ఏ ప్రభుత్వ పరిపాలన సామర్థ్యమైనా ఆ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాతిపదిక మీద చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రశంసించదగ్గ విధంగా లేదనేది తెలుస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025-26 గణాంకాల ప్రకారం మొత్తం బడ్జెట్ అంచనాల కన్నా రూ.24 వేల కోట్ల ఆదాయం తక్కువగా వచ్చింది. ఒక రెవెన్యూ ఆదాయమే రూ.38 వేల కోట్లు తక్కువగా నమోదయింది. అంటే అంచనాలు విపరీతంగా పెంచి చూపెట్టడం, అవి సాధించలేని అసమర్థత ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది. పోయిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వానికి రూ.1.81 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది.
మూలధన ఆదాయం, అప్పుల ద్వారా రూ.78,197 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పద్దు కింద మాత్రం అంచనాల కన్నా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మడం చాలా సులువైన పని. ఎంతో వాస్తవ అంచనాలతో బడ్జెట్ తయారు చేస్తున్నాం అని చెప్పుకొనే ప్రభుత్వంలో 25% అప్పులు లేదా ఆస్తుల అమ్మకాల ద్వారానే వస్తుంది. ప్రభుత్వ సామర్థ్యం ఏమీ లేదు. ఇది అప్పు ద్వారా చేకూరింది మాత్రమే. పన్నుల ద్వారా మాత్రం రూ.2.29 లక్షల కోట్లు అంచనా వేస్తే వచ్చింది మాత్రం రూ.1.81 లక్షల కోట్లు మాత్రమే. అంటే పన్నుల వసూళ్లలో ఎక్కడో గండి పడుతున్నదని అర్థం లేదా వారి ప్రమాణాల లాగానే అవి అసమంజసంగా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో రూ.3.19 లక్షల కోట్ల అప్పులు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని కొత్తగా అధికారం చేపట్టిన రోజులలో కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శాఖ వెబ్సైట్ ప్రకారం రాష్ట్ర మొత్తం అప్పులు రూ.5 లక్షల కోట్లు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన రూ.4.7 లక్షల కోట్ల అప్పులకు గాను మనకు కండ్ల ముందు ఫలితాలు కనిపిస్తున్నాయి. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హైదరాబాద్లో 33 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, వరంగల్లో రింగ్ రోడ్డు, పెరిగిన ప్రభుత్వ బాధ్యతలకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలతో సచివాలయం, కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీస్లు, కమిషనరేట్ భవనాలు, 11 వందల గురుకుల పాఠశాలలు, హైదరాబాద్లో టిమ్స్లు, వరంగల్లో అధునాతనమైన ఎంజీఎం దవాఖాన పునర్నిర్మాణం, తెలంగాణ అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, మెట్రో రైల్ విస్తరణ, జిల్లాకొక మెడికల్ కాలేజీ, రైతుబంధు ప్రత్యక్ష నిదర్శనాలు. ఇవన్నీ కాక రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,50,000 నుంచి రూ.3,80,000కు పెరిగింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రంలో ఎన్నో రెట్ల సంపద పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులతో కలిపి కూడా ఇప్పటికీ మన రాష్ట్ర జీడీపీలో అప్పులు 28 శాతం మాత్రమే. దేశం మొత్తానికి 57% ఉంటే, పంజాబ్ ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలతో పోల్చుకున్నా కూడా మన అప్పుల శాతం తక్కువే.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతీ సంవత్సరం ఖర్చుపెట్టే మొత్తం సొమ్ము రూ.67 వేల కోట్లు అవుతుంది. ఇది రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో 34 శాతం మాత్రమే. అయినా ఈ ప్రభుత్వం డబ్బులు లేవని డీఏలు ఇవ్వకపోవడం, పీఆర్సీ ఇవ్వకపోవడం, దశాబ్దాలు పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు వారు కూడపెట్టుకున్న పైసలు కూడా ఇవ్వకపోవడం శోచనీయం. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ర్టానికి తగ్గిన రెవెన్యూ ఆదాయం చూసుకున్నా కూడా ఇంకా 66% వేటి మీద ఖర్చుపెట్టినట్టు?
ఇంతవరకు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అని, స్కిల్ యూనివర్సిటీ అని, మూసీ అభివృద్ధి అని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పింది, చెప్తున్నది కానీ ఇంతవరకు వీటి మీద ఒక్క పైసా ఖర్చు పెట్టింది లేదు. మూసీ అభివృద్ధి పేరు మీద ఎంతోమంది పేదల ఇండ్లు కూల్చడమే ప్రస్తుతానికి జరిగిన కాంగ్రెస్ మార్క్ అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు ఆర్థిక సంవత్సరాలు (2024-25 2025-26) గడిచిపోయాయి.
ఈ రెండు సంవత్సరాల్లో మొత్తం రూ.7 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరాయి. అప్పులు తీర్చేందుకు లక్ష కోట్లు, ప్రభుత్వ నిర్వహణకు రూ.2 లక్షల కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు రూ.2 లక్షల కోట్లు తీసేస్తే, మరి మిగతా రూ.2 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు చూపెట్టగలదా ఈ ప్రభుత్వం?
ఈ రెండు సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.3.5 లక్షల కోట్లు అంటే మొత్తం రూ.7 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరాయి. ఇందులో అప్పులు తీర్చేందుకు ఒక లక్ష కోట్లు, ప్రభుత్వ నిర్వహణకు రూ.2 లక్షల కోట్లు తీసేస్తే, సంక్షేమ కార్యక్రమాలకు రూ.2 లక్షల కోట్లు (ఇది అతి ఉదారమైన అంకె) అంటే మొత్తం 5 లక్షల కోట్లు తీసేస్తే, మరి మిగతా రూ.2 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు చూపెట్టగలదా ఈ ప్రభుత్వం?
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయటం, ఇదివరకే నిర్మితమైన భవనాలకు ప్రారంభోత్సవం చేయడం ఈ ప్రభుత్వ పనులు. అప్పే పుట్టడం లేదన్న పాలకులు రూ.3 లక్షల కోట్ల పైచిలుకు అప్పు ఎలా చేయగలిగారు? ఎంతసేపూ పాత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం తప్పితే, ఈ ప్రభుత్వం కంటికి కనబడే అభివృద్ధి ఎందుకు చేయలేక పోతున్నది? గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో లేని తప్పులను వెతుకడానికి ప్రయత్నించడం, ఢిల్లీ నాయకులను సంతృప్తి పరచడం, అంతర్గత కుమ్ములాటలతోనే ఈ ప్రభుత్వ పుణ్యకాలం గడిచిపోతున్నది. ఈ ప్రభుత్వం చూపిన మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత ఒలక పోసుకున్న ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు.
– (వ్యాసకర్త: ఆర్థిక నిపుణుడు)
డాక్టర్ ఎంహెచ్ ప్రసాదరావు 99630 13078