Telangana | ‘ప్రముఖులందరూ అత్యంత విమర్శలకు గురైనవారే’ అన్న స్వామి వివేకానంద సూక్తి కె.చంద్రశేఖరరావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగిన అవిశ్రాంత పోరాటం, స్వరాష్ట్రం కల సాకారమైన తర్వాత గత పదేండ్లలో సాధించిన తెలంగాణ ప్రగతి శాశ్వతమైనది. దీర్ఘకాలిక ప్రజా సంక్షేమానికి ఆధారభూతమైనది. తెలంగాణ రాష్ట్ర సాధనకు అస్తిత్వ తాత్విక పునాదులు, ప్రజాబలం ఎంత బలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా చతికిలబడిన ఉద్యమాన్ని నిటారుగా నిలిపి రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పాత్ర అమోఘమైనదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఊహకందని వ్యూహాలతో 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని సజీవంగా నిలిపి విమర్శలు, కువిమర్శల ధాటిని తట్టుకొని సర్వశక్తుల్ని సమీకరించి తన నాయకత్వ ప్రతిభను, ప్రతాపాన్ని కేసీఆర్ ప్రదర్శించిన తీరును శత్రువులైనా అంగీకరించి తీరాల్సిందే. కాలం మరుగునపడేసేంత అత్యంత అల్పమైన సంఘటన కాదు అది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పరిస్థితి అందరూ చూస్తున్నదే. ఇంతటి దారుణ పరిస్థితిలో కేసీఆర్ అత్యంత దూకుడుతో, రాష్ట్ర సాధన నాటి ప్రాణాపాయస్థితిని లెక్కచేయకుండా, తన సహజ లక్షణాన్ని పునరుజ్జీవింపజేసుకొని రంగప్రవేశం చేయడం ఒక అద్భుత, ఆశావహ దృక్పథం. సమకాలీన రాజకీయ రంగంలో ఈ స్థాయిలో ఆలోచించగలిగే, దుర్భర పరిస్థితులకు తట్టుకొని నిలిచి అరాచకాలను, అనాగరిక కుట్రల్ని ఛేదించి నిలువరించగలిగే సత్తా ఉన్న ఒకే ఒక్కడు కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా దుర్భిణితో గాలించినా ఈ స్థాయి రాజకీయ చాతుర్యం, అవగాహనాసామర్థ్యం ఉన్న వ్యక్తి కనిపించరు. రాజకీయ కలుషిత వికారాల్ని భరిస్తూ.. నిశ్చలంగా, నిర్భయంగా, నిబ్బరంగా, సంయమనంతో, ద్విగుణీకృత ఉత్సాహంతో కేసీఆర్ మళ్లీ అత్యంత దూకుడుతో రాజకీయ రణరంగంలోకి దూకడం ఆహ్వానించదగిన పరిణామం.
తెలంగాణ ఉద్యమం, పదేండ్ల పాటు సాగిన ఆదర్శవంతమైన పాలన (కల్లబొల్లి నిందలతో ఎంతగా గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం కొనసాగినా) కేసీఆర్‌కు ఒక వరప్రసాదమై, ఎటువంటి దుర్భర పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ైస్థెర్యాన్ని కల్పిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
కేసీఆర్ నెలకొల్పిన మైలురాళ్లు అటు ఉద్యమంలో ఇటు రాష్ట్ర పాలనలో గత 70 ఏండ్లలో ఎవరూ ఊహించనివి. ఆయన అమలు చేసిన నవ్య ప్రణాళికలు, ప్రజా సంక్షేమానికి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు కాల పరీక్షలో చిరస్థాయిగా నిలిచేవే. బీఆర్ఎస్ కూలిపోతుందని మానసిక వికారాల్ని ప్రచారాల్లో ఉంచి, తమ రాజకీయ స్వలాభం కోసం పరితపిస్తున్న నేతలు తమ తమ రాజకీయ వేదాంతం, తాత్విక పునాదులు ఎంత బలంగా ఉన్నాయో ఆలోచించుకోవాలి. సవాలక్ష కుంభకోణాలతో, రాజకీయ మనుగడ కోసం భారత రాజకీయం ఎంతగా బరితెగించిందో, ఎన్ని దుష్ట సంప్రదాయాలకు ఆలవాలమైందో విజ్ఞులైన మేధావులు ఆలోచించాలి. గత 70 ఏండ్లలో వివిధ పార్టీల పాలనలో ఆయా ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి ఫలాల కంటే వారు నాటిన విష బీజాలే ఎక్కువన్న విషయం నిజం కాదా? ఆ విషబీజాలే దేశాన్ని నేడు పీడిస్తున్న దురవస్థకు కారణం కాదా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మేధావుల ముసుగులో ఉన్న కొందరు గతాన్ని మరిచి, రొడ్డకొట్టుడు విమర్శలనే నిరంతరం విశదీకరిస్తూ, విశ్లేషిస్తూ, ఘోషించడం సరైనదేనా? శాశ్వత ప్రమాణాలైన తెలంగాణ ఉద్యమ స్వరూపం, స్వరాష్ట్రం సాధించిన ప్రగతిని నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణ వ్యతిరేకులకు వంతపాడటం అభిలషణీయమేనా? పదేండ్లుగా అభివృద్ధి ఫలాల్ని అనుభవిస్తూ, వేనోళ్ల కీర్తిస్తున్న తెలంగాణీయుల వేదనను అర్థం చేసుకోరా? నేడు ప్రజలు అనుభవిస్తున్న అరాచకీయం, ప్రగతి శూన్యత కండ్లకు కనిపిస్తూనే ఉన్నది కదా! వ్యక్తిత్వ హననం, వెగటు పుట్టించే దూషణల పర్వంపై ఎవరూ స్పందించరేం? జాతి లేదా రాష్ట్ర భవితవ్యాన్ని తీర్చిదిద్దే దిశగా మేధావులు, చింతనాపరులు దిశానిర్దేశం చేయకపోతే వారి మేధోసంపదకే కళంకం కాదా? విజ్ఞులారా ఆలోచించండి!
-కె.లక్ష్మణ్‌గౌడ్
97049 30509