నా ప్రాంతం, నా ప్రజలు అన్న విశాల స్వార్థంతో పనిచేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఉద్యమం చేసి, కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేసిన నాయకుడికి అది మరింత బలంగా ఉంటుంది. లక్ష్య సాధనకు ఏ మాత్రం ఆటంకం కలిగినా ఆ నాయకుడు సహించలేడు, భరించలేడు. అది ప్రజలకు తగిలిన దెబ్బ కాదు, తనకు తాకిన దెబ్బ అని భావించి ప్రతిఘటిస్తాడు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి రాష్ర్టాన్ని తెచ్చిండు గనుక.. ప్రజలు, ప్రాంతం తనవాళ్లు అని భావిస్తాడు గనుక… రాష్ట్ర ప్రగతే తన కర్తవ్యమని భావించాడు గనుక. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలకు వత్తాసుగా నిలిస్తే ‘నీకేం పని, ఇదేమైనా నీ జాగీరా?’ అంటున్నారు. అవును బరాబర్ తెలంగాణ ఆయన జాగీరే.
అవును తెలంగాణ, మట్టిని ముద్దాడినోళ్ల జాగీరే. యాసను, భాషను గౌరవించినోళ్ల జాగీరే. రాష్ట్ర సాధనకు ఉద్యమం చేసినోళ్ల జాగీరే. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం కొట్లాడిన రాజకీయ పార్టీ జాగీరే. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి జీవి, జీవరాసి జాగీరే. ఇక్కడి మట్టిలో కలిసిపోయే కోట్లాది తెలంగాణ ప్రజల జాగీరే. అట్లాంటి గడ్డమీద పరాయివాడు పెత్తనం చేస్తమం టే.. బరాబర్ బరిగీసి కొట్లాడుతాం. మా బతుకులు ఆగం చేస్తమంటే మరో పోరాటానికి సిద్ధమవుతం. బూటకపు ఎన్కౌంటర్ల పేరిట పాలకులు తెలంగాణలో రక్తపుటేరులను పారించిన్రు. మా నీళ్లను, మా నిధులను, మా నియామకాలను దోచుకుపోయి.. మా మాటను, మా పాటను తక్కువచేసి చూస్తే, ఈ భూమిని ఏడారి చేస్తేనే కదా.. తెలంగాణ తల్లి కడుపులో కేసీఆర్ పుట్టిండు. అందుకే కదా వలస పాలనపై ఆయన తిరుగుబాటు జెండా ఎత్తిండు. ఆంధ్రా పార్టీలను తెలంగాణ సరిహద్దులు దాటించి తరిమి తరిమి కొట్టిండు.
అనుకున్నవి జరుగకపోగా, పరిస్థితులు దిగజారినప్పుడే కదా ‘అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లయింది’ అని అనుకుంటం. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం. మరి ఆ నీళ్ల వినియోగం సక్రమంగా లేకుంటే మనసుకు బాధ కలుగదా? అట్లెట్లా తీసుకుపోతరని అడుగమా? ఈ క్రమంలో ఇలాంటి విఘాతం కలిగిందనే కదా బీఆర్ఎస్ ఆక్రోశం? అందుకే కదా? ఊరిలో పడే వర్షపు నీరంతా వాగులో కలవకూడదని, వాగు నీరంతా నదిలో చేరకూడదని, ప్రతి గ్రామంలోనూ చెరువులు, కుంటలు ఉండాలని, అవి నిండిన తర్వాత మరో చెరువులో నీళ్లు కలవాలని మిషన్ కాకతీయ పేర గొలుసుకట్టు వ్యవస్థను కేసీఆర్ తీర్చిదిద్ది న్రు. అలాంటి బృహత్తరమైన పథకాన్ని ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోకుండా వర్షం నీరును నదిలో వదిలేస్తున్నారు. వరద నీరంటూ, వృథా నీళ్లంటూ కొత్త పేర్లు పెడుతున్నారు. రాష్ట్ర ఏలికల అలసత్వాన్ని ఆసరాచేసుకొని కింది రాష్ర్టాలవారు కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మన అవసరాలు తీరాక, ఇక నిల్వ సామర్థ్యం లేదని నిర్ధారించుకొని కిందికి వదిలేస్తేనే అవి వృథా జలాలు అవుతాయి. లేకుంటే చేతకాక వదిలేసిన నీళ్లవుతాయి.
తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం ప్రాజెక్టులు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదు. ఎత్తిపోతల పథకాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకు, భారీ పెట్టుబడులే కాదు, అధిక విద్యుత్తు కూడా అవసరం పడుతుంది. తగిన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం ఇంకో పెద్ద పని. అన్నింటిని సమన్వయపరుచుకుంటూ ముందుకువెళ్తే తప్ప ప్రాజెక్టులు నిర్మించ డం సాధ్యం కాదు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమైంది. ‘నీరు పల్లమెరుగు-నిజం దేవుడెరుగు’ అన్నది సామెత. దానిని ఉల్టా చేసి ‘నీరు ఎగువకు పారు’ అని నిరూపించిందీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ప్రదాతపై విమర్శలు చేయడం ఏ మేరకు సబబు?
తెలంగాణ పొలాలకు నీరందించడం ఖర్చుతో కూడుకున్న పని. బోరు బావుల కోసం రైతులు ఎంత అప్పు జేసిన్రో, దాన్ని తీర్చలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నరో మన కండ్లముందు కదులుతున్న దృశ్యమే. అవన్నీ చరిత్రలో కలిసిపోవాలని నిస్వార్థంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడమే కేసీఆర్ చేసిన తప్పా? ఆ ప్రాజెక్టు నిర్మి స్తేనే వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది. విదేశాలకు బియ్యం ఎగుమతి చేయగలుగుతున్నది. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వగలుగుతున్నది. దీంట్లో కేసీఆర్ వ్యక్తిగత స్వార్థం ఇసుమంతైనా కనపడుతున్నదా? పని చేసినవారిని మాటలంటే ప్రజలకు బాధ కలగదా?
ప్రజలను బాధిస్తున్న మరో అంశం ఏమంటే హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడటం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి పదేండ్లలో రాజధానిలో ఎక్కడా మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలుగలేదు. ఉపాధి, వివిధ వర్గాల అస్తిత్వం విషయాల్లో ఎక్కడా ప్రతికూల ఎదురవలేదు. కానీ, ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రం గం మందగించింది. దాని ప్రభావం రాష్ట్రం మొత్తం పై పడింది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ‘అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగా ణ’ అన్న మాట వినిపిస్తున్నది.
ఈ సందర్భంగానే ఉద్యమం నాటి పరిస్థితులు మళ్లీ తెలంగాణ ప్రజలకు గుర్తుకువస్తున్నాయి. నాడు తెలంగాణ సమాజం ఎదుర్కొన్న కష్టనష్టాలు, వాటి పరిష్కారానికి కేసీఆర్ చేసిన ఉద్యమ ప్రస్థానాన్ని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ప్రతి సమస్యను వ్యక్తి గత సమస్యగానే భావించారు. కాబట్టే పరిష్కరించా రు. అందుకే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఏ లోపం జరిగినా ఆయన బాధపడుతున్నారు, నిలదీస్తున్నారు. తెలంగాణ నాది అనుకునే హక్కు, అధికారం ఒక్క కేసీఆర్‌కే ఉన్నది. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు లోబడి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేసీఆర్‌పై ఓ వర్గం మీడియా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నది. ప్రభుత్వాన్ని నిలదీస్తే అందుకు సమాధానం చెప్పడమో, లేదంటే ప్రతివిమర్శనో చేయాలి. అంతేకానీ మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగనప్పుడు తాము నష్టపోయామని ప్రజలు భావించడం సహజం. ఆ కోణంలో చూస్తే.. ‘తెలంగాణ మా జాగీర్, దానికి నష్టం కలుగజేస్తే ఖబర్దార్’ అంటూ పోరాటాలకు దిగడం ఖాయం.