కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (సర్) ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ లాంటి అనేక రాష్ర్టాల్లో లక్షలాది ఓట్లు తొలగించడమే ఇందుకు ప్రధాన కారణం. ఓటుహక్కు కోల్పోతే రేషన్‌కార్డుతో పాటు ఆయా ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వర్తించబోవన్న సంకేతాలు కూడా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ‘సర్’ కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నది. ఉభయ రాష్ర్టాల ప్రజలు తమ ఓట్లను పునరుద్ధరించుకునేందుకు బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘సర్’ సజావుగా సాగించేందుకు, నిర్దిష్ట సమయంలో కార్యక్రమం పూర్తిచేసేందుకు ప్రతి బూత్‌కు ఒక అధికారి (బీఎల్ఓ), ఆయనకు లేదా ఆమెకు ఇద్దరు సహాయకులు, బూత్ సూపర్వైజర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. బీఎల్ఓలు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు నింపేటప్పుడు ఓటర్‌కు తలెత్తే అనుమానాలను నివృత్తి చేయలేక బిక్కమొహం వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ వేసే ప్రశ్నలకు ‘యూట్యూబ్ చూడండి’ అంటూ కొందరు బీఎల్ఓలు సమాధానమిస్తున్నారు. దీనిని బట్టి ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానం, ఓటర్‌కు కలిగిన అనుమానాల నివృత్తిపై బీఎల్ఓలు, వారి సహాయకులు, సూపర్వైజర్లకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తున్నది.
ఎన్యూమరేషన్ ఫారంపై ఓటర్ ప్రస్తుత వివరాలు, ఫొటో ముద్రించి ఉంటాయి. ప్రధానంగా ఎన్యూమరేషన్ ఫారం మొత్తం 2002 ‘సర్’ ఓటర్ జాబితా ప్రామాణికంగా పూరించాలి. ఈ ఫారం మొత్తం మూడు విభాగాలుగా నింపే అవకాశం ఉంటుంది. 2002 ‘సర్’లో ఓటర్ పేరు ఉంటే ఆ వివరాలు మొదటి విభాగంలో పూరించాలి. ఆ విభాగంలో ఓటర్ పేరు, 2002 నాటి ఓటర్ కార్డు నంబర్ తదితర వివరాలతోపాటు వారి బంధువు పేరు, ఓటర్‌కు అతనితో గల బంధుత్వం వివరాలు నింపాలి.
అదే విభాగంలో తండ్రి గురించి కూడా వివరాలు అడిగారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆనాటి ‘సర్’ ఓటర్ జాబితాలో వేలాది మంది ఓటర్లకు తండ్రి స్థానంలో బంధువుల పేర్లు నమోదై ఉన్నాయి. ఓటర్ జాబితాలో ఓటర్ కార్డు నంబర్లు మాత్రం లేవు. ఓటర్ జాబితా ప్రచురించిన తరువాత వారికి కార్డులు మంజూరు చేశారు. అయితే, వీరికి మంజూరు చేసిన ఓటర్ కార్డుల్లో మాత్రం వారి తండ్రి పేరు ముద్రించారు. నాటి ఓటర్ లిస్టులో బంధువు పేరు ఉండి, కార్డులో మాత్రం తండ్రి పేరు ఉన్న వేలాదిమందిలో అయోమయం నెలకొన్నది. అదేవిధంగా మొదటి విభాగంలోని ఓటర్ ‘సర్’ జాబితాలో ఉన్న బంధువు వివరాలు రెండో విభాగంలో అడిగారు. 2002 ‘సర్’ జాబితాలో పేరు ఉండి రెండో విభాగంలో పూరించాల్సిన బంధువులు ఎవరూ నాటి ‘సర్’ జాబితాలో లేకుంటే వారి పరిస్థితి ఏమిటి? అనేది ఒక ప్రశ్న. మూడో విభాగంలో ప్రస్తుత ఓటర్ వివరాలు నింపాలి.
2002 ‘సర్’ ప్రోగ్రామ్ తరువాత ఇతర రాష్ర్టాలకు చెందిన అనేక మంది మహిళలు తెలంగాణ ప్రాంతానికి చెందిన పురుషులను వివాహం చేసుకున్నారు. వీరంతా చాలాకాలంగా తెలంగాణలోనే ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. కానీ వీరి పేరు, వీరి బంధువుల పేర్లు మాత్రం నాటి ‘సర్’ జాబితాలో లేవు. వీరి భర్తల పేర్లు మాత్రం నాటి ‘సర్’ జాబితాలో ఉన్నాయి. అయినా ‘సర్’ జాబితాలో ఉన్న వీరి భర్తల పేర్ల నమోదుకు రెండో విభాగంలో అవకాశం కల్పించకుండా ఓటర్ తల్లి, తండ్రి, గ్రాండ్‌పేరెంట్స్‌కు మాత్రమే అవకాశం కల్పించారు.
వారిని ఎన్నికల సంఘం సూచించిన 12 పత్రాల్లో ఏదో ఒకటి చూపించమని కోరడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ఓటుహక్కు కలిగినవారు లక్షలాది మంది ఉన్నారు. కానీ వారి పిల్లలు మాత్రం అధికశాతం తెలంగాణలోనే జన్మించి, ఇక్కడే చదువుకొంటూ స్థానికత పొంది ఉన్నారు. పర్యవసానంగా తెలంగాణలోనే ఓటుహక్కు ఉంచుకోవాలని వీరిలో చాలామంది భావిస్తున్నారు. ఏపీలో ‘సర్’ కార్యక్రమం ఈనెల 21న ముగుస్తుంది. తెలంగాణలో ఆగస్టు 3వరకు పొడిగించారు. తాము కోరుతున్న ప్రాంతంలోనే తమ ఓటు ఉంటుందా? అని గందరగోళం నెలకొన్నది. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
కైలసాని శివప్రసాద్ 94402 03999