కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయం చేసింది. అసెంబ్లీలో చర్చ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వంటి పరిస్థితుల నేపథ్యంలో నిజాలను ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నేను, నా బృంద సభ్యులు రాము, పురుషోత్తం యాదవ్, అఖిల్‌రెడ్డి, విశ్వా, పవన్ గౌడ్లతో కలిసి ఆగస్టు 28, 29, 30వ తేదీల్లో కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి ప్రారంభమై, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ప్రాజెక్టు మొత్తాన్ని పర్యటించాం. ఈ టూర్లో ప్రతీ బ్యారేజీ, రిజర్వాయర్, పంప్‌హౌస్, కాలువను ప్రత్యక్షంగా అణువణువూ చూశాం.
ఈ పర్యటనలో మా కండ్లముందు కనిపించిన కాళేశ్వరం, దాని ఫలాలు పొందుతున్న ప్రజలు కాంగ్రెస్ విష ప్రచారాన్ని పటాపంచలు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని కాంగ్రెస్ వాదిస్తున్నది. కానీ, గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత సహజంగా రెండు నదులు కలిసి నీళ్లు పెరుగుతాయి. దీనికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు, కామన్సెన్స్ ఉంటే చాలు. మేడిగడ్డ వద్ద 281 టీఎంసీల నీటి లభ్యత ఉండటం వల్ల అక్కడి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో 85 పిల్లర్లలో 2 పిల్లర్లు పాక్షికంగా కుంగితే మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ, ఆ సమస్య తలెత్తినప్పటి నుంచి గోదావరి ఉధృతంగా ప్రవహించినా నేటికీ బ్యారేజీ చెక్కుచెదరలేదు. మేం పర్యటించే సమయంలో సుమారు 100 టీఎంసీలకు సమానమైన నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడే ఉంది.
ఒక్క ఎకరాకు కూడా కాళేశ్వరం నీళ్లు రాలేదని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. మరి సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది? మేం పర్యటించే సమయానికి రంగనాయక సాగర్‌లో 2 పంప్‌లు, మల్లన్న సాగర్‌లో 7, కొండపోచమ్మ సాగర్‌లో 2 బాహుబలి మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. మరి ఈ నీరంతా ఎటు పోతున్నది? చుట్టుపక్కల రైతులు, గొర్ల కాపర్లతో మాట్లాడితే.. కాళేశ్వరం తమ కష్టాలను కడతేర్చిందని, ఎటుచూసినా సర్కారు తుమ్మలతో, చెరువులు ఎండిపోయి, నెర్రెలుబారి నోరెళ్లబెట్టిన భూముల్లో కాళేశ్వరం వల్ల తడి ఆరకుండా 2 పంటలు పండుతున్నాయని, ఎండకాలంలో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు.
అసలు కాళేశ్వరమే లేకపోతే, ఆ ప్రాజెక్టు జలాలపై ఆధారపడే గంధమల్ల రిజర్వాయర్‌కు రేవంత్‌రెడ్డి ఎందుకు శంకుస్థాపన చేశారు? మల్లన్నసాగర్ నుంచి గండిపేట ద్వారా నీటిని తీసుకెళ్లి మూసీ ప్రక్షాళన చేస్తామని ఎలా హామీ ఇచ్చారు? కాంగ్రెస్ తీరు చూస్తుంటే ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి మేడిగడ్డను బాంబులు పెట్టి కూల్చేలా కనిపిస్తున్నది.
ఈ మూడు రోజుల ప్రయాణంలో కేసీఆర్ కాళేశ్వరం ద్వారా గోదావరికి ఎదురీత నేర్పి, రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ బీళ్లకు మళ్లించిన తీరు అర్థమైంది. సంకల్ప బలం ఉంటే సృష్టికి సైతం ప్రతిసృష్టి చేయవచ్చనే నిజాన్ని తెలుసుకున్నాం. అందుకే కేసీఆర్ నదులకు నడకనేర్పిన నాయకుడు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులను నిర్మిస్తే, కేసీఆర్ గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మించారు. ఒక్కో దశలో నీటిని ఒడిసిపట్టి ఎగువకు తరలించారు. కాళేశ్వరం పర్యటనలో మాకు మేడిగడ్డ, అన్నా రం, సుందిల్ల బ్యారేజీలలో ఒక్కో పిల్లర్ ఒక్కో తెలంగాణ అమరవీరుడికి స్మారక స్థూపంలా కనిపించింది.
ఈ ప్రాంత గోస తీరాలని, ఇక్కడి కరువును పారదోలాలని, బీడుపడ్డ ఈ తెలంగాణ పచ్చబడాలని, ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా కావాలని, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు రావాలని, ప్రాణాలు పణంగా పెట్టి ఆఖరికి అమరులైన అమరవీరులకు ఒక్కో స్మారక స్థూపంలాగా కేసీఆర్ ఒక్కో పిల్లర్‌ను కట్టించారు. ఒక్కో బాహుబలి మోటర్ ఆ నీళ్లను ఎగువకు ఎత్తిపోస్తున్న తీరును చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ కోసం, సాగునీళ్ల కోసం కేసీఆర్, జయశంకర్ సార్, కాళోజీ, విద్యాసాగర్‌రావులు పడ్డ తపన కనిపించింది. పంపుల నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలు నాటి సకలజనుల సమ్మెను, జై తెలంగాణ నినాదాలతో సాగిన తీరును తలపించాయి. రాజకీయ కక్షలో భాగంగా కాంగ్రెస్ ప్రభు త్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఏసీ గదుల్లో వివరాలు సేకరించే బదులు, ఒక్క మేడిగడ్డలోని రెండు పిల్లర్లను చూసే బదులు ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కలియదిరిగితే కనువిప్పు కలిగేది. స్వయంగా ముఖ్యమంత్రే రిపోర్ట్ రిజల్ట్ రాకముందే నేరం జరిగిందని చెప్పడం, కమిషన్ వాళ్ల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించడం చూస్తుంటే, ఆ 655 పేజీల రిపోర్ట్ గాంధీభవన్‌లో తయారైందేనని స్పష్టమవుతున్నది. క్రియాశీలక రాజకీయాల్లో ఉండి, కాళేశ్వరాన్ని విమర్శించే ప్రతి ఒక్కరూ కాళేశ్వరాన్ని మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకు పూర్తిగా సందర్శించి రావాలి, అప్పుడే అర్థమవుతుంది.
కాళేశ్వరం కూలింది కూలిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే, వీళ్లే కూలగొట్టేలా ఉన్నారనిపిస్తున్నది. కాంగ్రెస్ కుట్ర కేసీఆర్ మీద కాదు, తెలంగాణ మీద. కాళేశ్వరం తెలంగాణ వ్యవసాయ రంగానికి గుండెకాయ వంటిది. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును చూసి రావడానికి మూడు రోజుల సమయం సరిపోలేదు. కాంగ్రెస్‌కు కాళేశ్వరం గొప్పదనం అర్థం కావాలంటే ఆ పార్టీ నేతలు మరో జన్మ ఎత్తాలి.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు) ఏనుగుల రాకేష్‌రెడ్డి