Anandhi | తమిళ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొనగా, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సమయంలో నటి ఆనంది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘జన నాయగన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఆనంది, విడుదలైన వెర్షన్లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో మాట్లాడిన ఆనంది.. విజయ్ చివరి సినిమాలో నటించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది పాటు సమయం కేటాయించి, ఎంతో శ్రమించి పనిచేశానని తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత థియేటర్లో చూసినప్పుడు తన సన్నివేశాలు పూర్తిగా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పారు. ఒక పెద్ద స్టార్ సినిమా కావడంతో ఎంతో అంకితభావంతో పనిచేశానని, కానీ చివరకు తన పాత్రను పూర్తిగా తొలగించడం బాధ కలిగించిందన్నారు. ఒక నటిగా ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఎంతో నిరాశ కలిగించే విషయమని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెకు మద్దతుగా స్పందిస్తూ, నటీనటుల కష్టాన్ని గౌరవించాలని కామెంట్లు చేస్తున్నారు.
‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తం 12 కీలక మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ మార్పుల కారణంగా సినిమా నిడివి తగ్గించాల్సి రావడంతో కొన్ని పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు తొలగించి ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆనంది పాత్ర కూడా ఎడిటింగ్‌లో తొలగించబడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఆనంది కేవలం నటి మాత్రమే కాదు, క్లాసికల్ డ్యాన్సర్, యోగా ట్రైనర్ కూడా. టెలివిజన్‌లో ప్రసారమైన ‘డాన్స్ జోడి డాన్స్ 3.0’, ‘జోడి నంబర్ 1’ వంటి ప్రముఖ రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. పలు సీరియళ్లలోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.