తెలంగాణలో గత ఏడాదిగా ప్రజల్లో, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో, న్యాయస్థానాల్లో నలుగుతున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వివాదం ఇంకా సాగదీయకుండా గౌరవప్రదంగా ముగించాలంటే ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలి. వెంటనే స్పీకర్ వాటిని ఆమోదించాలి. లేదా వారి సభ్యత్వాలను ఫిరాయింపు చట్టం కింద రద్దు చేయాలి. భారతదేశ చట్టసభల్లో ఫిరాయింపుల చరిత్రలో అత్యున్నత న్యాయస్థానం ఒక అసెంబ్లీ స్పీకర్ కాలాతీత నిర్ణయాధికారంపై ఇంతగా పదే పదే అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి.
రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజల ముందుకు వచ్చి ఉప ఎన్నికల్లో గెలిచే సాహసం చేయలేని దీనస్థితి దాపురించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వారిని మరింత నిరాశకు గురిచేశాయి. మరోవైపు నెత్తిపై అనర్హత కత్తి వేలాడుతూనే ఉన్నది. వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి. భవిష్యత్తు అగమ్య గోచరమైన నేపథ్యంలో కొందరు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకోవడానికి రాయబారాలు నడుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం? దానికో పరిమితి, పద్ధతి లేదా? అని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు ప్రశ్నిస్తున్నా బాధ్యులైన అసెంబ్లీ అధికారులు, వారి తరఫున వాదిస్తున్న దిగ్గజ న్యాయవాదులు రకరకాల సాంకేతిక అభ్యంతరాలను ముందుకుతెచ్చి కాలయాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. శిరస్సు వంచి దేశం నమస్కరించవలసిన అత్యున్నత న్యాయస్థానంతో దోబూచులాడుతున్న వారి జిత్తులమారితనం అవగతమవుతున్నది. ఈ కేసు ద్వారా అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి, సత్సంప్రదాయాన్ని నెలకొల్పే దిశగా ఒక చారిత్రాత్మకమైన తీర్పునిస్తుందన్న ఆశాభావం ప్రజల్లో ప్రజాస్వామికవాదుల్లో వ్యక్తమవుతున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి పార్టీ కార్యకర్తల కష్టంతో ప్రజల ఆమోదంతో గెలిచి వేలికంటించిన నల్ల సిరాచుక్క ఆరకముందే పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఎం.సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, టి.ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణ మోహనరెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, కండువాలు కప్పుకోవడం ప్రజలంతా చూశారు. స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ వేగం పుంజుకొన్న తరుణంలో న్యాయస్థానం కళ్లు కప్పడం కోసం నేనింకా బీఆర్ఎస్ అని ఒకరు, కప్పింది కాంగ్రెస్ కండువా కాదు దేవాలయ శేష వస్త్రమని మరొకరు, అనుమతి లేకుండానే తన ఫొటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీలలో ముద్రిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినదొకరు, ఎక్కడ వీడియోలో దొరికిపోతామోనన్న భయంతో గాంధీభవన్ సీఎల్పీ సమావేశాలకు దూరంగా ఉండేది ఒకరు, ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి కూడా అంతా ఉత్తిదే అంటున్నది ఇంకొకరు.
ప్రభుత్వ సలహాదారునైనా పార్టీ మారలేదని వేరొకరు ఇలా ఒకటా, రెండా? ఫిరాయింపు ఎమ్మెల్యేలు వేయని పిల్లి మొగ్గలు లేవు. గతంలో ఎన్నో పార్టీ ఫిరాయింపులు జరిగాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లినా కండువాలు కప్పుకోలేదు. పదవులు తీసుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్ట ప్రకారమే టీడీపీ, కాంగ్రెస్ శాసనసభాపక్షాలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయి. కానీ, ఇంత నిస్సిగ్గుగా ఫిరాయింపు నాటకాలకు తెర తీసిన సందర్భం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 26 మంది కాంగ్రెస్‌లో చేరి ఉంటే అది ఫిరాయింపు అయ్యేది కాదు. చట్ట ప్రకారం బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్‌లో విలీనమైనట్టుగా భావించేవారు. వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. గేట్లు తెరిస్తే అది సాధ్యమేనని కాంగ్రెస్ కాకి లెక్కలు వేసుకున్నది. కానీ అతి కష్టం మీద చేరింది పదిమంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ బోనులో నిలబడింది.
‘బీఆర్ఎస్ పనైపోయింది. మిగిలింది మేమే’ అని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్, ప్రకటించిన పథకాలన్నీ తమ రాష్ట్రంలో అమలుపరుస్తున్నామంటూ పక్క రాష్ర్టాలలో ప్రవచనాలు వల్లిస్తున్న కాంగ్రెస్ పది మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు పోయి ప్రజల తీర్పు కోరవచ్చు కదా? గెలిచి చూపించి ప్రభుత్వం పట్ల ప్రజామోదానికి అదే నిదర్శనమని ఢంకా బజాయించుకోవచ్చు కదా. ఒకవేళ పదిమందీ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. న్యాయస్థానం ముందు తలవంచే పరిస్థితి రాదు. భయమెందుకు? ప్రధానిగా రాజీవ్‌గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనుగుణంగానే ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటించగలరా? ఐదేండ్ల కిందట చట్టబద్ధంగానే బీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనీయనని భీషణ ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు చట్ట విరుద్ధంగా కాంగ్రెస్‌లో చేరిన ఈ 10 మందికి స్వాగత ద్వారాలు ఎలా తెరిచినట్టు?
ఫిరాయింపులు మరింత విచ్చలవిడిగా జడలు విప్పకుండా కళ్లెం వేసే శక్తి ఒక న్యాయస్థానాలకే ఉన్నది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఓడిపోయిన అభ్యర్థి న్యాయస్థానాలను ఆశ్రయిస్తే అవును నిజమే అనే లోపు గెలిచిన అభ్యర్థి పదవీకాలం పూర్తయిన సందర్భాలున్నాయి. అలాగే స్పీకర్ కాలయాపన వల్ల ఫిరాయింపుదారులు పబ్బం గడుపుకొంటున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. స్పీకర్‌కు ఉన్న నిరపేక్షమైన విచక్షణాధికారాలపై మరింత చర్చ జరగాలి. స్పీకర్ నిర్ణయానికి తగిన సమయం కాదు, నిర్ణీత సమయం ఉండాలి. ఈ ద్రవిడ ప్రాణాయామాలు, డొంక తిరుగుడు వ్యవహారాలు వద్దనుకుంటే చట్టసభల సభ్యుడు ఫిరాయించిన రోజే సభ్యత్వం రద్దు కావాలి. అందుకు కేంద్రం చొరవ చూపాలి.
ముక్తాయింపు… గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఆశించిన పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చాలా పరుషంగా మాట్లాడారు. ‘ముసలితనానికి ఇదేం పో యేకాలం. పార్టీ నీకేం తక్కువ చేసింది. సిగ్గుండాలి’ అంటూ తిట్టిపోశారు. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వయోధిక నాయకత్రయాన్ని అట్లాగే తిట్టిపోసి వెనక్కి పంపిస్తే రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం దక్కేది కదా.
-డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238