ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావటం తథ్యం. ఈ నేపథ్యంలో గెలుపు ప్రభావం కేవలం తెలంగాణకే కాకుండా, జాతీయ స్థాయిలోనూ చూపనున్నది. బీఆర్ఎస్ విజయంతో జాతీయ పార్టీ విస్తరణ మరింత వేగం పుంజుకోనున్నది. దీంతో దేశంలోని జాతీయ పార్టీల జాబితాలో బీఆర్ఎస్ కూడా చేరనున్నది.
కేసీఆర్‌కు ప్రాంతీయ పార్టీలతో మంచి స్నేహ సంబంధాలున్నాయి. దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలంగాణలో మాత్రం ప్రాంతీయ పార్టీల్లో ఏ ఒక్కటి పోటీ చేయడం లేదు.
ఇప్పటికే బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగు పెట్టింది. అక్కడ బీఆర్ఎస్ ప్రభంజనంలా వ్యాపిస్తున్నది. బీఆర్ఎస్కు మరాఠా ప్రజలు నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నది. అక్కడ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
దక్షిణాది రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతున్నది. ఒక్క కర్ణాటకలో మొన్న బీజేపీపై కోపంతో కాంగ్రెస్‌ను గెలిపించారు ఆ రాష్ట్ర ప్రజలు. ప్రాంతీయ పార్టీలను వేధించడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటైంది. అందు కే దమ్మున్న నాయకుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో ఉండాలనేది ప్రాంతీయ పార్టీల కోరిక. కేసీఆర్ ఇప్పుడు కొత్తగా జాతీయ నేతగా పరిచయం కావలసిన అవసరంలేదు. తెలంగాణకోసం కేసీఆర్ జాతీయ నాయకుడిగానే దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలను కూడగట్టారు. అప్పటి నుంచి అనేక ప్రాం తీయ పార్టీల నాయకులతో కేసీఆర్‌కు దోస్తానా ఉన్నది. తెలంగాణ ఏర్పాటు కోసం అనేక పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతాబెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ తదితర నాయకుల కంటే ముందు చూపుతో వ్యవహరించే జాతీయ స్థాయిలో బలమైన నాయకుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. కేసీఆర్ ఉన్నాడనే ధైర్యం వారికి ఉన్నది. కాంగ్రెస్ ఎంత ఎదిగితే ప్రాంతీయ పార్టీలకు అంత నష్టం.
కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు దూరం చేసుకోలేరు. తెలంగాణకు పెద్ద దిక్కుగా కేసీఆర్ తప్ప మరొకరిని ఊహించలేం. అరవై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నో తరాల బిడ్డలకు నష్టం జరిగింది. రాష్ట్రం కోసం పేగులు ఎండ బెట్టుకుని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిం డు. పదేండ్లలో వందేండ్ల అభివృద్ధితో తెలంగాణ ముందుకు పోతున్నది. ఇలాం టి తరుణంలో తెలంగాణ ప్రజలు తమ బిడ్డ వైపే ఉంటారు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ఉన్నతమైన, విశ్వసనీయత గల కేసీఆర్ లాంటి నాయకుడు తప్పనిసరి. కాంగ్రెస్, బీజేపీ లను ఎదుర్కొనేది కేసీఆరే. తెలంగాణను గెలిచేది కేసీఆరే. ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా నాయకత్వం వహించేది కేసీఆరే.
జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా దేశంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నది తెలిసిందే. తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం.
కేసీఆర్ గులాబీ జెండా ఎగుర వేస్తే జాతీయ పార్టీల రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకమవుతుంది. ‘కేసీఆర్ అనే రాజకీయ సంచలనాన్ని తట్టుకోలేం’ అంటూ ఒకరి కొకరు పోటీ అన్నట్టు కేసీఆర్‌ను గద్దె దించాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రాకుండా మొత్తం తెలంగాణ మీదనే కాంగ్రెస్, బీజేపీలు ఫోకస్ పెట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ను రానివ్వద్దంటూ ఆ పార్టీలు కూడబలుక్కున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ టీపీ, జనసమితి ఒక వైపు, బీజేపీ, జనసేన మరో వైపు కూటములు కట్టి కేసీఆర్‌ను ఎదుర్కోవాలని కుట్రలు చేస్తున్నాయి. వీళ్లు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే మళ్ళీ పట్టం కట్టనున్నారు. ప్రస్తు తం తెలంగాణ అంతటా గులాబీ పవనాలు వీస్తున్నాయి.
చిటుకుల మైసారెడ్డి
94905 24724