నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయులందరికీ తప్పకుండా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొని వచ్చింది. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి, పట్టాలు పొంది, డీఎస్సీ పరీక్ష రాసి, ఎంపికై ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా రెండేండ్ల లోపు ఈ పరీక్షలో అర్హత సాధించాలి. కానీ, ఈ రూల్ తొలగించాలని కొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది.
టెట్ తప్పనిసరి నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఢిల్లీలో నిరసన తెలియజేసినా, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం కానరాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడానికి రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఇదే సమయంలో భాషాబోధకులకు సిలబస్ మార్చాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, తెలంగాణ (ఆర్‌యూపీపీటీ) ప్రతిపాదనను అధికారులు పరిశీలనలోకి తీసుకోకపోవడం విచారకరం.
తెలుగు, హిందీ తదితర భాషాబోధకులకు వారి అర్హతకు తగిన భాష, సాహిత్య సంబంధ విషయాలనే చదివి ఉద్యోగాల్లో చేరారు. అదే భాషను ఇప్పటివరకు వారు బోధిస్తూ వస్తున్నారు. కానీ టెట్‌లో 150 ప్రశ్నలకు, వారు బోధిస్తున్న విషయానికి సంబంధించి కేవలం 30 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. వారికి సంబంధం లేని సోషల్ స్టడీస్, గణితం, సైన్స్‌కు సంబంధించిన 60 ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది చాలా అన్యాయం. భాషలకే కాదు.. బయోలజీ ఉపాధ్యాయులు కూడా వారు ఏ స్థాయిలోనూ చదువని గణిత ప్రశ్నలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక తెలుగు మాతృభాషగా కలిగిన హిందీ ఉపాధ్యాయులకు హిందీతో బాటు ఇంగ్లిష్‌లో పరీక్షాపత్రం ఉండడం వలన ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వారు ఏండ్ల తరబడి బోధిస్తున్న విషయానికి సంబంధించిన పరీక్ష నిర్వహిస్తే అభ్యంతరమేమీ లేదు. కానీ వారికి సంబంధం లేని విషయాల్లో పరీక్ష నిర్వహించి అర్హత సాధించాలని అనడం మెడ మీద కత్తి వేలాడదీయడమే. దీనితోపాటు అర్హతా మార్కులు కూడా ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా ఉన్నాయి. చాలామంది ఓసీ ఉపాధ్యాయులు 80కి పైగా మార్కులు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏండ్ల తరబడి బోధిస్తున్న సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌తో టెట్ నిర్వహించాలి. అలా కానిపక్షంలో భాషా బోధకులకు సిలబస్‌లో మార్పు చేయాలి.
-గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
(వ్యాసకర్త: ఆర్‌యూపీపీటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)