మద్దూర్(కొత్తపల్లి), సెప్టెంబర్ 27 : కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో రాష్ట్రమంతా ఆగమాగమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం వాల్యానాయక్‌తండాలో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు, యువత బీఆర్ఎస్లో చేరగా మాజీ ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్‌ను సీఎంను చేస్తామని.. ఎమ్మెల్యేగా పట్నం నరేందర్‌ను గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారి కొడంగల్ నియోజకవర్గంలో భూ దందాలకు దిగాడని మండిపడ్డారు.