ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ ఉంటుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచీ బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నిద్రమత్తు నుంచి మేల్కొలుపుతూ వస్తున్నది. అయితే, దీనిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ మాత్రం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ, కేసులను అస్త్రంగా వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకులను అణచివేయాలని చూస్తున్నది.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల వాగ్దానాలను నిలబెట్టుకోవడం లో ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ నాయకులు సఫలీకృతులయ్యారు. ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. ‘ఫార్మాలా-ఈ’ కార్ రేస్ విషయంలో ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నది. ఆయనపై విచారణకు గవర్నర్ అనుమతి కోరడం, ఆయన వెంటనే ఆమోదించడం కాంగ్రెస్-బీజేపీ లోపాయికారి మైత్రికి నిదర్శనం. కార్ రేస్ నిర్వహణ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో), ఏస్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిడెట్, గ్రీన్ కో స్పాన్సర్షిప్ కలిసి పురపాలక శాఖతో 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వానికి తప్ప తమకు ఎలాంటి లాభం లేదన్న కారణంతో రెండో విడత రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ అసమర్థతను ఎప్పటికప్పుడు నిలదీస్తూ అధికార కాంగ్రెస్ పార్టీనినడిబజార్లో నిలబెడుతుండటంతో సీఎం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన నాయకుల్లో కేటీఆర్ ముఖ్యుడు అనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకుంటే మంచిది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడటం కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ తప్పు ఇసుమంతైనా లేదు. హెచ్ఎండీఏ తీసుకునే నిర్ణయాలకు మంత్రివర్గ అనుమతులు అవసరం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకి అంతర్గతంగా డబ్బు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతా చట్టబద్ధంగా, సవ్యంగా జరిగిన పనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసుల్లో కేటీఆర్‌ను ఇరికించాలని చూస్తున్నది. హెచ్ఎండీఏ క్యాబినెట్ అనుమతి తీసుకోలేదని, చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని అడ్డదిడ్డంగా వాదిస్తున్నది. ఇది ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రేస్ కారణంగా తెలంగాణకు దాదాపు రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఘనత ముమ్మాటికీ కేటీఆర్‌కే దక్కుతుంది. అలాంటి వ్యక్తిపై కక్షపూరితంగా కేసులు పెట్టడం అన్యాయం. రాష్ర్టాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు.
‘ఫార్ములా-ఈ’ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు పెట్టడంతో దీని ప్రభావం అంతర్జాతీయంగానూ ఉంటుంది. రేపటి రోజున తెలంగాణకు విదేశీ పెట్టుబడులు రావాలంటే భయపడే అవకాశం ఉంది. బెదిరింపులకు లొంగని, కేసులకు భయపడని నాయకుడు కేటీఆర్. ఇటువంటి అక్రమ కేసులకు ఆయన భయపడతాడనుకుంటే అది కాంగ్రెస్ నేతల మూర్ఖత్వమే అవుతుంది. సోషల్ మీడియాలో విష ప్రచారం ద్వారా రాష్ర్టానికి కేసీఆర్, కేటీఆర్ చేసిన మంచిని చెరిపేయాలనుకోవడం ఉత్త భ్రమ మాత్రమే. ప్రకటించిన పథకాలను అమలు చేయలేక, ప్రజలకు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వారి దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతూ పబ్బం గడుపుకొంటున్నది. అభివృద్ధి విషయంలో తెలంగాణను వెనుకకు నెడుతున్నది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కులను హరిస్తున్నది. ఇందుకు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనే ఉదాహరణ. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు పగతో రగలిపోతున్న ప్రభుత్వం కేటీఆర్‌ను అణచివేసే కుట్రలు చేస్తున్నది. అందులో భాగంగానే జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నది.
ప్రభుత్వ అసమర్థతను ఎప్పటికప్పుడు నిలదీస్తూ నడి బజార్లో నిలబెడుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి గుండెల్లో గుబులు పుడుతున్నది. తెలంగాణ కోసం అలుపెరగక పోరాడి, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలబెట్టిన గొప్ప నాయకుడు కేటీఆర్ అనే విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు కేటీఆర్ లొంగరు. ఆయ న పోరాటం తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే.
– (వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ)
జి. రాజేష్ నాయక్ 9603579115