అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతున్నది. అమెరికాలో ఈ మధ్య నెల రోజులు గడిపిన నాకు భారత్, అమెరికాల మధ్య ఎన్నికల ప్రచార తీరులో అనేక పోలికలు ఉన్నట్టుగా అనిపించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, బురదజల్లడాలు, విషం కక్కడాల వంటివి ఉమ్మడి లక్షణాలుగా భావించవచ్చు. అయితే అక్కడ కొంచెం ఇంకా మర్యాదామన్ననలు పాటిస్తుంటే, ఇండియాలో మాత్రం ప్రత్యర్థిని తక్కువచేసి చూపడానికి హద్దులుండవు.
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో సులభంగానే పోల్చవచ్చు. ఇద్దరూ డెబ్బయ్యో వడిలో ఉన్నారు. కాకపోతే ట్రంప్ ఓ నాలుగేండ్లు పెద్ద. మోదీ రోజూ యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యంతో ఉంటారు. కానీ, 75 ఏండ్ల ట్రంప్ అంత దిట్టంగా కనిపించరు. ఆసక్తికర విషయం ఏమంటే ట్రంప్, మోదీ ఇద్దరూ ఎన్నికల్లో దేవుని ప్రస్తావన తెస్తారు.
ఇక ఎన్నికలకు కొన్ని రోజులే ఉన్నాయి. ఎవరు వైట్‌హౌస్ విజేత అవుతారో అప్పుడే చెప్పగలిగే పరిస్థితి లేదు. ప్రత్యర్థులు ఇద్దరూ చురుకైన వాళ్లే. తక్షణ ప్రతిస్పందనను ఇస్తున్నవాళ్లే. వారి తరహాలోనే నరేం ద్ర మోదీ, రాహుల్‌గాంధీ ముఖాముఖి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నదా అని ఆలోచిస్తే గమ్మత్తుగా అనిపిస్తుంది. వారంత నిశ్చయంగా నిబ్బరంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ చర్చను కొనసాగించగలరా? జాతీయత, భద్రత, ప్రజా ప్రాముఖ్యానికి సంబంధించిన అంశాలను వారు చర్చించగలరా? కానీ, ఇద్దరూ అందుకు సిద్ధపడతారని చెప్పలేం. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీని రాహుల్ గాంధీ చర్చకు పిలిచినా ఏమీ జరగలేదు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ఒకరినొకరు దారుణంగానే తిట్టుకుంటున్నారు. కమలా హ్యారిస్ బైడెన్ కన్నా ఘోరమని, బలహీనురాలు, అసమర్థురాలు అని ట్రంప్ విమర్శిస్తున్నారు. కాగా, కమల తన ప్రత్యర్థిని అబద్ధాలకోరు అంటున్నారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ రెండున్నర గంటల పాటు ఒకే వేదికపై ఏకబిగిన చర్చించగలరా? లోక్‌సభలోనే ఇద్దరూ ముఖాముఖిగా ఎక్కువసేపు కూర్చున్న దాఖలాలు అయితే లేవు. ఇక భారతదేశంలో ఆయా రాష్ర్టాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అంశాల ఎంపిక జరుగుతుంటుంది. ప్రసంగాలలో అత్యధిక సమయం అవతలివారిపై బురద చల్లడానికే కేటాయిస్తుంటారు. మిగిలినది ఏదైనా ఉంటే చెంచాలు దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. అమెరికాలోని మీడియా సంస్థలు మన ఛానళ్ల తరహాలోనే తమ తమ పక్షపాత ధోరణులు కలిగి ఉన్నాయి. కమలా హ్యారిస్ 60 నిమిషాల పాటు సీబీఎస్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వండివార్చారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ముందు విచారణకు సీబీఎస్ న్యూస్‌ను రప్పిస్తానని కూడా బెదిరిస్తున్నారు. ఇక భారతదేశంలోనూ టీవీ చానళ్లు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గడం, అత్యధికం పాలక పక్షానికే జై కొట్టడం తెలిసిందే.
అతి పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికాకు, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌కు ఎన్నికల ప్రచా రం విషయంలో చాలా పోలికలున్నాయి. రెం డు దేశాల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదం లో పడ్డాయనే మాటలు పదేపదే వినిపిస్తుంటాయి. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నదని, రాజ్యాంగం మార్చేందుకు ఎత్తుగడలు వేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదే తరహాలో డొనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల తీర్పును ఇప్పటికీ ఒప్పుకోనేలేదు.
ఇండియాలో లాగే అమెరికాలోనూ తాయిలాలు ప్రకటించే సంస్కృతి బాగానే వర్ధిల్లుతున్నది. సమాజంలోని చిన్న వ్యాపారులు, యువత, మహిళలకు, ఇండ్లు లేనివారికి అన్నీ సమకూరుస్తామని అభ్యర్థులు ఇద్దరు హామీలు గుప్పించేస్తున్నారు. కమల హ్యారిస్ అయితే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి 50 వేల డాలర్లు రాయితీగా ఇస్తానని వాగ్దానం చేశారు. మొదటిసారిగా ఇల్లు కొంటున్నవారికి 25 వేల వరకు సహాయం అందజేస్తామని చెప్తున్నారు. భారత్‌లో ఎక్కువ ఓట్లు పొందేందుకు పార్టీ నేతలు సరిహద్దుల్లో చొరబాట్లకు మీరు కారణమంటే మీరు కారణమని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మనం చూస్తుంటాం. ఈ చొరబాటు అనేది బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల కారణంగా ఇండియాలోకి శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాల చుట్టూనే తిరుగుతుంది. వారు మనదేశంలో భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నారనే వాదనలూ వినిపిస్తుంటాయి. అమెరికా అంతకంటే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నది. చట్ట విరుద్ధమైన చొరబాట్లు బైడెన్ పరిపాలనలో తారస్థాయికి చేరాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కోటి పది లక్షల మంది కాందిశీకులను ఎలా వెనుక పంపిస్తారని నిలదీస్తున్నా రు. వెనిజులా తదితర దేశాల నుంచి అమెరికాకు నేర స్థులు వలస రావడం వల్ల ఆయా దేశాల్లో నేరాలు తగ్గాయని ఆయన వాదన. ఓట్ల కోసమే డెమొక్రాట్లు కాందిశీకులను రానిస్తున్నారని అంటారాయన. అది చాలదన్నట్టుగా స్ప్రింగ్ ఫీల్డ్‌లో స్థిరపడిన కాందిశీకులు అక్కడి ప్రజలు పెంచుకునే కుక్కలు, పిల్లులను తినేస్తున్నారని వింతైన ధోరణిలో మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని మీడియా తిరస్కరించింది. ఈలోగా చొరబాటుదారులు, జంతువులకు సంబంధించిన అనేక మీమ్‌లు సోషల్ మీడియాను ముంచెత్తాయి.
ఇక చీలిక రాజకీయాల గురించి ప్రత్యర్థి పార్టీలు ఆరోపించుకోవడమనేది అమెరికాలో, భారత్‌లోనూ ఉన్నది. ఇండియాలో కులవ్యవస్థ అయితే అమెరికా లో జాతి వివక్ష అంశాలుగా ఉంటాయి. కమలా హ్యారిస్ తండ్రి ఆఫ్రో-జమైకన్, తల్లి భారతీయ మూలాలున్న వ్యక్తి. తాను సాధారణ స్థాయి నుంచి పైకి వచ్చానని ఆమె చెప్పుకుంటుంటారు. ట్రంప్ విధానాలు వివక్షపూరితమైనవని, నల్లజాతి వారి పట్ల ఆయనకు వ్యతిరేకత ఉన్నదని, తాను గనుక అమెరి కా అధ్యక్ష పదవిని గెలిస్తే వారందరి సంక్షేమం కోసం విధానాలు, కార్యక్రమాలు తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నారు. మోదీ తాను చాయ్‌వాలా అని గతంలో పదేపదే చెప్పుకున్న సంగతి ఈ సందర్భంగా గుర్తుకు రాక మానదు. ఇలా ఎన్నో పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ భిన్నత్వాలకూ కొదవేం లేదు. అయితే మన దేశంలో ఎన్నికల ఫలితాలు సత్వరమే, అంటే అమెరికా కన్నా చాలా ముందుగా వెలువడుతుంటాయి. ఇది మనం కొద్దిగా గర్వించాల్సిన విషయం. అమెరికా ఇన్నాళ్లయినా ఆ స్థాయికి మాత్రం రాలేకపోయింది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
అనితా సలూజా