మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిభారాన్ని తగ్గించడం, పర్యవేక్షణ, పూర్తిస్థాయి కచ్చితత్వాన్ని అమలు చేయడం ఆహ్వానించదగినదే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిబద్ధత, వారి పనితీరును పర్యవేక్షించడానికి ఇప్పటికే అనేక ప్రామాణిక అంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమలవుతున్న సాంకేతికతను, అందుబాటులో ఉన్న మెకానిజాన్ని కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) వెనుక పడటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
రాష్ట్రంలో పర్యవేక్షణ అధికారుల కొరత ఎప్పటినుంచో ఉన్నది. అయితే, ఆ పోస్టులను భర్తీ చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదు. గత ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను తీసుకొచ్చింది. వాటిలో హాజరు సరిగ్గా నమోదవుతూనే వచ్చింది. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు ఆ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ యంత్రాలన్నీ ఆయా పాఠశాలల్లోనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో ఎవరి ఫోన్ నుంచి వారే జీపీఎస్ ట్రాక్డ్ అప్లికేషన్ ద్వారా సెకండ్లు సహా విజయవంతంగా హాజరు నమోదు చేశారు.
అదీ కాకుండా విద్యార్థుల కోసం నిర్దేశించిన డీఆర్ఎస్-ఎఫ్ఆర్ఎస్ అప్లికేషన్ ఎలాగూ ఉండనే ఉంది. అదీ కాకుండా అనేక గూగుల్ ఫార్మ్స్, లింకులు, గూగుల్ షీట్లు, జూమ్ మీటింగులు ఎవరు, ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ఎరుక చేస్తూనే ఉన్నాయి. కాదు, కూడదంటే కాంప్లెక్స్ పెద్దలు, మండల విద్యాధికారులు, నోడల్, స్పెషల్ అధికారులు అన్ని పాఠశాలలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కొన్ని జిల్లాలో ప్రార్థన సమయంలో జీపీఎస్ ట్రాక్ అయ్యేలా ఫొటో తీసి అధికారులకు పంపుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీవారు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పిల్లల తల్లిదండ్రులు.. ఇలా అనేక అనధికారిక పర్యవేక్షణలు జరుగుతూనే ఉన్నాయి.
జీతభత్యాలు ఇవ్వడానికే చాలీచాలని బడ్జెట్లో అక్కరకురాని యంత్రాల కొనుగోలు ఎవరి కమీషన్ కోసం? కాపలా పెంచడం మంచిదే. ఇలా యంత్రాల కొనుగోలుకు బదులు, పర్యవేక్షణ యంత్రాంగాన్ని భర్తీ చేస్తే వ్యవస్థలో లోపాలు తగ్గుతాయి.
మనుషుల మీద నమ్మకం లేకపోతే, ప్రస్తుతం బూజుపట్టిపోయి బడుల్లో ముసుగేసిన బయోమెట్రిక్ మెషిన్లు, లేదా మొన్న ఉపాధ్యాయ శిక్షణకు వినియోగించిన జీపీఎస్ ట్రాక్డ్ మొబైల్ అప్లికేషన్ లేదా పిల్లల కోసం వాడే అప్లికేషన్ను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. నిజంగా విద్యా నాణ్యత, ప్రభుత్వ పాఠశాలల మనుగడ మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలి. విద్యా సంస్కరణలు చేసినట్టు ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెంచుతూ, నిందలకు గురిచేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుముఖం పట్టడం వెనుక విధానపరమైన లోపాలు ఉన్నాయనే వాస్తవాన్ని అంగీకరించకుండా ఉపాధ్యాయులను బలి చేయడం అత్యంత దారుణం. అందరితో సరైన విధానంలో పని చేయించాలని ప్రభుత్వం అనుకున్నట్టయితే, ఆ విధానం మంత్రులు, ముఖ్యమంత్రి నుంచే అమలు చేయాలి. వారి శరీరంలో ఒక చిప్ అమర్చి, వారి లైవ్ హాజరు అందరూ చూడగలిగేలా సంస్కరణలు తీసుకురావాలి. అనాలోచిత ప్రభుత్వ నిర్ణయాలను పాలకులకు వివరించి, అందులోని లోటుపాట్లను చెప్పవలసిన యంత్రాంగం తాన తందాన అనడం విడ్డూరం.
అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఖర్చులు తగ్గించుకోవడం, ఆదా చేయడం గురించి సీఎం మాట్లాడుతున్నారు. కొత్తగా కాన్వాయ్ కొనలేదని, ప్రగతి భవన్ తనకు వద్దని ఊదరగొట్టారు. అయితే, ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఎఫ్ఆర్ఎస్ యంత్రాల కొనుగోలుకు తెరతీయడంపై ఆరోపణలు వస్తున్నాయి. సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఈ యంత్రాల కొనుగోల్మాల్ను సత్వరమే ఆపి, అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. పిల్లల విద్యాబుద్ధులు, సౌకర్యాలు, నిధులు, నియామకాల మీద అడ్డగోలుగా నియమాలను అతిక్రమిస్తున్న ప్రైవేటు, కార్పొరేటు సెక్టార్ మీద కొరడా ఝళిపిస్తే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనిపించుకుంటారు.
– (వ్యాసకర్త: సోషల్ వర్కర్, జర్నలిస్ట్)
రావుల రాజేశం 77801 85674