Nawaz Sharif : పాకిస్థాన్ మాజీ ప్రధాని (Pakistan Ex PM) నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. సాధారణంగా దేశ ప్రధాని పదవిని చేపట్టిన నాయకులు ప్రాంతీయ పదవుల వైపు చూడరు. కానీ నవాజ్ షరీఫ్ మాత్రం ఏకంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan Occupaid Kashmir) కు ప్రధాని కావాలని ఉందంటూ ఎవరూ ఊహించని ఆకాంక్షను వ్యక్తంచేశారు. ముజఫరాబాద్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. అక్కడ తమ పార్టీ గెలిస్తే తన సోదరుడు, ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరి మరీ పీఓకే ప్రధాని బాధ్యతలు చేపడతానని ప్రకటించారు.
పీఓకే ప్రాంత అభివృద్ధిని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ తనకు ఎంత ముఖ్యమో పీఓకే కూడా అంతే ప్రాధాన్యత కలిగినదని వ్యాఖ్యానించారు. తమ పూర్వీకులు కశ్మీర్ ప్రాంతం నుంచే వలస వచ్చారని, అందుకే పీఓకే తనకు రెండో స్వగ్రామంతో సమానమని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను ప్రధానిని కాకపోయినా ప్రతి మూడు నెలలకోసారి అక్కడ పర్యటించి అభివృద్ధి పనులను సమీక్షిస్తానని హామీ ఇచ్చారు.
అయితే నవాజ్ షరీఫ్ ఈ తరహా ప్రకటనలు చేయడానికి పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నిరసనలే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, విపరీతమైన విద్యుత్ ఛార్జీలు, వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా.. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) ఆధ్వర్యంలో పీఓకే వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వ నిర్బంధ చర్యలు, ఘర్షణల కారణంగా ఇప్పటివరకు అక్కడ 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల తీవ్ర ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే నవాజ్ షరీఫ్ ఇలాంటి హామీల డ్రామాడుతున్నారని భావిస్తున్నారు. మరోవైపు పీఓకేలో జరుగుతున్న ఈ పరిణామాలపై భారతదేశం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని తేల్చిచెప్పింది. అక్కడ పాకిస్థాన్ అక్రమంగా, బలవంతంగా భూభాగాలను ఆక్రమించిందని, ఆక్రమిత ప్రాంతాల్లో పాక్ నిర్వహించే ఎలాంటి ఎన్నికలను లేదా అక్కడి తాత్కాలిక అసెంబ్లీలను భారత్ గుర్తించదని స్పష్టంచేసింది.