తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారత చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) పోషించిన పాత్ర తిరుగులేనిది. 2001లో ఉద్యమాన్ని పునర్నిర్మించడం నుంచి 2014లో రాష్ర్టాన్ని సాధించడం వరకు, ఆయన ప్రయాణం నిరంతర పోరాటానికి, వ్యూహ చతురతకు నిదర్శనం.
తెలంగాణ ఉద్యమం నిస్తేజంగా ఉన్న సమయంలో, కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న టీడీపీ శాసనసభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షలకు ఒక బలమైన రాజకీయ వేదికను ఏర్పాటుచేసి, ఉద్యమానికి పునరుజ్జీవం కల్పించారు. ఆ సమయంలో చాలామంది ఆయన్ని ఒక్కడే ఉన్న పార్టీ అని ఎగతాళి చేశారు. కానీ, కేసీఆర్ నేను ఒక్కడినే కానీ ఒక్కడితో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారు అని సవాలు విసిరారు. అప్పటివరకు ప్రధాన రాజకీయపార్టీలు (కాంగ్రెస్, టీడీపీ) తెలంగాణ అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం వాడుకుంటూ, నిర్ణయాన్ని వాయిదా వేసేవి. టీఆర్ఎస్ స్థాపనతో, తెలంగాణ అంశం ఒక కేంద్రీకృత రాజకీయ అజెండాగా మారింది.
ఇతర పార్టీలకు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన ఒత్తిడి పెరిగింది. తెలంగాణ అంశం ఎప్పుడూ రాజకీయంగా సజీవంగా ఉండేలా కేసీఆర్ అవసరాన్ని బట్టి వివిధ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయపార్టీలతో అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకొని, వారి మేనిఫెస్టోలలో తెలంగాణ అంశాన్ని చేర్పించేలా కృషిచేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి పదే పదే రాజీనామాలు చేసి, తెలంగాణ ఎన్నికలను తరచుగా చర్చనీయాంశం చేస్తూ, ఉద్యమం చల్లార్చకుండా చూశారు.
2004, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఉమ్మడి కనీస కార్యక్రమంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చడానికి కేసీఆర్ కృషిచేశారు. ఇది తెలంగాణ ఉద్యమానికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేస్తామని సోనియా గాంధీ అప్పుడు హామీ ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ 26 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లు గెలిచింది. కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. అయితే తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ మోసం చేయడంతో కేంద్ర మంత్రిగా ఉంటూనే కేసీఆ ర్ తాను మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేశారు. తెలంగాణ సమస్యను ఈ చర్య జాతీయస్థాయిలో మరింత హైలైట్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్ 2006లో మంత్రి పదవికి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణం పైన దృష్టిపెట్టారు. తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగా మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.
తెలంగాణ వచ్చేవరకు దీక్ష విరమించను అని ప్రకటించి 2009 లో నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ‘దీక్షా దివస్’ తెలంగాణ ఉద్యమానికి అత్యంత కీలకమైన మలు పు. ఉద్యమాన్ని ఈ దీక్ష జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ దీక్ష ఫలితంగానే కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు చారిత్రక ప్రకటన చేశారు.
డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు పెరగడంతో, కేంద్రం డిసెంబర్ 23, 2009న ప్రకటనను ఉపసంహరించుకున్నది. 2010, ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. 2009 ప్రకటన వెనక్కి తీసుకోవడంతో తెలంగాణలో ఆందోళన మళ్లీ మంటలు రేకెత్తించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిరసనగా, తెలంగాణ డిమాండ్‌ను మరింత బలంగా వినిపించేందుకు కేసీఆర్ నాన్-కోఆపరేషన్ మూవ్మెంట్, సకల జనుల సమ్మె (2011), రైలు రోకో, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ఆందోళన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించారు. సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24, 2011 వరకు (42 రోజులు) సకలజనుల సమ్మె జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేశారు. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా సాగిన సమ్మె అప్పటివరకు లేదు. ఇది తెలంగాణ ప్రజాబలాన్ని, కేసీఆర్ నాయకత్వ పట్టుదలను దేశానికి చాటిచెప్పింది.
కేసీఆర్ ఉద్యమాన్ని రాజకీయ వేదికలకే పరిమితం చేయకుండా, ప్రజలందరినీ భాగస్వాములను చేశారు. కవులు, కళాకారులతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించడం, తెలంగాణ యాస, భాష, చరిత్ర, సంస్కృతిని ఉద్యమంలో భాగం చేయడం. తెలంగాణ ఉద్యమానికి కేవలం రాజకీయమే కాకుండా, సాంస్కృతిక, భావోద్వేగ (సెంటిమెంట్) బలాన్ని అందించింది. ముఖ్యంగా యువత, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఉద్యమాన్ని తమదిగా భావించడానికి ఇది దోహదపడింది. ఓవైపు క్షేత్రస్థాయిలో ఉద్యమంతో పాటు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేవరకు కేసీఆర్ ఢిల్లీలో నిరంతరం లాబీయింగ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం, వివిధ పార్టీల అడ్డంకులు, పార్లమెంటులో ఘర్షణలను ఆయన వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చి, చివరకు 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కేవలం నాయకత్వం వహించడమే కాకుండా, దానికి ఒక స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం చేశారు. తన రాజీనామాలు, దీక్షలు, వ్యూహాత్మక పొత్తులు, సాంస్కృతిక చైతన్యం ద్వారా, ఆయన తెలంగాణ కలను సాకారం చేసి, తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే, తెలంగాణ చరిత్రలో ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ స్థానం సుస్థిరం.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్