రేవంత్ సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకున్నది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి దృష్ట్యా స్థానికంగా భంగపాటు తప్పదని తేలిపోవడంతో రేవంత్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నది. అందుకే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా కదలలేకపోతున్నది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అధిష్ఠానాన్ని చూసి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్నికల గుబులు పట్టుకున్నది.
2024 జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువుదీరి ఉన్నది. అయితే, గత స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులే సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని అన్ని జడ్పీలపై గులాబీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో తాజా మాజీ సర్పంచ్‌లను ఇంచార్జిలుగా నియమించేందుకు రేవంత్ ప్రభుత్వం విముఖత చూపింది. గ్రామ కార్యదర్శులకు ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి రాష్ట్రంలోని 12 వేల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ కుర్చీలు బూజుపట్టిపోయాయి. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్‌కు, ట్రాక్టర్ డీజిల్ ఖర్చులకు కూడా చిల్లి గవ్వ లేని దుస్థితి. దీంతో ఆరుగురు తాజా మాజీ సర్పంచ్‌లు హైకోర్టు మెట్లెక్కారు.
ఈ నేపథ్యంలో 2025 సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని జస్టిస్ టి.రమాదేవి నేతృత్వంలోని ధర్మాసనం 2025 జూన్ 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ తీర్పులో భాగంగా వార్డులు, మహిళలు సహా ఇతరవర్గాల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. అందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు 2025 జూలై 25తో ముగిసింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అందుకు ప్రధాన కారణం స్థానిక ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామనే భయమే.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్లలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే. మార్పు పేరిట చేసిన మాయ, వారంటీ లేని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇవ్వడంతో పల్లె ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. కానీ, నమ్మినవాళ్లను తెగనమ్మే కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన వెంటనే తన బుద్ధిని బయట పెట్టింది. గద్దెనెక్కించిన గ్రామీణులను వంచించింది. కాళేశ్వరాన్ని పండబెట్టి, పంటలను ఎండబెట్టింది. రెండు సీజన్ల రైతు భరోసాను ఎగ్గొట్టింది. రైతు కూలీలు, కౌలు రైతులకు భరోసా లేకుండాపోయింది. వడ్లకు బోనస్ వెక్కిరిస్తున్నది.
తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెలనెలా ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సాయం అటకెక్కింది. తులం బంగారం కాదు కదా, లక్ష కూడా ఇవ్వడం లేదు. పింఛన్లు పెంచలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, రాజీవ్ యువ వికాసం పేరిట యువతను మరోసారి వంచించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇండ్ల పేర కమీషన్ల దందా నడుస్తున్నది. ఇలా పల్లె ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నో హామీలలో ఒకటీ అరా తప్ప, అమలుకాలేదు. దాంతో అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పల్లె ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు, ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. వాస్తవానికి, అధికార పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆశావహుల తాకిడి తీవ్రంగా ఉంటుంది. కానీ, కాంగ్రెస్ పరిస్థితి వేరు. మూడు రంగుల జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలే జంకుతున్నారు. అందుకు ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రధాన కారణం.
స్థానిక ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కూడా సాకుగా చూపుతున్నది. వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశం కాంగ్రెస్‌కు లేనే లేదు. అందుకే, ప్రామాణికత లేని సర్వేను తప్పుల తడకగా నిర్వహించింది. పారదర్శకత లేని సర్వే, చట్టబద్ధత లేని కమిషన్, న్యాయస్థానాల ముందు నిలవని ఆర్డినెన్స్‌ల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 19 (1), (ఏ)లను ఉల్లంఘించింది. ఎస్ఈఈఈపీసీ సర్వే, బూసాని వెంకటేశ్వరరావు కమిషన్ నివేదికలను ఇప్పటివరకు అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ఎక్సపర్ట్ వర్కింగ్ గ్రూప్ నివేదికను బహిరంగపరచలేదు. స్థానిక సంస్థలు, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే రెండు వేర్వేరు బిల్లులను 2025, మార్చి 25న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ద్వారా ఆ బిల్లులను రాష్ట్రపతికి పంపించింది.
పలు విషయాల్లో స్పష్టత కోసం ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి తిరిగి పంపించినట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు? రాష్ట్రపతి ఏ విషయాలపై స్పష్టత కోరారు? వాటిని ప్రభుత్వం ఎప్పుడు పొందుపరుస్తుంది? సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, అదేరోజు హడావుడిగా లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఇదివరకే అసెంబ్లీ ఆమోదించిన అసలైన బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉండగానే, అదే అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే ఆర్టికల్ 213(1) (ఏ)ను ఉల్లంఘించడమే. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారా లేదా అనే విషయంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినట్టుగా సబ్ క్యాటగరైజేషన్ను ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరచలేదు. ఇలా ఎన్నో తప్పులను చేసి బీసీ రిజర్వేషన్లు సాకుగా చూపుతూ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుంటున్నారు.
ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉండగానే, హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మరో నాటకానికి తెరలేపారు. గతంలో బిల్లులను రాష్ట్రపతికి పంపించకుండానే బిల్లుల ఆమోదం కోసమని ఢిల్లీలో ధర్నా డ్రామా చేశారు. ఆ డ్రామాకు కనీసం రాహుల్ కూడా హాజరుకాలేదు. ఇప్పుడు ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారో, తిరస్కరించారో స్పష్టం చేయకుండా ఢిల్లీలో ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో మరో డ్రామాను రక్తి కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు ఆర్డినెన్స్ తీసుకువచ్చి, మరోవైపు బిల్లుల ఆమోదం కోసం మళ్లీ ఢిల్లీ టూర్‌కు వెళ్తామనడం విడ్డూరం. రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా, రాష్ట్రపతి, ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లకుండా… ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకువెళ్తామనడం రాజకీయ పబ్బం గడుపుకోవడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. మరో మూడేండ్లు మాత్రమే రేవంత్ సర్కార్‌కు సమయం ఉన్నది. చివరి ఏడాది ఎలాగూ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉంటుంది. మిగిలిన రెండేండ్లలో అయినా గ్రామాలను అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. డీజిల్ పోసేందుకు పైసలు లేక గ్రామ కార్యదర్శులు ట్రాక్టర్లను ఉన్నతాధికారులకు అప్పగిస్తున్న దుస్థితి. ఖజానా ఖాళీ అయిందని, లంకె బిందెలు లేవని, అప్పు పుట్టడం లేదని, చెప్పులు ఎత్తుకెళ్లే దొంగలా చూస్తున్నారని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడో చేతులెత్తేశారు. అందుకే, ప్రజల తిట్లు, శాపనార్థాలలో మునిగితేలుతూ, వ్యతిరేకతలో తడిసి ముద్దవుతూ కాంగ్రెస్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు స్థానిక ఎన్నికలపై పొంతన లేని ప్రకటనలు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నారు.
– (వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు) డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్