తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్).. సర్కారీ విద్యలో సరికొత్త ప్రయోగం. ఈ కొత్త ప్రయోగం చిన్న స్కూళ్ల పాలిట మరణశాసనం కానున్నది. టీపీఎస్‌లను ఏర్పాటు చేసి వాటికి సమీపంలోని స్కూళ్లను సర్కార్ విలీనం చేస్తున్నది. ఫలితంగా నాలుగైదు స్కూళ్లు ఒకే గొడుగుకిందికి వస్తున్నాయి. ఇదిలా ఉంటే బస్సులు పెట్టి విద్యార్థులను తరలించనుండగా.. వీటి సమీపంలోని చిన్న స్కూళ్లు సైతం రానురాను నిర్వీర్యం కానున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పబ్లిక్ స్కూళ్ల ప్రయోగం.. చిన్న, మధ్యతరహా ప్రభుత్వ బడులను బలితీసుకోబోతున్నది. తొలుత రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో, ఆ తర్వాత పొల్కంపల్లి, వంగూరు, మంచాలలో పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సమీపంలోని నాలుగైదు స్కూళ్లను టీపీఎస్‌లో విలీనం చేస్తున్నారు. వేర్వరు యాజమాన్యం కింద ఉన్న జిల్లా పరిషత్, మాడల్ స్కూల్, కేజీబీవీలను సైతం టీపీఎస్‌లో విలీనం చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇటీవలే కొత్తగా 20 టీపీఎస్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఓఆర్ఆర్ వెలుపల మొత్తంగా 105 ఏర్పాటు చేయనున్నది. ఇవన్నీ కూడా సమీపంలోని స్కూళ్లను విలీనం చేయడంతో ఆవిర్భవించేవే కావడం గమనార్హం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సర్కార్ పాఠశాలల ఏకీకరణ(విలీనం)కు శ్రీకారం చుట్టడం, స్కూళ్ల మూసివేతకు పరోక్షంగా దారులు తెరువడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లను నాలుగువేలకు కుదిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. సీఎం మాటలకు ఆచరణ రూపమే టీపీఎస్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీపీఎస్లతో ఉన్న స్కూళ్లకు రెండు రకాల నష్టం వాటిల్లనున్నది. మొదట విలీనంతో నాలుగైదు స్కూళ్లు ఒకటి అవుతాయి. ఆ తర్వాత బస్సులు పెట్టి విద్యార్థులను తరలించడంతో సమీపంలోని స్కూళ్లు మూతపడనున్నాయి. టీపీఎస్‌లను ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు నడుపనున్నారు. చిన్న పాఠశాలల్లోని విద్యార్థులను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో చేర్పించాలని ఇటీవలే విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కో స్కూల్ నాలుగైదు బస్సులను నడుపనున్నది. కొన్ని టీపీఎస్‌లు ఐదు, మరికొన్ని పది కిలోమీటర్ల దూరం వరకు బస్సులను నడుపనున్నాయి. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేసుకున్నాయి. ఆయా గ్రామాల్లోని విద్యార్థులను టీపీఎస్‌లకు తరలిస్తే ఉన్న చిన్నపాటి స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య తగ్గనున్నది. అంతిమంగా ఆయా స్కూళ్లు మూతపడుతాయి. రాష్ట్రంలో 2 వేలకు పైగా జీరో ఎన్రోల్మెంట్ బడులు ఉన్నాయి. ఇక 10 మందిలోపు విద్యార్థులున్న బడులు 2,428 ఉండగా, 11- 20 మందిలోపు విద్యార్థులున్న బడులు 4,180, 21-30 మంది విద్యార్థులున్నవి 3,097 ఉన్నాయి. ఇవన్నీ దాదాపు చిన్న పాఠశాలల కిందే లెక్క. అంటే సుమారు 7,500 స్కూళ్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తున్నది.