కేంద్ర ప్రభుత్వం 2004-05లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. పేద, అనాథ బాలికలకు విద్య దూరం కాకూడదనేది ఈ విద్యాలయాల ముఖ్య లక్ష్యం. అందులో భాగంగా తెలంగాణలో 2005 నుంచి 8వ తరగతి వరకు, ఆ తర్వాత కాలంలో ఇంటర్ వరకు చదువుకునేలా చర్యలు చేపట్టారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన లేదా తల్లిదండ్రులు లేని బాలికలకు ఈ విద్యాలయాల్లో 75% సీట్లు కేటాయిస్తారు. మధ్యలో చదువు మానేసిన బాలికలను మళ్లీ చదువుకునేందుకు ప్రోత్సహించటం.. ఈ విద్యాలయాల ముఖ్య లక్ష్యం. హాస్టల్ వసతి, ఆహారం, యూనిఫాం, పుస్తకాలు అందించటం, బాల్యవివాహాలను నిరోధించటం, వృత్తి నైపుణ్యాలు నేర్పటం వంటి సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తారు.
తెలంగాణలో కేజీబీవీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడు తున్నాయి. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 495 కేజీబీవీలు ఉండగా, వీటిలో దాదాపు 9,500 మంది వివిధ క్యాటగిరీల టీచర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 60% గ్రాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ 40% కలపడం లేదు. అందువల్ల కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచర్లతోపాటు ఉద్యోగులకు వివిధ రాష్ర్టాల్లో ఒక్కోరకంగా వేతనాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్న ఎస్ఓలు, టీచర్లు, ఇతర సిబ్బంది సేవలను రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే కొనసాగిస్తున్నది. ఎస్ఓలకు నెలకు రూ.32,500, సీఆర్టీలకు రూ.26,000, పీజీసీఆర్టీలకు రూ.29,900, పీఈటీలకు రూ.15,600, అకౌంటెంట్లు, ఏఎన్ఎంలకు రూ.14.300 వంతున మాత్రమే వేతనం చెల్లిస్తున్నది.
మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఈ వేతనాలు చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కేజీబీవీ టీచర్లకు పనికి తగిన వేతనం లేదు, సెలవులు లేవు. విధులు ఒక అలుపెరగని పోరాటంగా మారింది. ఉదయం 9 గంటలకు పాఠశాలకు హాజరయ్యే టీచర్లు..ఒకవేళ నైట్ డ్యూటీ ఉంటే 28 గంటలు పనిచేయాలి. మరుసటిరోజు మధ్యాహ్నం 12:30 వరకు వారు విధుల్లోనే కొనసాగాల్సి పరిస్థితులు ఉన్నాయి. విరామం లేకుండా పనిచేయటం వల్ల వారు శారీరక, మానసిక అలసటకు గురవుతున్నారు. రాత్రి ట్యూటర్స్ ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదు.
ప్రమాదాలు జరిగినా, అనారోగ్యం పాలైనా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వరు. ఏడాదికి 20 క్యాజువల్ లీవ్స్ ఉన్నప్పటికీ, వాటి వినియోగంపై పెట్టిన నిబంధనలు కఠినంగా ఉంటున్నాయి. నెలకు రెండు సెలవులకు మించి వాడకూడదనే ఆంక్షలు, ఒక నెలలో వాడుకోని సెలవులను తర్వాతి నెలకు క్యారీఫార్వర్డ్ చేసుకునే అవకాశంలేదు. రోజుకు 8 పీరియడ్ల బోధనతోపాటు రికార్డుల నిర్వహణ. హాస్టల్, మెస్ పర్యవేక్షణ వంటి బహుముఖ బాధ్యతలతో టీచర్లు సతమతమవుతున్నారు.
రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తున్నా కేజీబీవీ టీచర్లు మాత్రం ప్రతి నెలా వేతనాల కోసం నిరీక్షించాల్సి రావడం విచారకరం. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఈ విషయంలో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇస్తున్న మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కేజీబీవీ టీచర్లకు కూడా వర్తింపజేయాలి. కేజీబీవీ టీచర్ చనిపోతే ఆ కుటుంబానికి కనీసం కారుణ్య నియామకం పథకం కూడా వర్తించదు, దీంతో బాధిత కుటుంబం రోడ్డున పడాల్సిందే. విధి నిర్వహణలో దొర్లే చిన్న తప్పులకు కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు.
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లను ప్రిన్సిపాళ్లుగా, పీజీసీఆర్టీలను జూనియర్ లెక్చరర్లుగా, సీఆర్టీలను స్కూల్ అసిస్టెంట్స్‌గా గుర్తించి వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ‘కాంట్రాక్టు’ అనే పదం తొలగించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు సమాన పనికి సమాన వేతనం అనే సహజ న్యాయసూత్రాలను అమలు చేస్తూ, వెంటనే మినిమమ్ టైంస్కేల్ ఇవ్వాలి. బదిలీలు, పదోన్నతులు కల్పించేలా సర్వీస్ రూల్స్, మార్గదర్శకాలు రూపొందించాలి.
– (వ్యాసకర్త: తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
తెల్కలపల్లి పెంటయ్య 9696900969