నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ర్టాలపై స్పష్టమైన వివక్ష చూపుతున్నది. దక్షిణాది రాష్ర్టాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో 20 నుంచి 50 శాతం మాత్రమే తిరిగి పొందుతుండగా, బీహార్, యూపీ వంటి ఉత్తరాది రాష్ర్టాలు తాము చెల్లించిన పన్నులకు ఐదు నుంచి పదిహేను రెట్లు ఎక్కువగా పొందుతున్నాయి. ఈ అన్యాయంపై దక్షిణాది రాష్ర్టాలు గళమెత్తకుండా మరో కుట్ర జరుగుతున్నది. అదే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన.
పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలి.
జనాభా తాజా వివరాల ఆధారంగా పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయి. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు బలంగా ఉన్న ఉత్తరాది రాష్ర్టాల్లో భారీ సంఖ్యలో సీట్లు పెరుగుతాయి. దీంతో కేవలం నాలుగైదు ఉత్తరాది రాష్ర్టాల్లో సత్తా చాటగలిగిన పార్టీలు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితులు ఏర్పడుతాయి. అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ర్టాల మీద ఉత్తరాది పెత్తనం శాశ్వతమవుతుంది.
Loksabha
దేశంలో ప్రస్తుతం 545 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 543 స్థానాలకు అభ్యర్థులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. 1951-52లో దేశ జనాభా 36 కోట్లు. అప్పుడు లోక్‌సభ సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్యను 545కు పెంచారు. 1976లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. తాము జనాభాను నియంత్రిస్తే లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని అప్పట్లోనే దక్షిణాది రాష్ర్టాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో 1976లో ఎమర్జెన్సీ సమయంలో, లోక్‌సభ సీట్ల సంఖ్యకు మరో 25 ఏండ్లపాటు 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 2001లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నా.. నాటి ప్రధాని వాజపేయి హయాంలో 84వ రాజ్యాంగ సవరణ జరిపి, సీట్ల సంఖ్యను పెంచకుండా పునర్వ్యవస్థీకరణ చేశారు. కొన్ని జనరల్ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి వారి ప్రాతినిధ్యం పెంచారు. లోక్‌సభ సీట్ల పెంపు అంశాన్ని 2026కి వాయిదా వేశారు.
దీంతో మరోసారి అధికారంలోకి వస్తే 2026లో ఎలాగైనా నియోజకవర్గాలను పునర్విభజించాలని బీజేపీ భావిస్తున్నది. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చినా ఆ పని చేయక తప్పే పరిస్థితులు లేవు. ప్రస్తుతం 2011 జనగణన వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కరోనా కారణంగా 2021 జనగణనను వాయిదా వేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా మూడేండ్ల సమయం ఉన్నందున, 2021లో చేపట్టాల్సిన జనగణనను పూర్తి చేసి నియోజకవర్గాలను పునర్విభజిస్తారా? లేదా 2011 డేటాను పరిగణనలోకి తీసుకొని పునర్విభజన చేస్తారా అనేది అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
యూపీలో ప్రస్తుతం సీట్ల సంఖ్య 80. పునర్విభజనతో ఆ సంఖ్య 160కి పైగా పెరిగే అవకాశముంది. లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 14.7 శాతం నుంచి 16 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లు ఉండగా, అవి కూడా 52కి పెరుగుతాయని అంచనా. బీహార్ తదితర ఉత్తరాది రాష్ర్టాల్లో సీట్లు కూడా గణనీయస్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి. కానీ, దక్షిణాదికి మాత్రం నష్టం వాటిల్లనుంది. ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే సీట్ల సంఖ్య 25 నుంచి 52కు పెరుగుతుండగా, లోక్‌సభలో ఏపీ వాటా 4.6 శాతం నుంచి 4.3 శాతానికి పడిపోతుంది. తమిళనాడులో 28 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రాతినిధ్యం 7.2 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గుతుంది. కేరళలో కేవలం ఒక్క శాతమే సీట్లు పెరుగుతాయి. ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.7 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోతుంది. ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రాతినిధ్యం 3.1 శాతం నుంచి 3.3 శాతానికి పెరుగుతుంది. సీట్ల సంఖ్య ఇప్పుడున్న 17 నుంచి 39కి పెరిగే అవకాశముంది. 1967లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినప్పుడు దక్షిణ భారత రాష్ర్టాలు కొన్ని లోక్‌సభ స్థానాలను కోల్పోయాయి. తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి. (1977లో 42కి పెరిగాయి).
ఆందోళనకు కారణాలేమిటి?
జనాభా తాజా వివరాల ఆధారంగా పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయి. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు బలంగా ఉన్న ఉత్తరాది రాష్ర్టాల్లో భారీ సంఖ్యలో సీట్లు పెరుగుతాయి. దీంతో కేవలం నాలుగైదు ఉత్తరాది రాష్ర్టాల్లో సత్తా చాటగలిగిన పార్టీలు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దక్షిణాది రాష్ర్టాలకు చెందిన సీట్లతో అవసరం లేకుండా ఉత్తరాది వారే ప్రధాని కావచ్చు. దక్షిణ రాష్ర్టాల ప్రజల నిరసనలకు, వినతులకు విలువనిచ్చే అవకాశం ఉండదు. ఇది రాజకీయానికే పరిమితం కాదు. భాష, సంస్కృతి, నిధుల పంపకం.. ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ర్టాల మీద ఉత్తరాది పెత్తనం శాశ్వతమవుతుంది. ఇది దేశంలోని సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది.
పరిష్కార మార్గాలేమిటి?
తమిళనాడులో గతంలో నియోజకవర్గాలను తగ్గించడంపై మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రాష్ర్టాల ప్రాతినిధ్యాన్ని తగ్గించవద్దని, వీలుగాకపోతే తగిన ద్రవ్య పరిహారం చెల్లించాలని చెప్పింది. లోక్‌సభలో సీట్లు తగ్గిన రాష్ర్టాలకు రాజ్యసభలో అదనపు స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదని ప్రశ్నించింది. జనాభా మార్పుతో సంబంధం లేకుండా అదే సంఖ్యలో లోక్‌సభ నియోజకవర్గాలను ప్రకటించేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడానికి వీలుందో లేదో కేంద్రం పరిశీలించాలని సూచించింది. మద్రాస్ హైకోర్టుతోపాటు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్న పరిష్కార మార్గాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. దీనిపై సమగ్రమైన చర్చలతో, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలి. మరోవైపు, పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలి. లేకుంటే భారతదేశంలో దక్షిణాది ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఫిరోజ్ ఖాన్
96404 66464