పదేండ్ల మోదీ పాలనలో దేశం 30 ఏండ్లు వెనక్కి వెళ్లింది. దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. జీడీపీ 8 శాతానికి పెరిగిందని గొప్పలు చెప్పుకొంటున్న మోదీ అందుకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు ఎందుకు పెరగడం లేదో సమాధానం చెప్పాలి. దేశ జనాభాలో యువత 83 శాతం ఉన్నారు. అధికారంలోకి రాకముందు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ… కనీసం కేంద్రప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టుల్ని అయినా భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండటానికి ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. గత పదేండ్లలో మూడున్నర లక్షల ఉద్యోగాల్ని ప్రభుత్వరంగ సంస్థల్లో రద్దు చేశారు. ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగుల శాతం 88కి పెరిగింది.
మరోవైపు సామాన్యులు పొదుపు చేయలేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. 40 శాతం సంపద దేశంలోని ఒక శాతం జనాభా దగ్గరే కేంద్రీకృతమైంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలా సంపద ఒక దగ్గర పోగుపడటం ఏ మాత్రం మంచిది కాదు. భారత్‌ను ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా బీజేపీ నేతలు అభివర్ణిస్తారు. కానీ, గత పదేండ్లుగా దేశంలో పేదరికం తాండవిస్తున్నది. దేశంలోని అత్యంత ధనవంతులైన 0.4 మందిపై సంపద పన్ను వేస్తే.. సుమారు రూ.8 లక్షల కోట్లు సమకూరుతాయి. కానీ, ఆ పని చేయకుండా అదానీ లాంటి వారికి లబ్ధి చేకూర్చేలా ప్రధాని వ్యవహరిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలపై కేంద్రప్రభుత్వం అత్యధికంగా పన్నుల భారం వేస్తున్నది. సంపన్నులు, కార్పొరేట్ కంపెనీలకు టాక్స్ రిబేట్లు ఇస్తూ సామాన్యులపై మాత్రం పరోక్షంగా పన్నులు బాదుతున్నారు.
2014లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.410 ఉండగా.. 2024 నాటికి అది 120 శాతం పెరిగి సుమారు రూ.900కు చేరింది. అలాగే పెట్రోల్ 37 శాతం, డీజిల్ 64 శాతం, వంటనూనె 60 శాతం, పాల ధరలు 71 శాతం పెరిగాయి. ఇలా పదేండ్లలో అన్ని ధరలు 50 శాతం కంటే ఎక్కువగానే పెరిగాయి. ఈ ధరల్ని భరించలేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఎన్డీయే పాలనలో సుమారు ఏడు కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు చేరుకున్నారు.
మరోవైపు ఈ ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు 48 శాతం పెరిగాయి. 2011లో చేయాల్సిన జనగణన పూర్తి చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదలకు దక్కాల్సిన ప్రయోజనాల్ని తొక్కిపెడుతున్నారు. ఈ దశాబ్ద కాలంలో ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకుగా మార్చారు. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్‌లో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి, అక్రమ మార్గంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
తమకు మద్దతివ్వని, తమ పార్టీలో చేరని ఎమ్మెల్యేలు, ఎంపీలపై సీబీఐ, ఈడీ దాడులు చేయించి, బెదిరించి మరీ బీజేపీలో చేరేలా ఒత్తిడి తెస్తున్నారు. 2014 తర్వాత ప్రతిపక్ష నేతలపై ఈడీ కేసుల శాతం ఎకాఎకీన 95 శాతం పెరగటమే అందుకు నిదర్శనం. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని కాలరాసేలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని, జాతీయ అభివృద్ధి మండలిని రద్దు చేసింది. రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకుండా, రాష్ర్టాలతో చర్చించకుండా నిధుల పంపిణీని చేపడుతున్నది. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తప్పించుకోవటానికి అడ్డదారిలో సెస్సు, సర్‌చార్జ్‌లు విధిస్తున్నది. కాంగ్రెస్ పదేండ్ల పాలనతో పోలిస్తే మోదీ ప్రభుత్వంలో ఇలాంటి వాటి శాతం 15కు పెరిగింది. జీఎస్టీని ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాలకున్న స్వేచ్ఛను హరించింది. రాష్ట్రంలో విధించిన వస్తు సేవల పన్నును కేంద్రం నుంచి ఆడుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ బీజేపీ పాలిత రాష్ర్టాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారు.
ఎన్నికల్లో డబులు ఇంజిన్ సర్కారు పేరిట ఓటర్లను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీర్ఘకాల ప్రయోజనాల కోసం ‘ఓకే దేశం- ఒకే ఎన్నిక’ పేరిట సమాఖ్య స్ఫూర్తిని హరించేలా ఎత్తుగడలు వేస్తున్నారు. మతం పేరుతో ఓట్లు దండుకోవటానికి అలవాటు పడిన భారతీయ జనతా పార్టీ 2026లో జనగణన నిర్వహించి, ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేసి తమకు అనుకూలమైన రాష్ర్టాల్లో సీట్లు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఒకవేళ ఇదే గనుక జరిగితే దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయి. హిందూత్వ పేరిట కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో వచ్చే సీట్లతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తున్నది. ఇదే జరిగితే దక్షిణాదితోపాటు ఈశాన్య రాష్ర్టాలకు పార్లమెంటులో ఎలాంటి ప్రాధాన్యం ఉండదు.
ఇప్పటికే ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ చేసిన నిర్వాకం తెలిసిందే. కార్పొరేట్ సంస్థల్ని బెదిరించి వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని ఆ పార్టీ ఎన్నికల్లో ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నది. చివరకు రాజ్యాంగాన్ని మార్చే లక్ష్యాన్ని బయటకు తీస్తున్నది. చరిత్రను మార్చటానికి ప్రయత్నిస్తున్న బీజేపీ దేశంలోని విద్యావ్యవస్థను కాషాయీకరణ చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నది తప్ప, దేశం కోసం కాదనేది వాస్తవం.
– (వ్యాసకర్త: బీఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్)
డాక్టర్ బండారు నరేందర్‌రావు