హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ (నిథమ్) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ వేదుల్ల వెంకటరమణ నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిథమ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వం ఏకపక్షంగా నియామకం జరిపిందని తేల్చిన హైకోర్టు, 2025 జూలై 15న జారీచేసిన జీవో 206ను కొట్టివేసింది. జస్టిస్ రేణుక యారా ఈ మేరకు తీర్పు వెలువరించారు. నిథమ్ డైరెక్టర్‌గా నియమితులు కావడానికి అవసరమైన అర్హతలు, అనుభవం, అభ్యర్థి ఎంపిక, నియామకం చేపట్టడం, ఉద్యోగకాలం, సేవా నిబంధనలు ఖరారు చేయడం వంటి అధికారాలన్నీ గవర్నింగ్ కౌన్సిల్‌కే ఉంటాయని నిథమ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ స్పష్టంగా పేరొంటున్నది.
అయినప్పటికీ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా పకనపెట్టి స్వయంగా అభ్యర్థిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీచేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. డైరెక్టర్ నియామకం కోసం గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఎలాంటి వినతి, సిఫార్సు లేదా అర్హతల నిర్ణయం జరిగినట్టు రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకటరమణను మూడేండ్ల డిప్యుటేషన్‌పై నిథమ్ డైరెక్టర్‌గా నియమించాలని ముందుగానే నిర్ణయించిన ప్రభుత్వం, ఆయనకు అసాధారణ సెలవు మంజూరు చేయాలని యూనివర్సిటీకి లేఖ రాయడం కూడా చట్టబద్ధమైన విధానానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.
ప్రభుత్వం జూలై 15న నియామక ఉత్తర్వులు జారీచేసిన అనంతరం, జూలై 28న జరిగిన 66వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆ నియామకా న్ని రాటిఫై చేసినా, ముందుగా చట్టవిరుద్ధంగా జరిగిన చర్యకు తర్వాత ఇచ్చిన ఆమోదం ద్వారా చట్టబద్ధత రాదని హైకోర్టు స్పష్టంచేసింది. నిథమ్ నిబంధనల్లో ఇలాంటి రాటిఫికేషన్‌కు అవకాశం లేదని, డైరెక్టర్‌ను నియమించాల్సింది గవర్నింగ్ కౌన్సిల్ మాత్రమేనని తేల్చిచెప్పింది. జీవో 206ను రద్దు చేస్తూ వెంకటరమణ నియామకాన్ని కొట్టివేసింది.