న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వీడని వర్గాల ఆంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వాల బాధ్యత అని బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలకమైన అనంతరామన్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉండాల్సిన మౌలికమైన లక్షణాన్ని గుర్తుచేసింది. ఆ సున్నితత్వం, జన విశ్వాసాన్ని అవగాహన చేసుకునే ఇంగితం చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రదర్శించి ఉంటే ఈ దేశం ఇప్పటికీ ఇలా ఎందుకుండేది? హామీలు, నినాదాల ఆర్భాటం, ఆచరణలో పొగరు, వగరుబోతుతనం హస్తం సర్కార్ల సహజ శైలి కావడం వల్లనే అన్ని రాష్ర్టాల్లో, అనేక వర్గాలు అవకాశాల కోసం నేటికీ విలవిలాడుతూనే ఉన్నాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా సరే పాతాళ భైరవి సినిమాలో మాయల ఫకీర్ బాల నాగమ్మను బంధించిన తీరున కాంగ్రెస్ ఇప్పటికీ బీసీలపైనే కాదు, వివిధ వర్గాలన్నింటిపై వల విసరగలుగుతూనే ఉండగలగటం విచిత్రం.
తాజాగా రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై మంత్రిమండలి మోసపూరిత నిర్ణయాన్ని ప్రకటించడం చూస్తే సర్కార్ ఎలా జారుడు బండ మీద నిలబడి విన్యాసాలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నదో అర్థమవుతున్నది. దాదాపు రెండేండ్లుగా కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొన్నటి క్యాబినెట్ నిర్ణయం వరకు బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ రేవంత్ రెడ్డి సర్కార్ నడిపిస్తున్న నాటకంలో, ఆర్డినెన్స్ ప్రకటన వల్ల ఎట్టకేలకు విలనిజం ైక్లెమాక్స్‌కు చేరింది.
బీసీ రిజర్వేషన్లను రేవంత్ సర్కార్ అంపశయ్యపైకి దిగ్విజయంగా చేర్చిన విషయం స్పష్టంగా కండ్లకు కట్టినట్టు తేటతెల్లమైపోయింది. ఈ ద్రోహాన్ని బీఆర్ఎస్ మాత్రమే కాదు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వంటి వారు, మాజీ ఐఏఎస్ చిరంజీవులుతో పాటు అనేక మంది విజ్ఞులు, నిపుణులు చాలా స్పష్టాతిస్పష్టంగా వివరిస్తున్నారు. మరి సర్కార్ వారికి సన్మానాలెందుకు? ఏం ఒరగబెట్టారని హస్తం శ్రేణులు సంబురాలు జరుపుకొంటున్నారు? కనీసం సర్కార్ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందకమునుపే శాలువాల సత్కారాలకు బరితెగించడం జుగుప్సాకరంగా అనిపించకపోవడం పాలకుల సిగ్గెరుగని సంస్కారానికి నిదర్శనం.
వంచన తనకు తాను వెన్ను తట్టుకొని ప్రోత్సహించుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ప్రకటన అనంతరం వేడుకలు చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొండంత రాగం తీసి విద్రోహ గీతం అందుకున్నట్టు మోదీ మెడలు వంచుతామని జంతర్ మంతర్‌లో పోతురాజు వేషమేసి విజృంభించిన రేవంత్‌రెడ్డి సర్కార్, తీరా పిట్టలదొరలా లొట్టపీసు ఆర్డినెన్స్ రాగం అందుకోవడం ఆశపడ్డ బీసీలకు ఆవేదన కలిగించదా? ఇన్ని విచిత్రాలు, ఇంత వికృత వేషాలు బహుశా ప్రపంచంలోనే ఏ సర్కార్ ప్రదర్శించి ఉండదు. గద్దెనెక్కడం కోసం అబద్ధాలు వల్లించారు సరే పబ్బం గడుపుకోవడానికి, మోదీ సర్కార్‌తో చీకటి స్నేహాన్ని కొనసాగించడానికి బీసీలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నది.
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించేనాటికే ఇంద్రసహాని కేసు తీర్పు, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్ రావు గవాళి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తదితర కేసుల్లో అత్యున్నత న్యాయస్థానాల తీర్పులు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, తెలంగాణ తదితర రాష్ర్టాల రిజర్వేషన్ల పోరాటాలు, ప్రయత్నాలు, అనుభవాలు కూడా దేశం ముందున్నాయి.
అవన్నీ అధ్యయనం చేయకుండా, పరిగణనలోకి తీసుకోకుండా అధికారేచ్ఛతో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో నమ్మబలికించారు. కానీ, కనీసం గతంలో కర్నాటకలో సిద్దరామయ్య సర్కార్ బీసీ కమిషన్‌కు చట్టబద్ధ హక్కులు కల్పించి, కుల సర్వే జరిపించిన నమూనాను కూడా రేవంత్ ప్రభుత్వం అనుసరించలేకపోయింది. అయినా సరే సిద్దరామయ్య సర్కార్ 2016 నుంచి నేటికీ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.
అది మరిచి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అశాస్త్రీయ సర్వేతో బీసీల జనాభాకే ఎసరు పెట్టిన రేవంత్ సర్కార్ సర్వే దేశంలో బ్యాడ్ మోడల్ అవుతుంది కానీ, రాహుల్ ప్రచారం చేసుకుంటున్నట్టు రోల్ మోడల్ ఎలా అనిపించుకుంటుంది? నా ఇంటికే సర్వే వివరాల సేకరణకు రాలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చెప్పడమే కాదు, బీసీ కమిషన్ సభ్యుడిగా గతంలో పనిచేసిన మా వీధిలోకి కూడా ఏ సర్వే సేకరణ అధికారులు రానే లేదు. చట్టబద్ధత లేని, అనర్హులైన ఎన్యూమరేటర్ల ద్వారా సేకరించిన సర్వే గణాంకాలు, వాటి ఆధారంగా రూపొందించిన చట్టాలు లేదా ఆర్డినెన్స్‌లు న్యాయస్థానాల ఆమోదముద్రను పొందడమెలా సాధ్యపడుతుంది?
గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు, చంద్రబాబు చెరలోని ఆనాటి మోదీ సర్కార్ పెట్టిన కొర్రీల కారణంగా అనివార్య పరిస్థితుల మధ్యలో లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నది. కానీ ప్రస్తుతం బాబు భుజాల మీదున్న మోదీ సర్కార్ లోపాయికారి సంఘీభావం రేవంత్ సర్కార్‌కు పుష్కలంగా ఉన్నదనేది తెలుస్తూనే ఉన్నది. అయినా అంతిమ పరిష్కారమైన 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చే కార్యాచరణ చేపట్టకుండా వెన్నుచూపడం దేనికి సంకేతం? వాస్తవానికి 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ సర్కార్‌ను శూలంగా పొడుస్తూ తరుముతున్నది బీఆర్ఎస్ పార్టీ. లేకపోతే సుప్రీం తీర్పుకు భిన్నంగా బీసీ కమిషన్ ద్వారానే కసరత్తు కానిచ్చి కథ కంచికి చేర్చేవారు.
డెడికేటేడ్ కమిషన్ వేసేలా చేసి, సర్వే విధానంలో, కమిషన్ల నివేదిక రూపకల్పనలో, జీవో 49& జీవో 1ల ద్వారా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలకు చెందిన రెండు కమిషన్లకు ఏక కాలంలో ఒకే బూసాని వెంకటేశ్వరరావు చైర్మన్‌గా అధ్యయనం చేయడం, బిల్లుల రూపకల్పనలో చేసిన పొరపాట్లు ఇలా ఎన్నింటినో బీసీ రిజర్వేషన్ల బిల్లులు శాసనసభలో పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ ఎత్తిచూపింది. బాధ్యతాయుత విపక్షంగా కొన్ని సవరణలను ప్రతిపాదించింది. అంతకంటే ముందు సమావేశాల ద్వారా వివిధ వేదికల్లో, చెన్నై పర్యటన ద్వారా, డెడికేటెడ్ కమిషన్‌కు, చీఫ్ సెక్రటరీకి వినతిపత్రాల ద్వారా ఇలా ఎన్నోవిధాలా రేవంత్ సర్కార్ సరైన పద్ధతిలో 42 శాతం రిజర్వేషన్ల పెంపు కసరత్తు చేయాలని వెంటపడింది. కానీ, శకుని గుణంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం కావాలనే బీఆర్ఎస్తో పాటు బీసీ మేధావులందరి సూచనలను బుట్టదాఖలు చేసి ఇష్టానుసారంగా ముందుకువెళ్లింది.
అయినా సరే బిల్లులకు మద్దతు పలికి, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ స్వాగతించి, బీసీల కోసం భేషజాలు లేకుండా వెంట వెళ్లేందుకు సైతం సిద్ధపడింది. కానీ, నిండు అసెంబ్లీలో ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. తీరా ఆ బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే, ఆర్డినెన్స్ పేరిట బీసీ రిజర్వేషన్ల పెంపు ఆశలపై ఆర్డీఎక్స్ బాంబు వేస్తున్నారు. కనీసం మళ్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, అన్ని కోణాల్లో చర్చించి, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో చట్టం చేసే అవకాశం ఉన్నా సభను ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్‌ను తెరపైకి తేవడం వెనుక సర్కార్‌కు ఎంత ద్రోహ చింతన దాగుందో అర్థం కాదా?
ఇప్పటికే ఏటా 20 కోట్ల బడ్జెట్ హామీకి పంగనామం పెట్టి తొలి ఏడాది రూ.7 వేలు, ఈ ఏడాది రూ.11 వేల కోట్ల కేటాయింపులు చూపి సరిపెట్టారు. అవి కేవలం కేటాయింపులే తప్ప ఖర్చు కావనేది గతేడాది అనుభవం తేటతెల్లం చేసింది. 52 శాతంపైగా ఉన్న బీసీలకు కేవలం బడ్జెట్లో 3.5 శాతం నిధులు కేటాయింపుల్లో చూపడం ఏం సామాజిక న్యాయం? ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీల్లో కొసరైనా వడ్డించేందుకు సరిపోతాయా?
అలాగే నియమిత 74 నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 11 మాత్రమే విదిలించి వెక్కిరించింది. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరు, 14 వీసీల్లో కేవలం నలుగురు బీసీలను మాత్రమే నియమించి వంచించింది. ఏమైనా అంటే పీసీసీ అధ్యక్షుడిగా బీసీని నియమించామని గప్పాలు కొడతారు. కానీ, మహేష్‌కుమార్ గౌడ్‌ను నియమించడం వెనుక అసలు వాస్తవం మధుయాష్కీ, వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్ లాంటి బలహీన వర్గాల పక్షపాత దృష్టికోణం కలిగిన నాయకులు పీసీసీ అధ్యక్షులు కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి డూడూ బసవన్న కోసం పావులు కదిపారని అదే కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటుండటం నిజం కాదా?
ఇలా ఎన్నో బీసీ వ్యతిరేక చర్యలతో ఊరేగితున్న రేవంత్ సర్కార్ వికార విధాన నిజ రూపాన్ని 12,700కు పైగా ఉన్న గ్రామ పంచాయతీల్లోని బీసీలందరూ అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన బీసీ యువతరం ఈ ఘరానా మోసాన్ని గుర్తెరిగి తిరగబడాలి. డిక్లరేషన్ దొంగాటతో గట్టెక్కి గుదిబండగా మారిన కాంగ్రెస్‌ను, ఏకంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని, తీరా రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇవ్వని బీజేపీని రాజకీయంగా తెలంగాణలో శాశ్వతంగా తెరమరుగు చేసేదాకా ప్రతినబూనాలి. ఈ రెండేండ్ల అనుభవం అందరి భవితవ్యం బీఆర్ఎస్తోనే ముడిపడి ఉన్నదనే సత్యాన్ని ఇప్పటికే ప్రతి ఇంటికీ అర్థం చేయించింది కదా…!
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్