తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో రెండు విధాలుగా భంగపాటు ఎదురైంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉం డాలని సుప్రీంకోర్టు హెచ్చరించడం ఒకటైతే.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని పునరుద్ఘాటించడం మరొక అంశం.
మహారాష్ట్రకు సంబంధించి సుప్రీంకోర్టులో అటు వాదనలు జరుగుతుండగానే ఇక్కడ తెలంగాణ క్యాబినెట్ రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మరి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని అడగొద్దు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ హేతుబద్ధమైన సాకు దొరికింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేటాయించిన రూ.3 వేల కోట్లు మురిగిపోతాయని, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు ఓకే. కానీ, ఆయన మరింత ముందుకువెళ్లి.. బీసీల రిజర్వేషన్ల పెంపుపై తాము ఎంతో నిబద్ధతతో ఉన్నామని చాటుకునేందుకు సర్పంచ్ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు.
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఏ గ్రామ పంచాయతీలోనైనా అభ్యర్థులు వార్డు మెంబర్, సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తారు. రాజకీయ పార్టీలు వారికి మద్దతిస్తాయి తప్పితే, పార్టీ గుర్తు మీద వీరు పోటీ చేయరు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే పరిగణించబడతారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నది. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎలా పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పిస్తుంది?
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ పార్టీ ‘కోటా’పై ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన ప్రక్రియ ప్రకారం బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. బీసీ నాయకులకు మాయమాటలు చెప్పి చివరికి పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటుందన్న విషయమూ ఊహించిందే. కానీ, రాజకీయ పార్టీల జోక్యం లేని సర్పంచ్ ఎన్నికల్లోనూ రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం.
ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత ఉందని భావించిన రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఉద్దేశపూర్వకంగానే ఇంతకాలం ఆలస్యం చేస్తూ వచ్చింది. బీసీల రిజర్వేషన్ పెంపు అంశాన్ని కూడా అందుకే ముందుకు తీసుకువచ్చి ఎన్నికలపై నాన్చుతూ వస్తున్నది. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఊహించని విజయంతో ఆ పార్టీ.. తమకు ప్రజల్లో సానుకూలత వచ్చిందని భావించినట్టుంది. అందుకే ఆగమేఘాల మీద, డిసెంబర్లోగా పంచాయతీ ఎన్నికలను పూర్తిచేయాలని క్యాబినెట్ తీర్మానించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని, గెలిస్తే వెంటనే జరుగుతాయని ఊహించిన విషయమే. సీఎం రేవంత్ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. అంతే తప్ప ఆయనకు రాష్ట్రంపై, పంచాయతీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. రేవంత్ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టు పేరు చెప్పి బీసీల రిజర్వేషన్ల పెంపు లేకుండానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఆ పార్టీకి మోసాలు కొత్త కాదు. ఇకనైనా బీసీ నేతలు కాంగ్రెస్ కుట్రలను తెలుసుకొని మసులుకోవాలి.
– (వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
ఓ.నరసింహా రెడ్డి 80080 02927