పట్టణాలకు వలస పెరగడంతో గ్రామీణ ప్రాంతాల కంటే రెట్టింపుగా పట్టణాల్లో జనాభా పెరుగుదల నమోదవుతున్నది. దీంతో దేశంలో 1961 నాటికి 17.97 శాతం ఉన్న అర్బన్ జనాభా 2023 నాటికి 35.87 శాతానికి చేరుకున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం 31.16 శాతంగా ఉన్నది.
ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల్లో కీలకమైన మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, వాటి శుద్ధితో పాటు ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థకు ఏకైక మార్గం మెట్రో రైల్వే, ఎంఎంటీఎస్, లైట్‌రైల్, మోనోరైల్ వ్యవస్థలను అత్యవసరంగా ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. వీటి వల్ల వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గుతుంది. ఇంధన పొదుపు, కాలుష్య నివారణ, రోడ్డు ప్రయాణాల వల్ల వచ్చే వాయు కాలుష్య సంబంధిత వ్యాధులు, ఆర్థోపెడిక్ సమస్యల బారిన పడకుండా తక్కువ ఖర్చుతో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుతారు. ఇవి అందరికీ తెలిసిన సత్యాలే.
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో సరిపడా రవాణా సౌకర్యం లేక 2050 నాటికి పెరిగే పట్టణ జనాభా 50 శాతం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది. దేశంలోని పట్టణాభివృద్ధి, పర్యావరణ, రవాణా రంగనిపుణులు నాలుగు దశాబ్దాల నుంచి విస్తృతంగా అధ్యయనాలు చేసి మెట్రో ప్రాధాన్యం చెప్తున్నప్పటికీ పాలకులు చెవికి ఎక్కించుకోలేదు. పెద్దన్న పాత్ర పోషించి జనాభాకనుగుణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో, ర్యాపిడ్ రైల్వే వ్యవస్థను పరిగెత్తించాల్సిన కేంద్రం నత్తనడకన సాగుతున్నది. కొన్ని రాష్ర్టాల పట్ల వివక్ష ప్రవర్తిస్తున్నది. ఈ తరుణంలో దేశంలో అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించాలంటే బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌రావు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ పాలనలో గుణాత్మక మార్పు రాకుంటే సాధ్యపడదు. 27 పట్టణాల్లో మెట్రో రైల్వే ఏర్పాటు పలు దశల్లో ఉండగా, 15 నగరాల్లో కేవలం 831 కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నది. మరో 475 కిలోమీటర్లు నిర్మాణంలో ఉండగా 372 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులు ఆమోదం పొంది నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి.
నూతనంగా మెట్రో, మెట్రోలైట్, మెట్రోనియో ప్రాజెక్టులను 1056 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు పలు దశల్లో ఉన్నాయి. వీటిలో ఏపీలోని విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రోరైల్, తెలంగాణలోని వరంగల్ నగరానికి మెట్రోనియో రైలును ప్రతిపాదించారు. 2017లో కేంద్రం తెచ్చిన మెట్రోరైల్ పాలసీ కూడా అమలులో నత్తనడకన నడుస్తున్నది. ఈ తరుణంలో తెలంగాణ, కేరళ, తమిళనాడు, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో వారి వనరులు, ఆలోచన, ప్రణాళికతో ముందుకువెళ్తూ కేంద్ర సహకారం కోసం అభ్యర్థిస్తున్నాయి. ఇందులో కూడా నిబంధనల పేరుతో రాజకీయ వివక్ష కొనసాగుతున్నది. హైదరాబాద్, కొచ్చి వంటి నగరాలు అలానే ఇబ్బంది పడుతున్నాయి.
ఢిల్లీ పరిసర రాష్ర్టాల్లో పంట వ్యర్థాల దహనం ద్వారా వచ్చే పొగ కాకుండా విపరీతంగా పెరిగిన వలసలతో పట్టణాలు విస్తరించడంతో లక్షలాది వాహనాలతో కోట్లాది మంది ప్రజానీకం రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కాలుష్యం గరిష్ఠ స్థాయిని ఢిల్లీ నగరాన్ని ఎప్పుడో తాకేసింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధ్వర్యంలో ఏర్పాటుచేసి 1998లో నిర్మాణం ప్రారంభించారు. 2002 నాటికి మొదటిలైన్ 34 కిలోమీటర్ల మేర పూర్తిగా భూగర్భంలో నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీధరన్ పట్టుదల వల్ల కార్యదక్షతకు తోడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుల్దీప్ సింగ్ కాలుష్య నివారణకు సీఎన్జీ బస్సులను ఏర్పాటుచేశారు. దీంతోపాటు మెట్రో నిర్మాణానికి సహకరించాలని పలు ఆదేశాల ఫలితంగా నేడు 390 కిలోమీటర్ల మేర పూర్తయింది. ఢిల్లీ ‘ఫరీదాబాద్’, ‘నోయిడా’ ‘గురుగాం’ మధ్య రోజుకు 52 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. హైదరాబాద్ జనాభా 5వ స్థానంలో (68.09 లక్షలు) ఉండగా నేడు దాదాపు 1.16 కోట్లకు చేరుకున్నది. జాతీయ జనాభా మిషన్, కేంద్ర ఆరోగ్యశాఖ 2023 చివరికి 1.8 కోట్ల మంది హైదరాబాద్‌లో నివసిస్తారని, ఈ సంఖ్య 2036 నాటికి 57.3 శాతానికి చేరి మొత్తం 2.3 కోట్ల జనాభా అవుతుందని పేర్కొన్నది. ఇప్పటికే జాతీయ, పట్టణ జనాభా సగటు కంటే 12.5 శాతం ఎక్కువ కాగా, అది 2036 నాటికి 18.3 శాతానికి పెరుగుతుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కింద బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపుల్, మియాపూర్-మైత్రినగర్ 31 కిలోమీటర్లు 9,549 కోట్లతో కేంద్రానికి 2022 అక్టోబర్‌లో ప్రతిపాదనలు పంపగా డిసెంబర్లో తిరుగు టపాలో 14 అంశాల్లో కొర్రీలు పెడుతూ వెనుకకు పంపింది. మంత్రి కేటీఆర్ స్వయంగా వివరించేందుకు సమయం కోరగా ఆరు నెలల తర్వాత ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్సింగ్ అవకాశం కల్పించారు. వాస్తవానికి జనాభా, ఆర్థిక పరిస్థితులు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. వాటితో పాటే (పీహెచ్‌పీడీటీ) పీక్ అవర్ పీక్ డైరెక్షన్ ట్రాఫిక్ 4,309గా ఉన్నదని, ఇది చాలదన్నారు. కానీ, నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీతోపాటు 2023 నాటికి పెరిగే జనసాంద్రత తీసుకుంటే అది 6 వేలకు పైగా వస్తుంది. కేంద్రం ఐదారు వేల లోపు పీహెచ్‌పీడీటీ ఉన్న నగరాలు, పుణే, సూరత్ యూపీలోని పలు నగరాలకు మెట్రో సహాయం అందజేసింది.
హైదరాబాద్ తొలిదశ నాటికి ఉన్న మెట్రో పాలసీ ప్రకారం.. కేంద్రం 25 శాతం నుంచి 50 శాతం వరకు గ్రాంట్ ఈక్విటీ రూపంలో సహాయం అందించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వప్రయోజనాలకు పెద్దపీట వేసి వీజీఎఫ్ (వయబులిటీ గ్యాప్ ఫండ్) కేవలం 10 శాతానికి ఒప్పుకున్నది. మెట్రో వారి సొంత మనుషుల చేతిలో ఉండేందుకు పీపీపీకి వెళ్లింది. టెండర్లలో మతలబు జరగటం వల్ల మైటాస్ ప్రాజెక్టు దక్కిందని ప్రచారం. మైటాస్ కంపెనీ దివాలా తీయడంతో తిరిగి టెండర్లు పిలవగా ఎల్అండ్టీ సంస్థ దక్కించుకున్నది. పూర్తిస్థాయిలో గాడినపెట్టి పూర్తిచేయడానికి తెలంగాణ సాధించిన కేసీఆర్ ప్రభుత్వానికి ఆరేండ్ల సమయం పట్టింది. పైగా అధిక వడ్డీల భారం, ప్రాజెక్టు వ్యయం 14,156 కోట్ల నుంచి దాదాపు 18,000 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం పెరిగిన ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం అంటే 1800 కోట్లు ఇవ్వలేదు. కాగా, గతంలో మిగిలిన బకాయి అంటే ఇచ్చిన 1,204 కోట్లలో మిగిలిన 254 కోట్లు ఇస్తే బ్యాంకుల్లో వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నప్పటికీ కేంద్రం నేటికీ స్పందించడం లేదు. ఇది పూర్తిగా రాజకీయంతో కూడిన ఆశ్రిత పక్షపాతమనే చెప్పాలి. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 మంజూరు చేసి 50 శాతం కేంద్రం భరించడానికి మనసు రావటం లేదు. అదే మిగిలిన 17 నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు 2023 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.20,385.62 కోట్లు గ్రాంటుగా ఇచ్చి, ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ పేరుతో ఢీల్లీతో పాటు సమీప రాష్ర్టాల్లోని నగరాలకు రూ.23,450 కోట్లు మంజూరు చేసింది. అంతేకాదు జనాభాపరంగా 2011, 2023 లెక్కల ప్రకారం 10 నుంచి 25 స్థానాల్లో ఉన్న భోపాల్, పాట్నాతో పాటు గుజరాత్‌లోని వడోదరా, సూరత్, యూపీకి అత్యధికంగా కాన్పుర్, లక్నో, ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్‌లకు మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేయడంతోపాటు నిధులు దండిగా ఇస్తున్నది.
దేశవ్యాప్తంగా మెట్రోలను పరిశీలిస్తే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పలు నగరాల్లోని మెట్రో రెల్వేలకు 2014 నుంచి 2023 వరకు గ్రాంట్లు, ఈక్వి టీ, డేటా సర్దుబాటులో జరిగిన కేటాయింపులు ఆర్టీఐ ద్వారా కోరగా అవి ఈ కిందివిధంగా ఉన్నాయి. ఢిల్లీ (అన్ని దశలు) రూ.31,153 కోట్లు, రూ.చెన్నై 8,81 9 కోట్లు, బెంగళూరు రూ.18,233 కోట్లు, ముంబై రూ.16,662 కోట్లు, కలకత్తా రూ.710 కోట్లు, కొచ్చి రూ.2,328 కోట్లు, నాగపూర్ రూ.6076 కోట్లు, లక్నో రూ.4, 802 కోట్లు, అహ్మదాబాద్ రూ.9314 కోట్లు, పూణే రూ.7785 కోట్లు, నోయిడా రూ.970 కోట్లు, భోపాల్ రూ.890 కోట్లు, ఇండోర్ రూ.609 కోట్లు, పాట్నా రూ.700 కోట్లు, కాన్పుర్ రూ.4,382 కోట్లు, ఆగ్రా 2,264 కోట్లు, సూరత్ రూ.2,436 కోట్లు, ఢిల్లీ ‘ఘజియాబాద్’ మీరట్ (ఆర్ఆర్టీఎస్) రూ.12.593 కోట్లు గతేడాది వరకు కేంద్రం విడుదల చేసింది. ఇక 2023-24 బడ్జెట్లో కూడా హైదరాబాద్‌కు చోటులేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని చిన్న నగరాలకు అధిక నిధులు మంజూరయ్యాయి. అవి ఢిల్లీ రూ.2,285 కోట్లు, బెంగళూరు రూ.3522 కోట్లు, ముంబై రూ.2398 కోట్లు, నాగపూర్ రూ.1,199 కోట్లు, అహ్మదాబాద్ రూ.628 కోట్లు, పూణె రూ.60 కోట్లు, భోపాల్ రూ.1,240 కోట్లు, ఇండోర్ రూ.1,134 కోట్లు, పాట్నా రూ.1,479 కోట్లు, కాన్పుర్ రూ.1,736 కోట్లు, ఆగ్రా రూ.1,309 కోట్లు, సూరత్ రూ.2,264 కోట్లు, కొచ్చి రూ.264 కోట్లు, ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ (ఆర్ఆర్టీఎస్) 3,596 కోట్లు కేటాయించారు.
దేశవ్యాప్తంగా అధిక శాతం జనాభా ఎక్కడ నివసిస్తుందో అక్కడ మౌలిక వసతులు ప్రత్యేకించి రవాణా విషయంలో కేంద్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. నూతన ప్రాజెక్టుల ఆవిష్కరణలతో రాష్ర్టాలకు ఊతమివ్వాలే కానీ పక్షపాతం చూపెట్టకూడదు బీజేపీ అగ్రనేతలు అటల్ బిహారీ వాజపేయి, అద్వానీల మాటల్లో చెప్పాలంటే… దేశ సమైక్యత, సమాజం పట్ల సమదృష్టి భావనను నేటి బీజేపీ పాలకులు అలవరచుకుంటే మంచిదనే భావన దేశ ప్రజానీకంలో నెలకొన్నది.
ఈ పరిణామాలను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోను రూ.5,688 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు నిర్ణయించి టెండర్లు పిలిచి పని ప్రారంభించారు. దీనికి సైతం కేంద్రం సహాయం చేయకపోగా, సాంకేతిక అనుమతులు ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నది.
నలుదిశలా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రత్యేకించి విమాశ్రయం నుంచి తుక్కగూడ-కందుకూరు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు కొత్త ప్రతిపాదనలతో పాటు జేఎన్టీయూ, హైటెక్‌సిటీకి మధ్యలో మోనోరైల్, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదించడం హర్షించదగిన విషయం. దేశవ్యాప్తంగా అధిక శాతం జనాభా ఎక్కడ నివసిస్తుందో అక్కడ మౌలిక వసతులు ప్రత్యేకించి రవాణా విషయంలో కేంద్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. నూతన ప్రాజెక్టుల ఆవిష్కరణలతో రాష్ర్టాలకు ఊతమివ్వాలే కానీ పక్షపాతం చూపెట్టకూడదు బీజేపీ అగ్రనేతలు అటల్ బిహారీ వాజపేయి, అద్వానీల మాటల్లో చెప్పాలంటే… దేశ సమైక్యత, సమాజం పట్ల సమదృష్టి భావనను నేటి బీజేపీ పాలకులు అలవరచుకుంటే మంచిదనే భావన దేశ ప్రజానీకంలో నెలకొన్నది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– ఇనగంటి రవికుమార్ 94400 53047