మన దేశంలో సామాజికవర్గం (కులం) అనేది వ్యక్తిగత గుర్తింపే కాదు, దానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన అంశాలు దానితోనే ముడిపడి ఉంటాయి. ప్రజల దైనందిన జీవితాల్లో సామాజిక వర్గానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నప్పటికీ, కులగణన పేరిట సర్వే జరుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘విశ్వకర్మ’ సామాజిక వర్గాన్ని విస్మరించటం అత్యంత ఖండనీయం.
కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సర్వే కుల గణనకు మాత్రమే సంబంధించినదా? లేక వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికా? అనే విషయం అంతుచిక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. పైకి మాత్రం ‘కులగణన’ సర్వే అని చెప్తూనే పౌరుల వ్యక్తిగత వివరాలను కూడా సేకరిస్తున్నది. అయితే, రాజకీయ నేపథ్యాల గురించి కూడా ఆరా తీస్తుం డటం విడ్డూరం. సర్వే కోసం సర్కార్ రూపొందించిన దరఖాస్తు తప్పులతడకగా ఉన్నది. కులం అనే శీర్షిక కింద రాష్ట్రంలోని అన్ని కులాలను ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ కులాన్ని మాత్రం విస్మరించడం శోచనీయం.
విశ్వబ్రాహ్మణ అనేది అనాదిగా వస్తున్న సామాజికవర్గం. ఇందులో పంచదాయిగా పిలిచే ఐదు వృత్తులవారుంటారు. ఆయా వర్గాల వారికి ప్రభుత్వం ‘విశ్మబాహ్మణ’ పేరిటనే కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నది. వడ్రంగి, కమ్మరి, కంసాలి, కంచరి, శిల్పి వృత్తుల వారు విశ్వబ్రాహ్మణులుగా గుర్తింపు పొందారు. అయితే, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి బదులుగా ఆయా వృత్తులనే కులాలుగా పేర్కొన్నది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే వృత్తులు వేరే అయినప్పటికీ వారంతా ఒక్క సామాజికవర్గానికి చెందిన వారే. ప్రస్తుతం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల కుల అస్తిత్వమే దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నది. వృత్తులను కులాలుగా పేర్కొంటూ ఇప్పటివరకు ఏ కులంలోనూ విభజన జరగలేదు. విశ్వబ్రాహ్మణ కులాన్ని మాత్రమే సర్వే నుంచి తొలగించడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది.
విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి అనేక విశిష్ఠతలున్నాయి. ఈ సామాజికవర్గం వారు ప్రధానంగా సనాతన సంప్రదాయాలను పాటిస్తారు. అర్చకత్వం కూడా ఈ కులంలో ఉన్నది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, అమరుడు శ్రీకాంతాచారి, ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన మారోజు వీరన్న తదితర విశ్వబ్రాహ్మణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతగానో పాటుపడ్డారు. అందుకే, తెలంగాణలో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషిచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సర్వే పేరిట విశ్వబ్రాహ్మణ సామాజికవర్గంపై కుట్రలు చేస్తున్నది. ఐదు సామాజిక వర్గాలుగా విభజించాలనే కుటిల యత్నాలు చేస్తున్నది.
మన దేశంలో సామాజికవర్గమే అన్నింటికీ ప్రాతిపదిక. జాతీయ బీసీ కమిషన్ కూడా విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ (ఐదు కులవృత్తుల వారు) వర్గాలను ఒక్క సామాజికవర్గంగా పరిగణిస్తున్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు కులాలుగా విభజించవలసిన అగత్యం ఎందుకు ఏర్పడిందో అర్థం కావడం లేదు. వృత్తులను కులాలుగా పరిగణించడం సరికాదు. రాష్ట్రంలో అన్ని కులాల వారూ వడ్రంగి, కమ్మరి, శిల్పి, స్వర్ణకార వృత్తులను చేపడుతున్నారు. ఇతర రాష్ర్టాల వారు సైతం ఇక్కడికి వచ్చి ఆయా వృత్తులనే జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. అంత మాత్రాన వారిని ఆయా సామాజికవర్గానికి చెందినవారుగా గుర్తిస్తారా? అంతెందుకు, విశ్వకర్మ సామాజికవర్గానికి చెందిన ఒక కుటుంబంలో తండ్రి ఒక వృత్తి ఎంచుకుంటే, ఆయన వారసులు మరో వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. మరి వారిని ఏ సామాజిక వర్గానికి చెందినవారుగా పరిగణిస్తారు?
ఈ ఐదు వృత్తుల వారి మధ్య ఎప్పటినుంచో బంధుత్వాలు కొనసాగుతున్నాయి. వీరికి గోత్రమే ప్రధానమైనది. వాటన్నింటికీ మూలం విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం. చరిత్ర తెలియకుండా వారి మూలాలను చెరిపివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం హేయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తు ప్రతి లో జరిగిన తప్పులను సవరించాలి. విశ్వబ్రాహ్మణ సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ కమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి, శిల్పి వృత్తులను పేర్కొ నాలి. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా విశ్వకర్మ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి ఆ సామాజికవర్గానికి చెందినవారినే చైర్మన్, సభ్యులుగా నియమించాలి. లేకుంటే విశ్వబ్రాహ్మణ జాతికి తీరని అన్యాయం చేసినవారవుతారు. అందులో ముద్దా యి ఎవరా అని పరికించి చూస్తే మొదటి వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంతే కనపడతారు.
– రమేష్ జైనోజు (రామ్ జే), 6301421706
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త, విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్)