తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన రెండు సర్వే ఫలితాల తీరు ఒకింత ఆందోళనకు, ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలాగా అవి నిలుస్తున్నవి. వాటిలో మొదటిది బీసీ కులగణన కాగా, రెండోది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. రెండు అంశాలు జనాభాతో ముడిపడినవే. రాష్ట్రంలో జనాభా తగ్గుదల నమోదు కానప్పుడు బీసీ జనాభా ఎలా తగ్గిందన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం 25-04-2024 నాటికి రాష్ట్రంలోని ఓటర్లు 3,32,32,318 మంది. పాఠశాల విద్యాశాఖ ప్రకారం 1-10వ తరగతి విద్యార్థుల సంఖ్య 59,33,001 కాగా, ఇంటర్ విద్యార్థులు సంఖ్య 6,13,306. వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదేండ్ల వయసు కలిగిన పిల్లల సంఖ్య 59,33,001. మొత్తం 4,36,77,626 మంది. బడికి వెళ్లని ఒకటి నుంచి ఐదేండ్ల వయసున్న పిల్లల సంఖ్య దాదాపు 25 లక్షలు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం జనాభా 4 కోట్ల పైచిలుకు ఉండాలి. కానీ, బీసీ కులగణనలో 3,54,77,554 మాత్రమే ఉన్నారు.
2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం 24 గంటల్లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,63,95,794. ఇప్పుడు పదేండ్ల తర్వాత కులగణన చేస్తే నిజానికి జనాభా పెరగాలి. కానీ, తగ్గడం కులగణన విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నది. 2014లో బీసీలు 51 శాతంతో 1,85,61,856 ఉన్నారు. 2024 కులగణన ప్రకారం 1,64,09,179 తో 46.25 శాతానికి పడిపోయారు. మరి ఈ పదేండ్లలో 21,52,677 మంది బీసీలు ఏమయ్యారో ప్రభుత్వం చెప్పడంలేదు. అనూహ్యంగా ఓసీ జనాభా పెరగడం గమనార్హం. 2014లో 31,29,160 (8శాతం)గా ఉన్న ఓసీ జనాభా ఇప్పుడు 13.31 శాతానికి ఎగబాకి 47,19,115కి చేరడం విశేషం.
ఇక, ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దూకుడుగా పోవాలనుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం, జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, దానికి 60 రోజుల గడువు విధించారు. కనీసం ఆరు నెలల నుంచి సంవత్సర సమయం కేటాయించాల్సింది పోయి అరవై రోజుల గడువు మాత్రమే విధించడం అనుమానాలకు, సందేహాలకు తావు ఇస్తున్నది. 82 రోజుల్లో సమర్పించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ బయటకు రాకపోయినా దానిలోని అంశాల ఆధారంగా క్యాబినెట్ ఆమోదంతో అసెంబ్లీలో చర్చకు ప్రతిపాదించిన అంశాలు తప్పులతడకగా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పు కేసును సివిల్ అప్పీల్ నంబర్ 2317/2011 బదులు 2017/2011 గా వర్గీకరణ ప్రతిపాదిత అంశంగా పేర్కొనడం ఆశ్చర్యమే.
2011 జనాభా లెక్కల ప్రకారం 59 ఎస్సీ కులాల స్త్రీ పురుషుల మొత్తం జనాభా 54,32,680. వీటి ఆధారంగా చెప్పిన ప్రతిపాదిత మూడు క్యాటగిరీల్లో ఎ-లో 15 కులాల మొత్తం జనాభా సంఖ్య 1,71,625. బి-క్యాటగిరీలో 18 కులాల మొత్తం జనాభా 32,74,377. సి- క్యాటగిరీలోని 26 కులాల మొత్తం జనాభా 17,71,682 గా పేర్కొన్నారు. వీటి మొత్తం 52,17,684. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 59 ఎస్సీల కులాల మొత్తం జనాభా కంటే 2,14,996 తక్కువ. దీనిని బట్టి కమిషన్ పనితీరు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
బీసీ సంఘాలు కులగణనను ఆహ్వానించినప్పటికీ లెక్కలను మాత్రం మెచ్చడంలేదు. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేసినవారికి కేటాయింపులు నచ్చడం లేదు. తాము 13 శాతం డిమాండ్ చేశామని, కనీసం 11 శాతమైనా కేటాయిస్తూ సరిచేయాలని కోరుతున్నారు. ఎ- క్యాటగిరీలో పంబాల, మన్నె కులాలను చేర్చడాన్ని ఉపకులాల సంఘాల వారు వ్యతిరేకిస్తున్నారు. బి- క్యాటగిరీ వారు అదనపు కోటా కావాలంటున్నారు. సి- క్యాటగిరీలోని నేతకాని వారు తమకు ప్రత్యేక గ్రూపు కేటాయించాలంటున్నారు. వర్గీకరణను ఆహ్వానించిన మాల మేధావులు సైతం గ్రూపుల కేటాయింపుల ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. రామచంద్రరాజు కమిషన్ సూచించిన ఆంత్రోపలోజికల్, వృత్తులు, వాటి ఆధారిత గ్రూపుల కేటాయింపు నియమం పాటించలేదని, ఉషామెహ్రా కమిషన్ సిఫార్సుల వాసన ఊసేలేదని తిరస్కరిస్తున్నారు. కులగణన కాంగ్రెస్ పార్టీ అనుబంధ బీసీ సంఘాలు మినహా ఎవరిమెప్పు పొందడంలేదు. ఇక వర్గీకరణ ప్రామాణికత, శాస్త్రీయత న్యాయ సమీక్షలో మాత్రమే తేలనుంది. కాలపరిమితి విధించుకొని కార్యక్రమం ముగించి కాలరెత్తుకోవాలనుకుంటే కాలుజారి పడ్డట్టు అయింది.
– (వ్యాసకర్త: సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్)
మామిడి నారాయణ 94410 66032