బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రం. బడ్జెట్ అంటే ఓ భరోసా, బతుకుదెరువు. కానీ, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరోసారి అంకెలు రంకెలేసినయి. ఒక ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు మూలధన వ్యయం, అప్పుల వృద్ధి తీరును పరిగణిస్తారు. ఆ లెక్కలన్నీ ఒకటికి పది సార్లు చూశాక అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ పద్దుపై ప్రజా సమూహంలో చర్చించే క్రమంలో ఆర్థిక క్రమశిక్షణ, పాలనానుభవం, రాష్ట్ర భవిష్యత్తుపై ఓ విజన్ ప్రస్ఫుటమవుతుంది.
బడ్జెట్లో అందమైన అబద్ధాలతో అంకెలేసినా, మందబలంతో రంకెలేసినా కాగ్ లెక్కలు, అధికార గణాంకాలెవ్వరూ దాచి పెట్టలేరు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రోజురోజుకు ఏ విధంగా ఏమార్చుతున్నదో ఇటీవలి బడ్జెట్ స్వరూపం స్పష్టం చేస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణలో, జవాబుదారీతనంలో కేసీఆర్‌ను మించినవారెవ్వరూ లేరని భట్టి పద్దు రూడీ చేస్తున్నది. 2025-26 వార్షిక బడ్జెట్ రంగులతో మెరిపించడం తప్ప, జనాన్ని మాత్రం మురిపించలేదు. ఈసారి కేవలం 5 శాతంతో పెంచిన బడ్జెట్ చూస్తే దున్నపోతుకు పాలు పిండినట్టుంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క రెండోసారి ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల బడ్జెట్ నీటి బుడగ వంటిదే. ఆయన పద్దులో ఆదాయం అంతకంతకూ క్షీణిస్తున్నదని తెలియజేస్తున్నది.
తెలంగాణ సహజ సంపదను అమ్మేయాలనే స్పష్టమైన కుట్ర ఈ బడ్జెట్ ద్వారా తేటతెల్లమైంది. గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పారిశ్రామిక భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చి, ఇప్పుడేమో హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20 వేల కోట్ల అప్పు తెస్తమని నిండు అసెంబ్లీలో చెప్పడం విడ్డూరం. హెచ్ఎండబ్ల్యూఎస్, జీహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో రూ. 20 వేల కోట్ల అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌజింగ్‌బోర్డు భూముల అమ్మకం ఇప్పటికే షురూ అయింది. మొత్తంగా ఆస్తులు తాకట్టు పెట్టి, అమ్మి రూ.50 వేల కోట్ల డబ్బు సమీకరించే ప్రయత్నం చేస్తుండటం శోచనీయం.
శాఖల వారీగా ప్రతి చోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12 శాతం ఎక్కువగా చూపించి రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను మోసం చేశారు. సమగ్ర సర్వే పేరి ట బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభు త్వం, బడ్జెట్లో వారిని నిట్టనిలువునా మోసం చేసింది. గత బడ్జెట్లో రెవెన్యూ అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏ మాత్రం సంబంధం లేదని బడ్జెట్ నిరూపించింది.
ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందంటూనే బడ్జెట్‌ను భారీ అంచనాలు, కేటాయింపులతో మెరిపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగింది. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా అలాగే వ్యవహరించారు. పలు ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా, కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. శాఖలవారీగా ప్రతి చోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12 శాతం ఎక్కువగా చూపించి రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను మోసం చేసారు. సమగ్ర సర్వే పేరిట బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లోనూ వారిని నిట్టనిలువునా మోసం చేసింది.
గత బడ్జెట్లో రెవెన్యూ అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏ మాత్రం సంబంధం లేదని బడ్జెట్ నిరూపించింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రస్తావన బడ్జెట్లో లేదు. అంతేకాదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు కూడా 2025-26 బడ్జెట్లో చోటు దక్కకపోవడంపై తెలంగాణ సమాజం ఈసడించుకుంటున్నది.
ఇదిలా ఉంటే…రైతు రుణమాపీఫై రూ.31 వేల కోట్లు సమీకరించుకున్నామని చెప్పినా, బడ్జెట్లో మాత్రం రూ.20 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పేరు మార్చిన రైతు భరోసాకు కేటాయింపులను రూ.12 వేల కోట్లకు కుదించారు. వానకాలం ఎగనామం పెట్టారు. యా సంగికి రెండు ఎకరాలకే పరిమితం చేశారు. అదిపోను ఈ బడ్జెట్లోనూ కౌలు రైతుల ప్రస్తావన లేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రజల కష్టాల్లోంచి పుట్టిన పథకాలకు ఈ సారి పద్దులో దళితబంధు ప్రస్తావనే లేదు. కేసీఆర్ కిట్, న్యూ ట్రిషన్ కిట్, సీఎం బ్రేక్‌ఫాస్ట్‌పై బడ్జెట్ ప్రసం గం లో ఊసే లేదు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల సాగునీటి ప్రాజెక్టుల గురించి మాటే లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కాంగ్రెస్ ప్రభు త్వం చరమగీతం పాడింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పైశాచికానికి పరాకాష్ఠ.
సీఎం రేవంత్ అహం, అహంకారం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడింది. హైడ్రా, మూసీ విధ్వంసంతో నిర్మాణరంగాన్ని కుదేలు చేసిన సీఎం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థికమాంద్యం బూచి చూపెడుతుండటం విచారకరం. దేశంలో ఎక్కడా, ఏ రాష్ర్టానికీ లేని ఆర్థికమాంద్యం ఒక్క తెలంగాణకే వచ్చిందా? రేవంత్ పాలసీల వల్ల, రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం కుంటుపడిందనే విషయం వాస్తవం కాదా? అవగాహన లేమి వల్ల ఆర్థికవృద్ధి నేల చూపులు చూస్తుందనేది నిజం కాదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రాష్ట్రంలోని ప్రజలే సమాధానాలు చెప్తుండటం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది.
– (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి