సంగారెడ్డి : జిల్లాలోని మంజీరా డ్యామ్ ( Manjira Dam ) ను ‘అమృత్ ధరోహర్’ పథకం కింద ఎకో టూరిజం కేంద్రం ( Eco-Tourism Hub ) గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ( MLA Chinta Prabhakar ) కేంద్రాన్ని కోరారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraj Ravichandra ) తో కలిసి శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్కు వినతిపత్రాన్ని అందజేశారు.
మంజీరా డ్యామ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ, దానికి సంబంధించిన వెట్ల్యాండ్కు అంతర్జాతీయ రామ్సార్ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంజీరా నదిపై నిర్మించిన మంజీరా డ్యామ్ తెలంగాణలో అత్యంత కీలకమైన జలాశయాల్లో ఒకటని వివరించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నదని వెల్లడించారు.
మంజీరా డ్యామ్ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, జీవవైవిధ్యం ఎకో టూరిజం అభివృద్ధికి విశేష అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. సమీపంలోని మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం, అందులోని మొసళ్లు, మంచినీటి తాబేళ్లు, అనేక జలచర జీవులకు నిలయంగా ఉండటంతో పాటు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా నిలిచిందని మంత్రి దృష్టికి తెచ్చారు.
మంజీరా వెట్ల్యాండ్లో సుమారు 313 రకాల పక్షులు, వాటిలో 117 రకాల వలస పక్షులు ప్రతి ఏడాది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నాయని చెప్పారు. అలాగే జలాశయంలోని తొమ్మిది సహజ ద్వీపాలు పక్షులు, ఇతర వన్యప్రాణుల గూళ్లు నిర్మించుకోవడానికి, సంతానోత్పత్తికి అనువైన ఆవాసాలుగా ఉండటంతో ఈ ప్రాంతం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవవైవిధ్యమైనదిగా గుర్తింపు పొందిందన్నారు.