నేరేడుచర్ల, జూలై 30: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ ఉపాధి పథకం కింద పని చేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం వారానికోసారి కూలీల ఖాతాల్లో డబ్బు జమ కావాల్సి ఉన్నప్పటికీ, నెలలు గడుస్తున్నా జమ కాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వీబీజీ రామ్‌జీ పథకంలో పని చేస్తున్న కూలీలకు గత రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం జాబ్ కార్డు కలిగిన వారు 2,49,422 మంది ఉండగా వీరిలో 5,22,266 మంది కూలీలు ఉన్నారు. మొత్తం 2,49,358 మంది కూలీలు యాక్టివ్ లేబర్‌గా పని చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 3,52,572 జాబ్ కార్డులు ఉండగా 7,32,797 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 3,52,771 మంది కూలీలు యాక్టివ్ లేబర్‌గా పని చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,44,346 మం దికి జాబ్ కార్డులు ఉండగా 2,64,400 మంది కూలీలు ఉన్నారు. యాక్టివ్ లేబర్‌గా1,44,297 మంది ఉన్నా రు. ఈ పథకం కింద రోజువారీ కూలీగా పని చేస్తూ వచ్చిన వేతనంతో జీవనం సాగించే అనేక కుటుంబాలు వేతనాల కోసం ఎదురు చూస్తున్నాయి. డబ్బు జమ కాకపోవడంతో గ్రామాల్లోని క్షేత్ర సహాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 15 వేల మంది వీబీజీ రామ్‌జీ ఉపాధి పథకం కింద కూలీలుగా పని చేస్తున్నారు. ఒక్కో కూలీకి సుమారు రూ. 300 వేతనం చెల్లించినా రోజుకు రూ. 45లక్షలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్లుకు పైగా పెం డింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కూలీల కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. మరి కొంత మంది ఇతర పనులకు వెళ్లి పొట్టనింపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి పెండింగ్ వేతనాలను వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేయాలని పలు గ్రామాల కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.