అన్నీ అయిపోయాయి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక కల్లాల పేరుతో చిల్లర రాజకీయాలు షురూ
చేసింది. తెలంగాణలో రూ.750 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 79 వేల వ్యవసాయ కల్లాలను కేంద్రం అడ్డుకోవడమే దానికి తాజా ఉదాహరణ. వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చు చేయవచ్చుననే నిబంధన ఉన్నా.. తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది.
నిధుల మళ్లింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. కల్లాల నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమంటే బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ భ యం పట్టుకున్నది. అందుకే ఏదోరకంగా బీ ఆర్ఎస్ను, ఆ పార్టీ నాయకులను ఇబ్బందు లు పెట్టడానికి ప్రధాని మోదీ తెలంగాణ ప్రజ ల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు.
గత వానకాలం నుంచి యాసంగి దాకా తెలంగాణలో వడ్లు కొనమంటే కొనబోమని కేంద్ర ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టింది. ఈ విషయంలో ఇప్పటికీ రాష్ట్రంపై అదే వివక్ష. పంజాబ్లోని మొత్తం వడ్లను కేంద్రమే కొనుగోలు చేస్తున్నది. అట్లాగే తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలని కేంద్రంపై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా కేంద్రం పట్టించుకోకపోవడం విడ్డూరం. దేశానికి అన్నం పెడుతున్న రైతు నోట్లో మట్టి కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలున్నాయని దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ధాన్యం కొనుగోలు చేయాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేసినవారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. నల్ల చట్టాలపై దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను గ్రహించిన ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేసి, బేషరతుగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఎండనక, వాననక రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనబోమని మొండిగా వ్యవహరించటం కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సబబు? ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధర వంటివన్నీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలి. ఎఫ్సీఐ ఉన్నది అందుకే కదా? దీనిపై కేంద్ర మంత్రులు ‘రైస్ కొనం, ముడి బియ్యం కొంటాం’ అని వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటు. కేంద్రం మొండికేయడంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది.
దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతు మెడకే ఉరి తాళ్లను చుట్టేలా వ్యవహరిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. నాడు తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు అందులో భాగమే. ఈ చట్టాలు చివరికి మోదీ మెడకే చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని రైతాంగం ఏడాదిగా ఆందోళనలు చేసింది. ఈ పోరాటంతో ఉత్తరాదిన బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పోరాటంలో రైతులు బలయ్యారు. రైతు ఉద్యమం తారస్థాయికి చేరుకున్నది. గత ఎనిమిదేండ్ల మోదీ హయాంలో అన్నీ రైతు వ్యతిరేక, తప్పుడు నిర్ణయాలే. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రధాని మోదీ విలువ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. నోట్ల రద్దుతో సామాన్య, పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. పేదలు, సామాన్యులు ఆర్థికంగా చితికిపోయారు.
మోదీ ప్రభుత్వంలో పేద ప్రజలకు, రైతులకు ఏమైనా లబ్ధి చేకూరిందా?
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా మోదీ ప్రభుత్వం కిమ్మనలేదు. వాహనాలతో తొక్కించి రైతులను బలిగొన్నది. ‘జైహింద్’ అంటూ జాతీయ జెండాలను చేతబూని ఏకంగా ఎర్ర కోటను ముట్టడించిన రైతులు ఆత్మగౌరవ పతాక ఎగుర వేశారు. అయినా బీజేపీ నెత్తికెక్కలే. చివరికి రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేసేలా ముఖ్యమంత్రులతో, పార్టీల నాయకులతో కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ చాలా సందర్భాలలో మోదీ విధానాలపై మాట్లాడారు. రాష్ర్టాలకు రావాల్సిన వాటా నిధుల విడుదల విషయంలో సైతం కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని బహిరంగం గా ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో బీఅర్ఎస్ జాతీయ రాజకీయాలు షురూ చేయడంతో మోదీకి, బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ప్రధాని మోదీ ఇంకా రైతుల పట్ల ఇదే వివక్ష చూపితే కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ రైతులకు వ్యతిరేకంగా ఉంటున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే రైతులు కార్చే కన్నీరులో బీజేపీ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదు. ‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం’ ఎన్నటికీ బాగుపడదనే విషయం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఎంత త్వరగా తెలుసుకొంటే దేశానికి అంత మంచిది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724