోటు బడ్జెట్‌తో ఉంది. సోనియాగాంధీ కొంగుచాటున దాగి తమ పాపాలు ప్రక్షాళన చేసుకునే కపటపు ప్రయత్నాలు, ఇక్కడి ప్రజల చైతన్యం ముందు విఫలమయ్యాయి. మరొకవైపు, ప్రత్యేక రాష్ట్రం కో సం రాజీ లేని పోరాటం సాగించి ప్రజల కలను సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ఒక మహా పర్వతం వలె లేచి నిలిచింది. ఒకవేళ అది జరగనట్లయితే, పైన అనుకున్నట్లు, కాంగ్రెస్ తలపై 58 సంవత్సరాల చారిత్రకమైన పాపాల మూట ఉండినప్పటికీ 2014లో అధికారానికి వచ్చి ఉండేదేమో. కాని ఇప్పుడు ప్రజల సమస్త ఆకాశాన్ని టీఆర్ఎస్ ఆక్రమించి వేసింది. కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాల కారణంగా రహదారి ఆవలకు తనను తానే గెంటివేసుకుంది. గమనించదగినదేమంటే, 2014 తర్వాత తొమ్మిదేళ్లలో కూడా ఆ పార్టీ తిరిగి రహదారి పైకి వచ్చేందుకు తగిన ప్రయత్నాలు ఏ దశలో కూడా చేయలేదు. అందుకు తగినట్లు ఇతర పరిస్థితులు కూడా వారికి ప్రతికూలంగా సాగాయి.
ఇపుడు పరిస్థితిని రెండు కోణాలుగా చూడాలి. 2014 నుంచి స్వయంగా కాంగ్రెస్ వైఫల్యాలు ఏమిటన్నది ఒకటి. పార్టీకి ప్రతికూలంగా గల ఇతర అంశాలు ఏమిటన్నది రెండు. ముందుగా మొదటి విషయం చూద్దాం. 2014 వరకు ఉండిన పాపాల మూట ఆ తర్వాత కూడా అట్లాగే కొనసాగటం ఒకటి కాగా, తర్వాత కాలంలో ఆ పార్టీ చిందరవందర అయింది. పలువురు టీఆర్ఎస్లోకి, ఇంకా తర్వాత బీజేపీలోకి పోయారు. మిగిలిన పార్టీకి సరైన నాయకత్వం లేకపోయింది.
ఉన్న నాయకుల మధ్య గ్రూపులు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో బలహీనపడుతూ, రాష్ర్టాలలో అధికారాన్ని కోల్పోతూ, సోనియా ఆరోగ్యం దెబ్బతింటూ, రాహుల్‌గాంధీ అసమర్థునిగా తేలుతుండిన స్థితిలో తెలంగాణ కాంగ్రెస్‌ను దారిలో పెట్టగలవారు లేకపోయారు. ఈ పరిణామాల మధ్య, మరొకవైపు కొన్ని అంశాలు కలిసి వచ్చిన బీజేపీ, ఒక దశలో కాంగ్రెస్‌ను వెనుకకు నెట్టి రెండవస్థానంలోకి ఖాయంగా వస్తున్నదనే గాలిని సృష్టించగలిగింది. కాంగ్రెస్ పరిస్థితి అంతగా పతనమైంది. ఇక కేసీఆర్ నాయకత్వ ప్రతిష్ఠ, పరిపాలనల ఉధృతి కాంగ్రెస్‌కు మూలిగే నక్క తలపై తాటిపండు అయ్యింది.
ఈ విధంగా నాలుగు వైపుల నుంచి నాలుగు సమ్మెటపోట్లకు గురవుతూ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడసాగింది. ఆ నాలుగింటిలో మొదటిది ప్రజల దృష్టిలో ఇప్పటికీ తరచు ప్రస్తావనకు వచ్చే తమ 58 ఏళ్ల పాపాలమూట, రెండవది 2014 అనంతరం కూడా కొనసాగుతున్న బలహీనతలు, మూడవది బీజేపీ ఉధృతి, నాల్గవది కేసీఆర్ పాలన మధ్యాహ్న మార్తాండుని వలె సాగుతుండటం. ఇందుకు ప్రతిగా ఈ రోజున తెలంగాణ ప్రజలకు చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. వారు అధికారంలో లేకున్నా కనీసం తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వంపై ఇక్కడా, ఢిల్లీలో ప్రకటనలు, విమర్శలు, ఆందోళనల వంటివి చేస్తుండి ఉంటే ప్రజల దృష్టిలో కొంతయినా విశ్వసనీయత, నైతికబలం లభించి ఉండేవి. తెలంగాణ సమాజానికి, దేశానికి ఇంత ప్రమాదకరంగా పరిణమించిన బీజేపీపై ఒక పద్ధతి ప్రకారం, ఒక నిష్ఠతో కార్యకలాపాలు ఏవీ చేయకపోవటం కూడా వారిని అనుమానాస్పదులుగా మార్చింది. అటువంటిది తాము కర్ణాటకలో గెలిచాము గనుక ఇక్కడ కూడా ఆటోమేటిక్‌గా గెలవగలమనుకోవటం ఆత్మవంచన అవుతుంది.
ఇదంతా చాలదన్నట్లు, ప్రభుత్వంపైన, కేసీఆర్‌పైన విలువలేని విమర్శలతో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను మరింత కోల్పోతున్నది. విమర్శించేందుకు అసలేమీ ఉండవని కాదు. కాని ఎప్పుడైనా మంచిని మంచిగా, చెడును చెడుగా గుర్తించి మాట్లాడిన వారికే ప్రజలు విలువ ఇస్తారు.
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండగా వీరు మరింత రెచ్చిపోయి చేస్తున్న విమర్శలకు ఛానళ్లలో, పత్రికలలో, సోషల్ మీడియాలో ప్రచారం బాగానే లభిస్తుండవచ్చుగాక. కాని ఒకసారి సామాన్యులను కదిలించి చూస్తే వారిందుకు ఇస్తున్న విలువ ఏమీ లేదని అర్థమవుతుంది. వారు తమ అనుభవాల దృష్టి నుంచి చూస్తూ, ఇటువంటి విమర్శలను ఈసడించి కొట్టివేస్తున్నారు. మొదట అనుకున్నట్లు కాంగ్రెస్‌కు సంప్రదాయిక బలం కొంత ఉన్న మాట నిజం. కాని అది పైన చెప్పుకున్న పరిస్థితుల మధ్య పెరగకపోగా క్షీణిస్తున్న స్థితిలో.. అధికారంపై పార్టీ ఆశలు పూర్తిగా అవాస్తవికమన్నది వారికైనా తెలియనిది కాదు.
టంకశాల అశోక్