మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాన్ని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎత్తిపోయమంటే ప్రభుత్వం మొండికి పోతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోకి, అక్కడి నుంచి ఎల్లంపల్లి జలాశయానికి సురక్షితంగా గోదావరి జలాలను ఎత్తిపోసే మార్గాన్ని సూచించినందుకు విశేష అనుభవమున్న, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విశ్రాంత ఇంజినీర్ల సంఘాన్ని కిరాయి సంఘం అని, సంఘం సభ్యులు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి దుర్భాషలకు దిగడం శోచనీయం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఉద్యమం చేసి, ఉద్యోగ విరమణ తర్వాత కూడా అవిశ్రాంత సేవలు అందించిన వారిని కించపరుస్తూ మాట్లాడడం భావ్యమా? కరువు ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఉంటే ప్రజల ముందు పెట్టాలి. నీటిని ఎత్తిపోసే ప్రసక్తే లేదంటున్న ప్రభుత్వ వాదనను ప్రజలు తిరస్కరిస్తున్నారు.
కన్నెపల్లి వద్ద నీటిమట్టం 95.40 మీటర్లకు దిగిపోయింది. సమ్మక్క వద్ద 30,200 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఈ రకంగా ఉంటే, ఎగువన శ్రీరామ్‌సాగర్, సింగూరు, నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కుమ్రం భీం లాంటి మీడియం ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాల జాడ లేదు. కుడి వైపున ఉన్న పట్టికలోని సమాచారాన్ని బట్టి రాష్ట్రంలో దిగువ గోదావరిలో మేడిగడ్డ, సమ్మక్క బరాజ్‌ల వద్ద తప్ప మరెక్కడా నీటి జాడ లేదని తెలుస్తున్నది. అక్కడ కూడా రోజురోజుకూ ప్రవాహాలు పడిపోతున్నాయన్న సంగతి అర్థమవుతూనే ఉన్నది. మేడిగడ్డ వద్ద తగ్గుదల కొనసాగితే ఇక అక్కడ నుంచి కూడా నీటిని ఎత్తిపోసుకోలేం. ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి కిందకి పోయిన నీరు సుమారు 80 టీఎంసీలు. పది రోజుల కింద కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే ఎల్లంపల్లికి 25 నుంచి 30 టీఎంసీల నీరు చేరి ఉండేది.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, 25 శాతం లోటు వర్షపాతం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. హనుమకొండలో 59 %, మేడ్చల్‌లో 50%, నిజామాబాద్ లో 37 %, వికారాబాద్ లో 33 % తీవ్ర లోటు నమోదు అయ్యింది. రాష్ట్రంలో జలాశయాలు, చెరువులు కూడా 80 % ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ప్రస్తుతం బలహీనమైన రుతుపవన పరిస్థితులతో సాపేక్షంగా పొడి దశను ఎదుర్కొంటున్నది. జూలై, ఆగస్టులో సాధారణం కంటే తక్కువ నుంచి సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. కాబట్టి జలాశయాలు, చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరే పరిస్థితి ఉండదు.
తెలంగాణ ఇంకా ఎల్ నినో ప్రభావంలో ఉన్నది. ఫలితంగా అస్తవ్యస్తమైన వర్షపాతం, అడపాదడప పొడి వాతావరణం, రుతుపవనాల పురోగతిలో జాప్యం కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే గణనీయమైన గోదావరి నీటి ప్రవాహాలు పూర్తిగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి ఎగువ రాష్ర్టాల్లో కురిసే స్థిరమైన, విస్తృతమైన వర్షపాతంపై ఆధారపడి ఉంటాయని స్పష్టంచేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో దిగువ గోదావరిలో ఇప్పుడున్న ప్రవాహాలను వదిలేయడం మూర్ఖత్వం అవుతుంది. ఈ నేపథ్యంలో మూడు రకాలైన పరిస్థితులను విశ్లేషిద్దాం. ఒకటి.. జూలై, ఆగస్టులో భారీ వర్షాలు కురిసి ఎగువన శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, నిజాంసాగర్, మిడ్ మానేరు, కుమ్రం భీం లాంటి మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరి జలాశయాలు నిండితే ఎల్ నినో కరువు, తాగునీటి, కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడుతుంది.
రెండవది.. భారీ వరదలు రాలేదు కానీ కొద్దిపాటి వర్షం కురిసి జలాశయాల్లో కొద్దిపాటి నిల్వలు పెరిగితే రాష్ర్టానికి కొద్ది మేర తాగునీటి సమస్య తీరవచ్చు. కానీ ఎండాకాలంలో తాగునీరు, కరెంటు సంక్షోభం తప్పదు. ఇక మూడవ స్థితి.. వాతావరణ శాఖ అంచనా వేసినట్టు భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు కూడా పడకపోతే జలాశయాలు, చెరువులు, కుంటలు నిండవు. అప్పుడు రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి నెలకొంటుంది. తాగునీటి సమస్యలు తప్పవు. హైడల్ పవర్ ఉత్పత్తి ఉండదు. థర్మల్ పవర్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి కుంటుపడుతుంది. రాష్ట్రం కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరెంటు, నీరు లేక పరిశ్రమలు మూతపడితే పారిశ్రామిక సంక్షోభం కూడా తలెత్తవచ్చు.
ఎక్కడా నీటి జాడలు లేని ఈ తరుణంలో కన్నెపల్లి వద్ద ఉన్న నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం ఎందుకు మొండికి పోతున్నది? వానకాలం ఇంకా రెండున్నర నెలలు ఉన్నదని, వానలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుతాయని ఆశ పడుతున్నారా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇదే ఆభిప్రాయాన్ని నాతో పంచుకొన్నాడు. ‘నీటిని ఎత్తిపోసిన తర్వాత వానలు కురిస్తే ఎత్తిపోతలు వృథా అవుతాయి కదా’ అన్నాడు. ఎత్తిపోసిన నీళ్లను అక్కడే ఉంచము కదా. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, అక్కడ నుంచి లోయర్ మానేరుకు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ జలాశయాలకు, కాకతీయ కాలువ ద్వారా కాలువల్లోకి వదులుతాం. వానలు కురిసి వరదలు వచ్చినా ఆ నీరు ఎగువన ఉన్న జలాశయాలకు చేరిపోతుంది. కాబట్టి వృథా అయ్యే ప్రసక్తి రాదు.
బాధ్యతాయుత ప్రభుత్వం ఇప్పుడున్న ఎల్ నినో ప్రభావాన్ని, వాతావరణశాఖ భవిష్యత్తు అంచనాలను దృష్టిలో పెట్టుకొని మూడవ స్థితిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి తప్ప, వానలు పడి వరదలు వస్తాయని ఎదురు చూడదు. కన్నెపల్లి పంపులు, దేవాదుల పంపులు పూర్తి స్థాయిలో ఆన్ చేయడానికి సిద్ధం కాకపొతే మూడవ స్థితిని ఎదుర్కోవడం దుర్లభం అని చెప్పక తప్పదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని దిగువకు వదులుతున్న గోదావరి జలాలను కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తున్నది. డెల్టాల ఆయకట్టు రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. మరి మన రాష్ట్ర రైతులు ఏం పాపం చేశారు? కరువును ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్లాన్ ఏమిటి? ప్రజలకు వెల్లడించాలి.
కవి, గాయకుడు, అమరుడు సదాశివుడు రాసినట్టుగా ‘తలాపున పారుతుంది గోదారి-మన చేను, మన చెలక ఎడారి’ పాటను ఉద్యమంలో పాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనూ మళ్లీ ఆ పాట పాడుకొనే అగత్యం ఏర్పడింది. ఎల్ నినో విపత్తు పొంచి ఉండగా, నీటి గోస తీర్చాలని, గోదావరి జలాలను ఎత్తిపోయాలని విపక్ష బీఆర్ఎస్ నేతలు, ఇంజినీర్లు కోరితే, పాలక పెద్దలు దుర్భాషలు ఆడటం మరో విపత్తు.
గోదావరిలో ఇటీవలి నీటి ప్రవాహాలు

– (వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ)