కామారెడ్డి.. ఇప్పుడెక్కడ చూసినా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా వినిపిస్తోన్న ప్రాంతం. ఎందుకంటే ఇక్కడినుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పోటీ చేస్తుండటమే ప్రధాన కారణం. కారణాలేవైనప్పటికీ కామారెడ్డి నియోజకవర్గానికి కేసీఆర్ రాకతో ఈ ప్రాంతం పులకించిపోతున్నది. ఉద్యమ సమయంలో ఎంతగానో అండదండగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేటికీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా వెలుగొందుతున్నది. ఎన్నో ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసి ఉద్యమ పంథాను మరింత వేగంగా ముందుకుతీసుకువెళ్లేలా చేసింది. అందులో కామారెడ్డికి ఉన్న ఉద్యమ చరిత్ర ప్రత్యేకం.
స్వరాష్ట్ర సాధనలో కాలికి గజ్జె కట్టి ఆడిపాడి జనాలను చైతన్యపర్చిన ధూంధాం వంటి కార్యక్రమం కామారెడ్డిలోనే మొదలైంది. ఈ గడ్డపై నుంచి ధూంధాం ఆవిర్భవించి ఖండాంతరాల్లోనూ ఉద్యమ సమయాల్లో అనేక కార్యక్రమాలకు నెలవైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సాకారం కావడంలో స్ఫూర్తిగా నిలిచిన కామారెడ్డి గడ్డ ఇప్పుడు మరోమారు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. ప్రగతి రథసారథి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ స్వయంగా ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తుండటంతో అత్యంత ప్రాధాన్యం గల నియోజకవర్గంగా కామారెడ్డి మార్మోగుతున్నది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తల్లి వెంకటమ్మ పుట్టింది, పెరిగింది అంతా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలోని పోసానిపల్లి. ఇప్పుడు ఈ గ్రామాన్ని కోనాపూర్‌గా పిలుస్తుంటారు. అప్పర్ మానేరు డ్యాం బ్యాక్‌వాటర్‌కు కూత వేటు దూరంలోనే ఈ గ్రామం ఆవరించి ఉన్నది. ప్రస్తుతం వెలసిన గ్రామానికి మునుపు అప్పర్ మానేరులో పోసానిపల్లి మునిగింది. చాలామంది పొలాలు, ఇండ్లు మునిగిపోవడంతో కొంతమంది దగ్గర్లోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. మరికొంత మంది వేరేచోట భూములు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇలా కేసీఆర్ తల్లిదండ్రులు సైతం పోసానిపల్లిని వదిలి చింతమడకకు వెళ్లారు. వాస్తవానికి కేసీఆర్ తండ్రి రాఘవరావు స్వగ్రామం సిద్ధిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట.
పోసానిపల్లికి ఆయన ఇల్లరికం వచ్చారు. ఇక్కడే రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు జన్మించారు. వీరిలో ఇద్దరి వివాహాలు సైతం జరిగినట్టుగా వారి కుటుంబీకులు, స్థానిక ప్రజలతో పాటుగా కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో చెప్పారు. అయితే చింతమడకలోనే కేసీఆర్ జన్మించారు. ఇప్పటికీ కేసీఆర్ తల్లిగారి తరపువారు ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. పలువురు వ్యాపార, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గ్రామంతో సంబంధాలను వదులుకోలేదు. కేసీఆర్‌తోనూ ఇక్కడి కుటుంబాలకు సత్సంబంధాలున్నాయి. కాకతాళీయంగా కేసీఆర్ తల్లిగారి ఊరు కోనాపూర్ ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గంలో ఉండటం విశేషం.
సిద్దిపేట-కామారెడ్డి జిల్లా సరిహద్దులో పురుడు పోసుకునే మానేరు వాగు సిరిసిల్ల, కరీంనగర్ మీదుగా దిగువకు ప్రయాణిస్తుంది. అయితే ఈ వాగుపై మూడు ప్రధానమైన నీటిపారుదల ఆనకట్టల నిర్మాణం జరిగింది. ఈ మూడింట్లోనూ కేసీఆర్ కుటుంబీకుల గ్రామాలు మునిగిపోవడంతో మానేరుతో విడదీయరాని సంబంధం ఏర్పడింది. చరిత్ర పుటల్లోకి వెళ్తే 1940 దశకంలో మొదటగా అప్పర్ మానేరు డ్యాం నిర్మాణ సమయంలో అప్పటి పోసానిపల్లి నేటి కోనాపూర్‌లో కేసీఆర్ తల్లిదండ్రులు వెంకటమ్మ, రాఘవరావుల పొలాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో నిర్మితమైన మిడ్ మానేరు ప్రాజెక్టులో కేసీఆర్ అత్తగారి గ్రామం(శోభమ్మ తల్లిదండ్రుల స్వగ్రామం) కొదురుపాక సైతం ముంపునకు గురైంది. ఇందులో లక్ష్మీకాంతమ్మ, కేశవరావు దంపతుల ఇళ్లు, పొలాలు ప్రాజెక్టులో మునిగిపోయాయి.
ఇక కరీంనగర్ పట్టణ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం నిర్మాణంలో కేసీఆర్ సతీమణి శోభమ్మ పెద్దమ్మ (లక్ష్మీకాంతమ్మ సోదరి) శ్యామల, రాంచందర్‌రావు దంపతుల గ్రామం వచ్చునూర్ మునకేసింది. ఇలా మానేరు వాగుపై నిర్మితమైన మూడు ప్రాజెక్టుల్లోనూ కేసీఆర్ సంబంధీకుల భూములు మునిగిపోవడంతో వారికి మానేరు వాగుతో ఎనలేని సంబంధం ఏర్పడింది. సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లోనూ ముంపునకు గురైన తమ కుటుంబ పరిస్థితిని వివిధ సభా వేదికలపై జనాలకు వివరించారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఇవే కావడం విశేషం.
కామారెడ్డి ఉద్యమాల పురిటి గడ్డ. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ పాలకులను పరుగులు పెట్టించి ముచ్చెమటలు తెప్పించిన ఘనత ఈ ప్రాంత ఉద్యమకారుల సొంతం. రైలుకు ఎదురొడ్డి వెళ్లి ‘జై తెలంగాణ’ అంటూ ప్రాణాలొదిన ఘటన ఇక్కడే జరిగింది. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అంటూ ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ పూనుకున్న నాడు పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య సైతం విధి నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఘటన కూడా ఈ ప్రాంతంలో జరిగిందే. 2009, నవంబర్ 29వ తారీఖు నాడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ నాయకుడు కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహారదీక్షకు దిగిన సమయమది.
దీక్షకు దిగిన కేసీఆర్‌ను అరెస్టు చేసిన సమయంలో రాష్ట్ర ఆకాంక్షకై హైదరాబాద్‌లో శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆహుతై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు నవంబర్ 30వ తారీఖు నాడు ఉమ్మడి రాష్ట్ర పాలకుల తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ రోడ్డులో సెల్‌ఫోన్ టవరెక్కి తెలంగాణ కోసం డిసెంబర్ 1, తెల్లవారుజామున 2 గంటలకు తుపాకితో పోలీస్ కిష్టయ్య కాల్చుకోవడం బాధాకరం. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ తుపాకితో కాల్చుకుని కిష్టయ్య అమరుడైన నేల ఇది. ఇప్పుడదే నేలపై స్వరాష్ట్ర ప్రదాత అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీకి నిలబడటం చారిత్రాత్మకంగా మారబోతున్నది.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా)
– జూపల్లి రమేష్ రావు 94925 70992